Shah Rukh Khan: ‘జవాన్‌’ షూట్‌.. నాలుగేళ్లు పట్టింది: షారుక్‌ ఖాన్‌

‘జవాన్‌’ (Jawan) సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ ముంబయిలో వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో షారుక్‌, దీపికా పదుకొణె పాల్గొన్నారు.

Published : 16 Sep 2023 01:57 IST

ముంబయి: షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan), నయనతార (Nayanthara) ప్రధాన పాత్రల్లో నటించిన మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘జవాన్‌’ (Jawan). అట్లీ దర్శకుడు. సెప్టెంబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ రూ.700 కోట్లు వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. ఈ సినిమా సక్సెస్‌పై చిత్రబృందం తాజాగా ముంబయిలో ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. ఈ చిత్రానికి సంబంధించిన ఎన్నో విషయాలను విలేకర్లతో పంచుకుంది.

‘‘ఒక సినిమాతో ఎన్నో ఏళ్లు ప్రయాణించే అవకాశం చాలా అరదుగా దొరుకుతుంది. కొవిడ్‌, ఇతర కారణాల వల్ల దాదాపు నాలుగేళ్లపాటు మేము ‘జవాన్‌’తో ప్రయాణించాం. దక్షిణాదికి చెందిన ఎంతోమంది ఈ సినిమా కోసం కష్టపడ్డారు. దాదాపు నాలుగేళ్లపాటు ముంబయిలోనే ఉండి రేయింబవళ్లు శ్రమించారు. కుటుంబం, ఇంటికి దూరంగా ఉండి సినిమా కోసం కష్టపడిన టెక్నికల్‌ టీమ్‌ నిజమైన హీరోలు. ‘జవాన్‌’ విజయం వాళ్లదే.’’ అని షారుక్‌ చెప్పారు.

‘‘షారుక్‌ అంటే నాకెంతో ఇష్టం. ఆయనకు నేను వీరాభిమానిని. ఆయనపై నాకున్న ప్రేమకు ఈ సినిమా అద్దం పడుతుంది. కొవిడ్‌ సమయంలో ఆయన కోసం ఈ కథ సిద్ధం చేశా. జూమ్‌ కాల్‌లోనే ఆయనకు కథ చెప్పా. ఈ సినిమాకు వస్తోన్న ఆదరణ చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది’’ అని అట్లీ తెలిపారు.

‘‘షారుక్‌కు నేనూ ఒక అభిమానినే. ఆయన నటించిన ‘కల్‌ హో నా హో’ చిత్రాన్ని దాదాపు ఏడుసార్లు థియేటర్‌లో చూశా. ‘డాన్‌’ ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో ఎంజాయ్‌ చేశా. ఈ సినిమా వల్ల ఆయనతో ఎక్కువ సేపు మాట్లాడటానికి అవకాశం దొరికింది. ఎన్నో విషయాలపై మేము మాట్లాడుకున్నాం. మహిళల సమస్యలపైనా మేము చర్చించుకునేవాళ్లం’’ అని అనిరుధ్‌ చెప్పారు.

‘‘ప్రాజెక్ట్‌ కె’ షూట్‌లో భాగంగా నేను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు షారుక్‌ - అట్లీ నన్ను కలవడానికి వచ్చారు. ‘జవాన్‌’లోని ఐశ్వర్య పాత్ర గురించి చెప్పారు. పాత్ర ఎంత నిడివి ఉందనేది విషయం కాదు.. అది ఎంత ప్రభావితం చేసింది అనేది విషయం. అందుకే నిడివి తక్కువ ఉన్నా ఐశ్వర్య పాత్రను ఓకే చేశా’’ అని దీపికా పదుకొణె తెలిపారు.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని