Agent: ఫెయిలయ్యాం.. క్షమించండి.. ‘ఏజెంట్‌’ ఫలితంపై నిర్మాత ట్వీట్‌

తమ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో రూపొందిన తాజా చిత్రం ‘ఏజెంట్‌’ ఫలితంపై నిర్మాత అనిల్‌ సుంకర స్పందించారు. సినిమా విజయవంతంకాకపోవడానికి కారణమేంటో తెలిపారు.

Published : 02 May 2023 05:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అఖిల్‌ అక్కినేని (Akhil Akkineni) హీరోగా దర్శకుడు సురేందర్‌ రెడ్డి (Surender Reddy) తెరకెక్కించిన చిత్రం ‘ఏజెంట్‌’ (Agent). ఏప్రిల్‌ 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఫలితంపై నిర్మాత అనిల్‌ సుంకర (Anil Sunkara) స్పందించారు. ట్విటర్‌ వేదికగా ఆయన విశ్లేషించారు.

‘ఏజెంట్‌’ విషయంలో పూర్తి బాధ్యత తమదే అని స్పష్టం చేశారు. పెద్ద టాస్క్‌ అని తెలిసినా దాన్ని సాధించగలమనే నమ్మకంతో సినిమా చేశామని, అయితే అది ఫెయిల్‌ అయిందని తెలిపారు. స్క్రిప్టు పక్కాగా సిద్ధంకాకముందే చిత్రాన్ని ప్రారంభించడం తప్పిదమని పేర్కొన్నారు. మధ్యలో కొవిడ్‌ సహా పలు సమస్యలు చుట్టుముట్టాయన్నారు. సినిమా ఫలితం విషయంలో తాము ఎలాంటి సాకులు చెప్పాలనుకోవడంలేదని, ఆ కాస్ట్‌లీ మిస్టేక్‌ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నామన్నారు. ఈ తరహా తప్పులు పునరావృతం కాకుండా ఏం చేయాలో చూస్తామన్నారు. తమపై ఎంతో నమ్మకం పెట్టుకున్న వారికి క్షమాపణలు చెప్పారు. తదుపరి ప్రాజెక్టులతో ఆ లోటును భర్తీ చేస్తామని ప్రేక్షకులకు మాట ఇచ్చారు. సంబంధిత ట్వీట్‌ క్షణాల్లోనే నెట్టింట వైరల్‌గా మారింది. సినిమా ఫలితాన్ని నిర్మాత తన భుజాలపై వేసుకోవడం గొప్ప విషయమని పలువురు సినీ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో సుమారు రూ. 80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిందీ చిత్రం. అఖిల్‌ పూర్తి యాక్షన్‌ మూవీ చేయడం, మలయాళ ప్రముఖ నటుడు మమ్ముట్టి కీలక పాత్ర పోషించడం, డైరెక్టర్‌- హీరో క్రేజీ కాంబోకావడంతో ‘ఏజెంట్‌’పై ముందు నుంచీ ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతూ వచ్చాయి. టీజర్‌, ట్రైలర్లు వాటిని ఇంకాస్త పెంచాయి. కానీ, ఆ స్థాయి అంచనాలను చిత్రం అందుకోలేకపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని