Rashmika: రష్మిక మార్ఫింగ్‌ వీడియో వైరల్‌.. తీవ్రంగా స్పందించిన కేంద్ర ఐటీ శాఖ

స్టార్‌ హీరోయిన్ రష్మికకు సంబంధించిన మార్ఫింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై కేంద్ర ఐటీ శాఖ తీవ్రంగా స్పందించింది.

Updated : 06 Nov 2023 12:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండస్ట్రీలో అత్యధికంగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోయిన్లలో రష్మిక (Rashmika) ఒకరు. ఈ అమ్మడుకు సోషల్‌మీడియాలోనూ లక్షల్లో ఫాలోవర్స్‌ ఉన్నారు. అందుకే ఆమెకు సంబంధించిన ఏ చిన్న ఫొటో అయినా క్షణాల్లో వైరల్‌గా మారుతుంది. తాజాగా రష్మికకు సంబంధించిన ఓ ఫేక్‌ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై కేంద్ర ఐటీ శాఖ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి మార్ఫింగ్‌ వీడియోల కట్టడి సామాజిక మాధ్యమాల బాధ్యతే అని స్పష్టం చేసింది.

రష్మిక డీప్‌నెక్ బ్లాక్‌ డ్రెస్‌ వేసుకుని లిఫ్ట్‌లో ఉన్నట్లు ఈ మార్ఫింగ్‌ వీడియోను రూపొందించారు. ఇది చూసిన నెటిజన్లు.. ఇలా మార్ఫింగ్‌ చేయడం నేరమని అంటున్నారు. దీనికి సంబంధించిన ఒరిజినల్ వీడియోను ఓ జర్నలిస్ట్‌ పోస్ట్ చేసి క్లారిటీ ఇచ్చారు. ఆ వీడియోలో ఉన్నది జారా పటేల్ అనే యువతి అని.. రష్మిక కాదని స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు చర్యలను అరికట్టేందుకు చట్టపరంగా ఓ ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకురావాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. 

ఇది అత్యంత ప్రమాదకరమైన చర్య : కేంద్ర ఐటీ శాఖ

రష్మిక మార్ఫింగ్‌ వీడియో వివాదంపై కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తాజాగా ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘‘ఇంటర్నెట్‌ను వినియోగించే డిజిటల్‌ పౌరులకు భద్రత కల్పించేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జారీ చేసిన ఐటీ నిబంధల ప్రకారం.. సామాజిక మాధ్యమ వేదికలు కొన్ని చట్టపరమైన బాధ్యతలను పాటించాల్సి ఉంటుంది. దీని ప్రకారం.. తమ మాధ్యమాల్లో ఏ యూజర్‌ కూడా నకిలీ/తప్పుడు సమాచారాన్ని పోస్ట్‌ చేయకుండా చూసుకోవాలి. ఒకవేళ అలాంటి ఫేక్‌ సమాచారాన్ని గుర్తిస్తే.. దాన్ని 36 గంటల్లోగా తొలగించాలి. ఈ నిబంధనలను పాటించకపోతే రూల్‌ 7 కింద.. ఆ సామాజిక మాధ్యమాలను కోర్టుకు లాగొచ్చు. మార్ఫింగ్‌ అనేది అత్యంత ప్రమాదకరమైన చర్య. ఈ సమస్యను సామాజిక మాధ్యమాలే పరిష్కరించాలి’’ అని రాజీవ్‌ చంద్రశేఖర్‌ రాసుకొచ్చారు.

అమితాబ్‌ ఆగ్రహం..

ఈ వీడియోపై రష్మిక అభిమానులతోపాటు పలువురు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బాలీవుడ్‌ హీరో అమితాబ్‌ బచ్చన్ కూడా స్పందించారు. దీన్ని క్రియేట్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. 

ఈ దీపావళికి థియేటర్‌ దద్దరిల్లే చిత్రాలు.. మరి ఓటీటీలో..!

ప్రస్తుతం రష్మిక టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేస్తున్నారు. రణ్‌బీర్‌ సరసన ఆమె నటించిన ‘యానిమల్‌’ (Animal) డిసెంబర్‌ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అలాగే అల్లు అర్జున్ - సుకుమార్‌ల పాన్ ఇండియా సినిమా ‘పుష్ప-2’లోనూ (Pushpa-2) నటిస్తోన్నారు. ఇవి కాకుండా మరో మూడు పెద్ద ప్రాజెక్ట్‌ల్లో అవకాశాలను సొంతం చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని