Rajamouli-Mahesh Babu: పెద్ద ప్లానింగే..! రాజమౌళి-మహేశ్‌ మూవీ ట్రెండింగ్‌ న్యూస్‌ ఇదే!

Rajamouli-Mahesh Babu: త్వరలో పట్టాలెక్కబోయే రాజమౌళి-మహేశ్‌బాబు మూవీ గురించి చిత్ర పరిశ్రమలో ఆసక్తికర విషయాలు ట్రెండ్‌ అవుతున్నాయి.

Published : 03 Jan 2024 01:52 IST

హైదరాబాద్‌: మహేశ్‌బాబు (Mahesh babu) కథానాయకుడిగా రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో ఓ చిత్రం పట్టాలెక్కనున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా విషయంలో ఇప్పటికే అనేక వార్తలు ఫిల్మ్‌ సర్కిల్స్‌లో చక్కర్లు కొట్టగా, ఇప్పుడు మరికొన్ని విషయాలు బాగా ట్రెండ్‌ అవుతున్నాయి. యాక్షన్‌ అడ్వెంచర్‌ నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ సినిమాను రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారంటూ టాక్‌ మొదలైంది. ఇప్పటివరకూ ఈ స్థాయి బడ్జెట్‌లో ఏ భారతీయ చిత్రమూ రూపొందలేదు.  ప్రస్తుతం మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’ మూవీని పూర్తి చేసే పనిలో ఉన్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది పూర్తయిన వెంటనే కాస్త విరామం తీసుకుని రాజమౌళి స్క్రిప్ట్‌ను మహేశ్‌ విననున్నారు.

సినిమా మొదలు పెట్టేముందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, అందుకు సంబంధించిన విషయాలను జక్కన్న స్వయంగా ప్రకటిస్తారు. మహేశ్‌బాబు సినిమా విషయంలోనూ ఇదే పద్ధతిని పాటించనున్నారట. రచయిత విజయేంద్రప్రసాద్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జనవరి చివరికి పూర్తిస్థాయి స్క్రిప్ట్‌ సిద్ధమవుతుందని, ప్రీ-ప్రొడక్షన్‌ పనులు కూడా మొదలవుతాయని చెప్పారు. అలాగే, ఇప్పటి వరకూ ఇండియన్‌ సినిమా చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఆవిష్కరించబోతున్నారని తెలిపారు. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కూడా కనిపించనున్నారు. అలాగే భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ ఈ సినిమాను అనువదించనున్నారు. దీనికి సంబంధించి అమెరికాకు చెందిన ఓ క్యాస్టింగ్‌ ఏజెన్సీతో రాజమౌళి చర్చలు జరుపుతున్నారు. ఇది ఒకే సినిమాగా వస్తుందా? లేక రెండు భాగాలుగా వస్తుందా? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఇదే విషయమై విజయేంద్రప్రసాద్‌ను ప్రశ్నిస్తే, మరో భాగానికి కొనసాగేలా ముగింపు ఉంటుందని అన్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన లొకేషన్లను పరిశీలించిన చిత్ర బృందం అందుకు తగిన అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు