Priyadarshi: ఆ చిత్రానికి, ‘ఓం భీమ్‌ బుష్‌’కి పోలిక ఉండదు: ప్రియదర్శి

తన తాజా చిత్రం ‘ఓం భీమ్‌ బుష్‌’ గురించి పలు విశేషాలు పంచుకున్నారు ప్రియదర్శి.

Published : 17 Mar 2024 23:35 IST

హైదరాబాద్‌: క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించి కథానాయకుడిగా మారిన వారిలో ప్రియదర్శి (Priyadarshi) ఒకరు. శ్రీవిష్ణు, రాహుల్‌ రామకృష్ణలతో కలిసి ఆయన నటించిన తాజా చిత్రం ‘ఓం భీమ్‌ బుష్‌’ (Om Bheem Bush). ఈ చిత్రం మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రియదర్శి విలేకరులతో ముచ్చటించారు. వైవిధ్యం చూపించాలంటే క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానే ఉండాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. హీరోగా కంటే తనను నటుడిగానే చూసుకోవడానికి ఇష్టపడతానని తెలిపారు. హీరో అయితే ఓ ఇమేజ్‌ ఏర్పడుతుందని, దాని వల్ల కొత్తగా ప్రయత్నించేందుకు అవకాశాలు తక్కువ ఉంటాయని అన్నారు. నటుడిగా ఉంటే ఛాన్స్‌లు కూడా ఎక్కువగా వస్తాయని పేర్కొన్నారు.

‘ఓం భీమ్‌ బుష్‌’ గురించి మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు శ్రీహర్ష కొనుగంటితో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఆయన గతంలో తెరకెక్కించిన సినిమాల్లో నేను నటించాల్సి ఉందిగానీ కుదర్లేదు. ఈ మూవీ కాన్సెప్ట్‌ చాలా కొత్తది. స్నేహితులతో కలిసి నటించడం మరిచిపోలేని అనుభూతి. మేం ఇంతకుముందు ‘బ్రోచేవారెవరురా’లో కలిసి నటించాం. కానీ, ఆ సినిమాకి, ఈ కొత్త చిత్రానికి ఎక్కడా పోలిక ఉండదు. కొందరు అనుకుంటున్నట్లు ఆ మూవీకి ‘ఓం భీమ్‌ బుష్‌’ సీక్వెల్‌ కాదు. సినిమా ప్రారంభమైనప్పుడు ఆ టైటిల్‌ అనుకోలేదు. చిత్రీకరణ సమయంలో మేం సరదాగా మాట్లాడుకునే మాటల్లోంచి దాన్ని తీసుకున్నాం. కథకు సెట్‌ అయింది. అసభ్యతకు తావులేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ చిత్రం ఉంటుంది’’ అని తెలిపారు.

శ్రీకాంత్‌ హీరోగా తెరకెక్కిన ‘టెర్రర్‌’ చిత్రంతో ప్రియదర్శి తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత కమెడియన్‌గా ప్రేక్షకులను అలరించారు. ‘మల్లేశం’తో కథానాయకుడిగా మారారు. గతేడాది విడుదలైన ‘బలగం’, ‘మంగళవారం’లో ప్రధాన పాత్రలు పోషించి, మెప్పించారు. మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించనున్న ఓ సినిమాకి హీరోగా ఎంపికయ్యారు. మరోవైపు, ‘గేమ్‌ ఛేంజర్‌’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. రామ్‌ చరణ్‌ హీరోగా శంకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని