RRR: ఆస్కార్‌ బరిలోకి దిగుతున్నాం.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ ప్రకటన

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) టీమ్‌ ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఈ ఏడాది జరగనున్న ‘ఆస్కార్‌’ (Oscars) బరిలోకి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ దిగుతున్నట్లు టీమ్‌ ప్రకటించింది.

Published : 06 Oct 2022 13:31 IST

హైదరాబాద్‌: ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) టీమ్‌ ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఈ ఏడాది జరగనున్న ‘ఆస్కార్‌’ (Oscars) బరిలోకి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ దిగుతున్నట్లు టీమ్‌ ప్రకటించింది. ఈ మేరకు గురువారం ట్విటర్‌ వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘ప్రపంచ బాక్సాఫీస్‌ వద్ద ఎన్నో రికార్డులతో భారతీయ సినిమా సత్తాని తెలియజేసేలా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు ఘన విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మా సినిమా నచ్చి.. గత కొన్ని నెలలుగా మాపై ప్రేమాభిమానాలు కనబరుస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాం. ఇప్పుడు ఆస్కార్‌ రేసులో పోటీ పడేందుకు జనరల్‌ కేటగిరిలో మేము అప్లై చేశాం. మీ వల్లే మాకు ఇది సాధ్యమైంది. అందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు’’ అని టీమ్‌ పేర్కొంది.

కొంతకాలం క్రితం ప్రముఖ హాలీవుడ్‌ మ్యాగజైన్‌ వెరైటీ.. ఈ ఏడాది ఆస్కార్‌ బరిలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఉండే అవకాశం ఉందంటూ ఓ కథనం ప్రచురించింది. ఆనాటి నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆస్కార్‌లోకి వెళ్లనుందని గట్టిగా ప్రచారం సాగింది. ఈ క్రమంలోనే గుజరాతీ చిత్రం ‘చెల్లో షో’ను భారతదేశం తరఫున ‘ఆస్కార్‌’ నామినేషన్‌కు పంపుతున్నట్లు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ప్రకటించడంతో సినీ ప్రియులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ తాజాగా చేసిన ప్రకటనతో అందరూ ఆనందిస్తున్నారు.

తారక్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రధారులుగా రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఫిక్షనల్‌ స్టోరీగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌.. అల్లూరి సీతారామరాజుగా, తారక్‌.. కొమురం భీమ్‌గా మెప్పించారు. ఆలియాభట్‌, ఒలీవియా మోరీస్‌ కథానాయికలు. రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాత. ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం సుమారు రూ.1200 కోట్లు వసూళ్లు రాబట్టినట్లు సమాచారం.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని