Priyamani: అనుపమలా ఎలాంటి యూట్యూబ్‌ ఛానెల్‌ను ప్రారంభించను: ప్రియమణి

ప్రియమణి ప్రధాన పాత్రలో రూపొందిన ఓటీటీ చిత్రం ‘భామా కలాపం’.కోల్‌కతా మ్యూజియంలో అపహరణకు గురైన రూ. 200 కోట్ల గుడ్డు చుట్టూ తిరిగే  సన్నివేశాలతో ట్రైలర్‌ ఆసక్తికరంగా నిలిచింది. ఇందులో ప్రియమణి అనుపమ అనే కుకింగ్‌ యూట్యూబర్‌గా కనిపించనుంది. ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ను 

Updated : 08 Feb 2022 11:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రియమణి ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘భామా కలాపం’. కోల్‌కతా మ్యూజియంలో అపహరణకు గురైన రూ.200 కోట్ల విలువైన గుడ్డు చుట్టూ తిరిగే కథతో సినిమా సాగనుంది. ఇందులో ప్రియమణి అనుపమ అనే కుకింగ్‌ యూట్యూబర్‌గా కనిపించనుంది. ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ను అభిమన్యు తెరకెక్కించారు. ఈ సినిమా ఫిబ్రవరి 11 నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్‌కానుంది. ఈ సందర్భంగా ప్రియమణి ‘భామా కలాపం’ గురించి పలు ఆసక్తికర విషయాలను ఇలా పంచుకుంది..

అనుపమకు ఆ ఆసక్తి ఎక్కువ

‘‘ఇందులో నా పాత్ర పేరు అనుపమ. గతంలో ఇలాంటి తరహా పాత్రను నేను పోషించలేదు. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఓ మధ్య తరగతి గృహిణి, కుటుంబాన్ని ప్రేమిస్తుంది. ‘అనుపమ ఘుమఘుమ’ యూట్యూబ్ ఛానెల్‌ నిర్వహిస్తుంటుంది. రుచికరమైన రెసిపీలను వండి వీడియోస్‌ను పోస్ట్‌ చేస్తుంటుంది. ఆమె కుటుంబ నిర్వహణ చూసుకోవడమే కాదు.. పొరుగింటి కుటుంబాల్లో ఏం జరుగుతుందోనని తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ. అదేమీ దురుద్దేశంతో కాదు’’

స్పాట్‌లోనే చేసేశా..

‘‘ఈ పాత్రను పోషించేందుకు నిజజీవితంలో ఎవరినీ చూసి నేను స్ఫూర్తి పొందలేదు. అంతా స్పాట్‌లోనే చేసేశా. దర్శకుడు నాకు మొదట కథ చెప్పినప్పుడు బాగా ఆకట్టుకుంది. తన గురించి కాకుండా పక్కవారి జీవితాలను తెలుసుకునేందుకు ఆసక్తి కనబరిచే మహిళ పాత్ర కొత్తగా అనిపించింది’’

సవాలుతో కూడుకున్న పాత్ర ఇది

‘‘గతంలో ఇలాంటి తరహా పాత్రను ‘రగడ’లో పోషించా. ఆ తరువాత ఇదే అనుకుంటా. హాస్యం కూడా కచ్చితంగా ఉంటుంది. అయితే ‘రగడ’లో ఉన్నంత కాదు. అయినా ఇది సవాలుతో కూడిన పాత్రే.  ఓ సంఘటన నుంచి బయటపడేందుకు ఆమె చేసే ప్రయత్నాలు ఫన్నీగా అనిపిస్తాయి. కెమెరామెన్‌ దీపక్‌, దర్శకుడు అభిమన్యు సింగిల్‌ టేక్‌తో సరిపెట్టుకునేవారు కాదు. ‘మేడమ్‌..! ఇంకో టేక్‌ చేద్దామంటుండే వారు’ ఓ నటిగా నేర్చుకునేందుకు ఈ సినిమా ఎంతో ఉపయోగపడింది. కామెడీ, థ్రిల్లర్‌ మేళవింపే ‘భామా కలాపం’’

నేను అమాయకురాలిని కాదు..

‘‘అనుపమ గురించి ఒక్క వాక్యంలో చెప్పాలంటే ‘మెడ్లింగ్‌’ అనే చెప్తా. అనుపమలో నచ్చని విషయాలంటే.. ఇతరుల జీవితాల్లో తొంగి చూడటం. నచ్చింది అంటే ఆమె అమాయకత్వం. నిజజీవితంలో నాకు అనుపమకి ఎలాంటి పోలికలు లేవనే చెప్పాలి. తను వంటల్లో ఎక్స్‌పర్ట్‌. నిజజీవితంలో నాకు వంటలు రావు, అమాయకురాలినీ కాదు (నవ్వులు). భరత్‌ కమ్మతో పని చేయడం గ్రేట్‌గా కనిపించింది. దర్శకుడికి చిత్రీకరణ విషయంలో సలహాలిస్తుండేవారు.  నేను ఎలాంటి యూట్యూబ్‌ ఛానెల్‌ను ప్రారంభించను. ఎందుకంటారా.. నాకంత ఓపికా లేదు’’

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని