Radheshyam: నాలో ఆసక్తి రేపిన కథ

‘ జిల్‌’ సినిమాతో తొలి అడుగులోనే.. దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కె.రాధాకృష్ణ కుమార్‌. రెండో ప్రయత్నంగా హీరో ప్రభాస్‌తో ‘రాధేశ్యామ్‌’ను తెరకెక్కించారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ పాన్‌ ఇండియా చిత్రం

Published : 28 Feb 2022 13:29 IST

‘ జిల్‌’ సినిమాతో తొలి అడుగులోనే.. దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కె.రాధాకృష్ణ కుమార్‌. రెండో ప్రయత్నంగా హీరో ప్రభాస్‌తో ‘రాధేశ్యామ్‌’ను తెరకెక్కించారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ పాన్‌ ఇండియా చిత్రం మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు రాధాకృష్ణ. ఆ సంగతులు ఆయన మాటల్లోనే..

అలా మొదలై

‘జిల్‌’ సినిమా తర్వాత నేను యూవీ క్రియేషన్స్‌లోనే మరో సినిమా చేయాల్సి ఉంది. దానిపై వర్కవుట్‌ చేస్తున్నప్పుడే.. ఈ కథను ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన వచ్చింది. ఈ స్క్రిప్ట్‌ పాయింట్‌ విషయానికొస్తే.. 18ఏళ్ల క్రితం చంద్రశేఖర్‌ యేలేటి, నేను కలిసి ఓ లైన్‌పై పనిచేశాం. అయితే అప్పట్లో దానికి సరైన ముగింపు దొరక్కపోవడంతో పక్కకు పెట్టేశాం. ఆ కథాలోచన నా మదిలో అలాగే ఉండిపోయింది. ఒకరకంగా నాకు సినిమాలపై మరింత ఆసక్తి పెంచడానికి కారణమైన కథ ఇదే. నేను రెండో చిత్రం చేయాలనుకున్నాక.. ఆ కథకు ఓ సరైన ముగింపు సిద్ధం చేశాను. తర్వాత నిర్మాతలకు, ప్రభాస్‌కు కథ చెప్తే చాలా బాగుందన్నారు’’.

ఆ నిర్ణయం అప్పుడే

ప్రభాస్‌కు నేనీ కథను ‘బాహుబలి’ కంటే ముందే చెప్పాను. ఆ సినిమాపై మాకున్న నమ్మకంతోనే దీన్ని కచ్చితంగా పాన్‌ ఇండియా స్థాయిలోనే తీయాలని అప్పట్లోనే నిర్ణయించుకున్నాం. బడ్జెట్‌ విషయంలోనూ నిర్మాతలు ఎప్పుడూ భయపడలేదు. నేనీ కథకు తొలుత అనుకున్నది ప్రభాస్‌నే. అయితే ఆయన ఈ స్క్రిప్ట్‌ చేస్తారో.. లేదో? అనే అనుమానం ఉండేది. నిజానికి అప్పటికి ఆయన ఇలాంటి ఓ విభిన్నమైన ప్రేమకథ చేయాలన్న ఆలోచనలోనే ఉన్నారు. రెండున్నర గంటలు కథ విన్నాక.. బాగుంది, చేసేద్దామన్నారు. ఈ చిత్ర కథను నేను తొలుత ఇండియాలోని ఓ హిల్‌స్టేషన్‌ నేపథ్యంలో రాసుకున్నాను. ప్రభాస్‌ సలహాతోనే దాన్ని యూరోప్‌ నేపథ్యానికి తగ్గట్లుగా మార్చాను. ఎందుకంటే ఈ నేపథ్యం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచిస్తుంది. ఇటలీ, ఆస్ట్రియా, జార్జియా తదితర దేశాల్లో చిత్రీకరణ పూర్తి చేశాం’’.

విక్రమాదిత్య పాత్రకు.. అతనే స్ఫూర్తి

‘‘విధికి.. ప్రేమకు మధ్య సాగే ఆసక్తికర ప్రేమకథా చిత్రమిది. ఇందులో విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా కనిపిస్తారు. 18 - 19వ శతాబ్దాల మధ్య కాలంలో యూరోప్‌లో కీరో అనే ఓ ప్రముఖ హస్తసాముద్రికా నిపుణుడు ఉండేవారు. ఆయన భారత్‌కు వచ్చి.. హిమాలయాల్లో ఉండే భారతీయ యోగుల నుంచి హస్తసాముద్రికం నేర్చుకున్నాడు. తర్వాత దేశ విదేశాల్లో ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నాడు. దేశ ప్రధానులు, కొందరు ప్రముఖులకే జ్యోతిష్యం చెప్పేవాడు. ఆయన స్ఫూర్తితోనే విక్రమాదిత్య పాత్రను తీర్చిదిద్దుకున్నాం. కొన్ని యథార్థ సంఘటనలను ఈ సినిమాలో చూపించాం. నేనీ సినిమా చేసే క్రమంలో చాలా మంది ప్రముఖ జ్యోతిష్యుల్ని కలిశాను’’.

అందమైన ప్రేమ కావ్యంగా

‘‘ఈ సినిమా వెండితెరపై ఓ అందమైన ప్రేమ కావ్యంగా నిలిచిపోతుంది. ఈ ప్రేమకథలో ఉండే సంఘర్షణ చాలా విభిన్నంగా ఉంటుంది. అలాగని ఇదేమీ విషాదాంతం కాదు. సినిమాలో ప్రభాస్‌, పూజాల జోడీ, వాళ్లిద్దరి కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇందులో ప్రభాస్‌ తల్లిగా భాగ్యశ్రీ కనిపిస్తారు. పరమహంస అనే ప్రత్యేక పాత్రలో కృష్టంరాజు నటించారు. ఈ చిత్ర హిందీ వెర్షన్‌ కోసం అమితాబ్‌ బచ్చన్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. మిగతా భాషల్లోనూ ఆయా భాషలకు చెందిన స్టార్లతో వాయిస్‌ ఓవర్‌ అందించనున్నాం. తెలుగు వెర్షన్‌కు మహేష్‌బాబు గళం అందిస్తున్నారనే వార్తలు అవాస్తవం. త్వరలో ఈ సినిమా నుంచి రెండో ట్రైలర్‌ విడుదల చేయనున్నాం’’.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని