Salman Khan: దయచేసి ఆ పని మాత్రం చేయొద్దు: సల్మాన్‌ఖాన్‌

సినీ ప్రియులను ఉద్దేశించి సల్మాన్‌ఖాన్‌ చిన్న విన్నపం చేశారు. తమ సినిమాకు సంబంధించిన విషయాలు షేర్‌ చేయొద్దని కోరారు.

Published : 11 Nov 2023 18:41 IST

ముంబయి: సల్మాన్‌ఖాన్‌ (salman khan) హీరోగా నటించిన యాక్షన్‌ చిత్రం ‘టైగర్‌ 3’ (Tiger 3). మనీశ్‌ శర్మ దర్శకుడు. టైగర్‌ ఫ్రాంచైజీగా దీనిని తీర్చిదిద్దారు. దీపావళి వేడుకలను పురస్కరించుకుని ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా నవంబర్‌ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినీ ప్రియులకు సల్మాన్‌ఖాన్‌ విజ్ఞప్తి చేశారు. స్పాయిలర్స్‌ షేర్‌ చేయొద్దని కోరారు.

‘‘నిబద్ధత, అభిరుచితో మేము ‘టైగర్‌ 3’ని తెరకెక్కించాం. సినిమా చూసిన తర్వాత మా చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను దయచేసి షేర్‌ చేయకండి. సినిమా చూసినప్పుడు కలిగే అనుభూతిని స్పాయిలర్స్‌ నాశనం చేయొచ్చు. కాబట్టి మీరు ఇలాంటి పనులు చేయరని మేము నమ్ముతున్నాం. ‘టైగర్‌3’ రూపంలో ఈ దీపావళికి మేము మీకు మంచి బహుమతి ఇస్తున్నామని భావిస్తున్నా’’ అని సల్మాన్‌ ఖాన్‌ పోస్ట్‌ పెట్టారు. ఈ సినిమాలో ప్రతి నాయకుడి పాత్ర పోషించిన ఇమ్రాన్‌ హష్మీ సైతం ఇదే తరహా విజ్ఞప్తి చేశారు.

యశ్‌రాజ్‌ స్పై యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమా సిద్ధమైనట్లు సమాచారం. రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఇది నిర్మితమైంది. సల్మాన్‌ ఖాన్‌ - కత్రినా కైఫ్‌ జంటగా నటించారు. ఇమ్రాన్‌ హష్మీ ప్రతి నాయకుడిగా నటించారు. ‘పఠాన్‌’, ‘వార్‌’లోని సంఘటనలతో ఈ చిత్రానికి సంబంధం ఉంటుందని టాక్‌. ఈ మేరకు షారుక్‌ ఖాన్‌, హృతిక్‌ రోషన్‌ ఇందులో అతిథి పాత్రల్లో కనిపించనున్నారని వినికిడి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని