Tollywood heroines: ‘రాధిక’ నుంచి ‘సీత’ వరకూ.. గుర్తుండిపోయే పాత్రలివి.. 2022 రివైండ్‌!

2022లో ప్రేక్షకులను బాగా మెప్పించిన కథానాయిక పాత్రల వివరాలివి. ఎవరెవరు ఏ సినిమాలో ఎలా నటించి ఆకట్టుకున్నారంటే?

Updated : 20 Dec 2022 17:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమా జయపజయాలతో సంబంధం లేకుండా కొన్ని కథానాయికల పాత్రలు మంచి ప్రభావాన్ని చూపుతాయి. క్యారెక్టర్‌ నేమ్‌.. పాటలు, సంభాషణల్లో ఉండడం, ప్రచారంలో పలుమార్లు ఆ పేర్లను చెప్పడం వల్ల అవి ప్రేక్షకులకు బాగా దగ్గరవుతాయి. అలా ఈ ఏడాదిలో బాగా అలరించిన పాత్రలు, వాటిల్లో ఒదిగిన నాయికలను గుర్తు చేసుకుందాం..

రాధికను మర్చిపోవడం కష్టమే!

తెలుగు ప్రేక్షకుల నోళ్లలో ఈ ఏడాది బాగా నానిన పేరు ఏదంటే ‘రాధిక’నే సమాధానం. ‘డీజే టిల్లు’ (DJ Tillu) సినిమాలో నేహాశెట్టి (Neha Shetty) పోషించిన పాత్ర అది. సింగర్‌ అయిన రాధిక ఓ హత్య కేసులో ఇరుక్కోవడం.. దాన్నుంచి ఆమెను బయటపడేసేందుకు హీరో ప్రయత్నించడం.. ఆ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు రావడం.. దాంతో హీరో క్యారెక్టర్‌ ఫ్రస్టేషన్‌కు గురై, రాధికపై ఉన్న కోపాన్ని తీర్చుకునే తీరు ప్రేక్షకులను మెప్పించింది. ఓ సన్నివేశంలో ‘రాధిక అక్క’ అంటూ కథానాయకుడు పిలవడం నవ్వులు పంచింది. స్వతహాగా తన ప్రదర్శన కంటే హీరో టీజ్‌ చేయడం వల్లే హీరోయిన్‌ క్యారెక్టర్‌కు మంచి క్రేజ్‌ వచ్చింది. టిల్లుగా హీరో సిద్ధు జొన్నలగడ్డ సైతం యువతలో విశేష ఆదరణ పొందారు. ఈ చిత్రాన్ని దర్శకుడు విమల్‌ కృష్ణ తెరకెక్కించారు. 


కళావతి లేకుంటే.. 

కీర్తి సురేశ్‌ (Keerthy Suresh)ను కొత్త కోణంలో చూపించిన చిత్రం ‘సర్కారు వారి పాట’(Sarkaru Vaari Pata). మహేశ్‌బాబు హీరోగా పరశురామ్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో ఆమె కళావతిగా కనిపించారు. ఆకతాయి అమ్మాయిగా కీర్తి చేసిన అల్లరి కట్టిపడేస్తుంది. ఆమె మాయలో పడిన హీరో ‘కమాన్‌ కమాన్‌ కళావతి నువు లేకుంటే అధోగతి’ అని పాటను ఆలపించడంతో ఆ పేరు మారుమోగింది.


మృణాళ్‌, అలియా

రామరాజు సీత.. రామ్‌సీత

అమితంగా ఆకర్షించే పేర్లలో సీత ఒకటి. ఇప్పటికే ఈ పేరుతో ఎన్నో పాత్రలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకోగా ఈ ఏడాది మరో రెండు ‘సీత’ పాత్రలు మైమరపించాయి. వాటిల్లో ఒకటి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) సినిమాలోని అలియా భట్‌ (Alia Bhatt) పోషించింది కాగా, ‘సీతారామం’ (దర్శకుడు: హను రాఘవపూడి)లో మృణాళ్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) నటించింది మరొకటి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (దర్శకుడు: రాజమౌళి)లో రామ్‌ చరణ్‌ రామరాజుగా నటించగా ఆయన మరదలిగా అలియా అభినయం తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ‘సీతారామం’ (Sita Ramam)లో.. లెఫ్టినెంట్‌ అధికారి అయిన రామ్‌ (దుల్కర్‌ సల్మాన్‌)కు ఉత్తరాలు రాస్తూ ప్రేమను పండించింది మృణాళ్‌. తొలి ప్రయత్నంలోనే ఈ ఇద్దరు బాలీవుడ్‌ నాయికలు తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.


సర్పంచి నాగలక్ష్మి

నాగ చైతన్య సరసన కృతిశెట్టి (Krithi Shetty) నటించిన చిత్రం ‘బంగార్రాజు’ (bangarraju). 2022 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమాలో ఆమె సర్పంచి నాగలక్ష్మి అనే పాత్రలో నటించారు. చాలా సరదాగా ఉండే క్యారెక్టర్‌ అది. పల్లెటూరి అమ్మాయిగా కృతి ఆహార్యం, హావభావాలు అందరినీ ఆకర్షించాయి. ఈ చిత్రంలోని నాగ చైతన్య, కృతిల హంగామా అంతా ఇంతా కాదు. చాలామంది బావామరదళ్లకు ఈ క్యారెక్టర్‌ బాగా కనెక్ట్‌ అయింది. కల్యాణ్‌ కృష్ణ కురసాల దర్శకత్వంలో వహించిన ఈ సినిమాలో నాగార్జున, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.


నీలాంబరి.. వయ్యారాల వల్లరి

‘నీలాంబరి నీలాంబరి వేరెవ్వరే నీలా మరి’.. అని ఎందరితోనో పాట పాడించిన నాయిక పూజాహెగ్డే (Pooja Hegde). ‘ఆచార్య’ (Acharya) సినిమాలోని ఆమె పాత్ర పేరుతో సాగే గీతమిది. ఈ మెలొడీ నీలాంబరి పాత్రకు బలాన్ని తీసుకొచ్చింది. ఆ క్యారెక్టర్‌కు పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా పేరు ఆకట్టుకుంది. చిరంజీవి, రామ్‌ చరణ్‌ కథానాయకులుగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన చిత్రమిది. దీంతోపాటు, ప్రభాస్‌ సరసన పూజా నటించిన ‘రాధేశ్యామ్‌’ (Radhe Shyam)లోని ‘ప్రేరణ’ పాత్రా ఎక్కువగా మంది ప్రేక్షకులకు చేరింది. రాధాకృష్ణ కుమార్‌ దర్శకుడు.


ప్రేమ కోసం వెన్నెల పోరాటం

నక్సలిజం నేపథ్యంలో సాగే అద్భుతమైన ప్రేమకథగా తెరకెక్కిన చిత్రం ‘విరాట పర్వం’ (Virata Parvam). ఇందులో కామ్రేడ్‌ రవన్న పాత్రలో రానా నటించగా ఆయన్ను ప్రేమించిన యువతి వెన్నెలగా సాయి పల్లవి (Sai Pallavi) జీవించారు. మనసుపడిన వాడితో కలిసి చావడానికైనా సిద్ధమే అనే తెగింపు ఉన్న ఆ పాత్రకు సాయి పల్లవి తప్ప మరెవరూ సరిపోరు అని అనిపించుకున్నారు. వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని