Adipurush: ‘రామాయణం’ ఇప్పుడెవరు చూస్తారని నవ్వారు.. రికార్డు చూసి షాకయ్యారు!

రామాయణం ఆధారంగా దర్శకుడు ఓంరౌత్‌ తెరకెక్కించిన చిత్రం.. ‘ఆదిపురుష్‌’. ఈ సినిమా శుక్రవారం విడుదలకానున్న నేపథ్యంలో గతంలో సంచలనం సృష్టించిన ‘రామాయణం’ సీరియల్‌పై ఓ లుక్కేద్దాం..

Updated : 14 Jun 2023 10:12 IST

భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం.. ‘ఆదిపురుష్‌’ (Adipurush) సందడి నెలకొంది. టాలీవుడ్‌ టు బాలీవుడ్‌ ప్రముఖులు వేల సంఖ్యలో ఈ సినిమా టికెట్లు కొని (Adipurush Tickets), పేదవారికి ఉచితంగా ఇస్తుండడం కొత్త ట్రెండ్‌కు తెర తీసింది. ఇలా ఓ వైపు పాజిటివ్‌ వైబ్స్‌ కనిపిస్తుంటే.. మరోవైపు ‘‘రామాయణం గురించి చాలా మందికి తెలుసు. కొత్తగా చూడ్డానికి ఏముంది?’’ అనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. మూడేళ్ల క్రితం రామాయణ్‌/రామాయణం (Ramayan) సీరియల్‌ రీ టెలికాస్ట్‌కానుందని తెలిసిన కొందరు అలానే అనుకున్నారు. ‘రామాయణం.. ఇప్పుడెవరు చూస్తారు’ అని నవ్వినవారంతా వ్యూస్‌ విషయంలో అది సాధించిన రికార్డు చూసి షాకయ్యారు. ఓసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్దామా..

అప్పట్లో సాహసం..

ఇప్పుడంటే ఎన్నో యూట్యూబ్‌ ఛానల్స్‌, పాడ్‌కాస్ట్‌లు.. ‘రామాయణం’ గురించి వివరిస్తున్నాయి. ఈ- బుక్స్‌ అందుబాటులో ఉన్నాయి. మరి, ఇంటర్నెట్‌ అందుబాటులో లేని రోజుల్లో.. రేడియో, టీవీనే ప్రధాన మాధ్యమాలు. టీవీ అనేది వినోదం పంచే సాధనం. మరి, దాని ద్వారా రామాయణాన్ని భారతీయులకు తెలియజేయాలనుకోవడం ఓ సాహసమే. ఆనాడు.. రామానంద్‌ సాగర్‌ ఆ సాహసమే చేశారు. ఎంతో కష్టపడి ఆ ఇతిహాసాన్ని ధారావాహికగా తెరకెక్కించారు. రామానంద్‌ సాగర్‌ అండ్‌ టీమ్‌ ఊహించినట్టే ఆ సీరియల్‌ ప్రసారమైన కొన్ని వారాల వరకు ప్రేక్షకుల నుంచి స్పందన లేదు. ఆరు వారాల తర్వాత ఆ సీరియల్‌ పట్ల ఆడియన్స్‌ ఆసక్తి కనబరిచారు. ‘రామాయణం మనం చదవలేదు.. ఎప్పుడూ వినలేదు.. ఇప్పుడైనా చూద్దాం’ అనుకుంటూ టీవీలకు అతుక్కుపోయేవారు. ఈ ధారావాహిక 78 ఎసిసోడ్లతో 1987 జనవరి 25 నుంచి 1988 జులై 31 వరకు ప్రతి ఆదివారం ఉదయం 9: 30 గం.లకు దూరదర్శన్‌లో ప్రసారమయ్యేది. అత్యధిక వీక్షణలు సొంతం చేసుకుని లిమ్కా బుక్‌ రికార్డ్స్‌లోనూ చోటు దక్కించుకుంది. రామాయణం ఆధారంగా చేసుకుని అప్పటికే పలు సినిమాలు వచ్చాయి. వాటిని ఆదరించిన నాటి ప్రేక్షకులు ఈ సీరియల్‌నూ ఆదరించడానికి కారణం.. ఆ ఇతిహాసం ఎన్ని సార్లు చూసినా, ఎన్ని సార్లు విన్నా, ఎన్ని సార్లు చదివినా కొత్తగా ఉండడం. మానవాళి నేర్చుకోవాల్సిన ఎన్నో విషయాల్ని చెప్పడం.

ప్రపంచ రికార్డు..

‘అప్పుడంటే ఏ సోర్స్‌ లేకపోవడంతో చూసుంటారు. సాంకేతికత ఇంతగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో ఎవరు చూస్తారు?’.. 2020లో ‘రామాయణం’ సీరియల్‌ రీ టెలికాస్ట్‌ కానుందని తెలిసి కొందరు చేసిన విమర్శలివి. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన ప్రజలకు ఈ ధారావాహికను పునః ప్రసారం చేయాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆ ఏడాది మార్చి 28 నుంచి సీరియల్‌ ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం రీ టెలికాస్ట్‌ అయింది. ఏప్రిల్‌ 16న ఈ సీరియల్‌ను 7.7 కోట్ల మంది వీక్షించడం ప్రపంచ రికార్డు. పౌరాణికాలకు ఉన్న ఆదరణ ఎలాంటిదో ఆ వ్యూస్‌ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

‘రామాయణానికి మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌‌ డేట్‌ ఉంటుంది గానీ ఎక్స్‌పైరీ డేట్ లేదు’ అని సునీల్‌ లహ్రీ (సీరియల్‌లో లక్ష్మణుడి పాత్ర పోషించిన వ్యక్తి) ఓ సందర్భంలో అభిప్రాయపడ్డారు. ఏ ఇతిహాసమైనా నిత్య నూతనం కాబట్టి వాటిని ఆధారంగా చేసుకుని అప్పుడప్పుడూ సినిమాలు, సీరియళ్లు తెరకెక్కుతున్నాయి. ‘ఆదిపురుష్‌’ (Adipurush Release on June 16th) విషయానికొస్తే.. ఇందులో రాముడిగా ప్రముఖ హీరో ప్రభాస్‌ (Prabhas) నటించారు. సీతగా కృతిసనన్‌ (Kriti Sanon), రావణాసురుడిగా సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan) కనిపించనున్నారు. రామాయణంలోని అరణ్యకాండం, యుద్ధకాండం ఇతివృత్తంగా ఈ సినిమాని దర్శకుడు ఓంరౌత్‌ తెరకెక్కించారు. జూన్‌ 16న విడుదలకానున్న ఈ సినిమా టికెట్లను పలువురు ప్రముఖులు కొని, రాముడి గురించి ఈ తరానికి తెలియజేయాలని వాటిని ఉచితంగా అందిస్తుండడం విశేషం.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని