Adipurush: ‘ఆదిపురుష్‌’ ఎందుకు ఆదర్శప్రాయుడంటే..!

ఓంరౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదిపురుష్‌’ (Adipurush) మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆదిపురుష్‌లో ఉన్న గొప్ప లక్షణాలేంటో ఓసారి చూద్దాం.

Updated : 15 Jun 2023 17:35 IST

ప్రస్తుతం ఎక్కడ చూసిన ‘ఆదిపురుష్‌’ (Adipurush) మాటే వినిపిస్తోంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి వరకు ఎన్నో విభిన్న లుక్స్‌లో కనిపించిన ప్రభాస్‌ను (prabhas) మర్యాద పురుషోత్తముడైన రాముడుగా చూసేందుకు ఆయన అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కొందరు వీరాభిమానులు నిజంగా రాముడు ఇలానే ఉంటాడా అనేలా ప్రభాస్‌ ఉన్నాడంటున్నారు. ఈ నేపథ్యంలో ఎందరికో ఆదర్శప్రాయుడైన ఆదిపురుష్‌ ఎందుకంత గొప్పవాడు అయ్యడో చూద్దాం. ఆయనలో ఉన్న గొప్ప లక్షణాలేంటో ఓసారి చూద్దాం..

రాముడు ధర్మాత్ముడు..
ఆదిపురుష్ ట్రైలర్‌ వచ్చిన దగ్గరి నుంచి బాగా వినిపిస్తున్న డైలాగ్‌.. ‘న్యాయం రెండు పాదాలతో నీ పది తలల అన్యాయాన్ని అణిచి వేయడానికి.. ఆగమనం.. అధర్మ విధ్వంసం..’ ఇందులో చెప్పినట్లే రాముడు అధర్మాన్ని సహించడు. ఎంతో ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలించాడు. అందుకే ప్రజలందరికీ ఇష్టమైన రాజుగా కీర్తిప్రతిష్ఠలు అందుకున్నాడు. ఆయనంటే రాజ్యంలోని ప్రజలకు ఎంతో ఇష్టం. అందుకే అరణ్య వాసానికి బయలు దేరిన రాముని వెంట ఏకంగా అయోధ్య ప్రజలంతా కూడా వస్తామని కోరతారు. ఆయన అంత ధర్మాత్ముడు  కాబట్టే రాముడు లేని సమయంలో ఆయన పాదుకలకు గౌరవం కల్పించారు.

గుణవంతుడు..
రాముడి గొప్పతనాన్ని తెలుపుతూ ఆదిపురుష్‌లో ఉన్న మరో డైలాగ్‌.. ‘భక్తి పాదాల దగ్గర కూర్చోవటం నీ గౌరవానికి తగదు.. మనం జన్మతో కాదు చేసే కర్మ తో చిన్న పెద్ద అవుతాం.. !’ రాముడు ఎంత గుణవంతుడో చెప్పడానికి ఇదొక్కటి చాలు.. ఆయన అందరినీ ఎంతో గౌరవించే వాడు. కుల,వర్గ భేదం చూడలేదు. అరణ్యవాసానికి వేళ్లే ముందు బోయరాజైనా గుహుడిని ప్రేమగా ఆలింగనం చేసుకుంటాడు. అలాగే వృద్ధురాలైన శబరి భక్తితో ఇచ్చిన అతిథ్యాన్ని ప్రేమగా స్వీకరించాడు. చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా ఎదురైన ప్రతి వారిని గౌరవించడం రాముడిలో ఉన్న గొప్ప గుణం.

అన్ని ప్రాణుల మంచి కోరేవాడు..
రాజ్యంలోని ప్రజలనే కాదు తనకు సాయం చేసిన చిన్న ఉడుత వరకు రాముడు అన్ని ప్రాణుల మంచిని కోరేవాడు. అశ్వమేథ యాగంలో దశరథ మహారాజు గుర్రాన్ని దేశాటనం కోసం వదిలిపెడుతారు. అది దేశమంతటా తిరిగి రాజ్యానికి చేరుకుంటుంది. సహజంగా అశ్వమేథ యాగంలో పాల్గొన్న గుర్రాన్ని యాగంలో భాగంగా బలి ఇచ్చే సంప్రదాయం అప్పట్లో ఉండేది. దానితో గుర్రాన్ని బలి ఇవ్వడానికి అంతా సిద్ధం చేయగా.. రాముడు మాత్రం దాన్ని అడ్డుకుంటాడు.  గుర్రం అన్ని దిక్కులా తిరిగి రాజ్యానికి వచ్చి మన రాజ్యం గౌరవాన్ని ఇనుమడింపజేసిన గుర్రానికి మనం ఇచ్చే బహుమతి ఇదేనా.. అంటూ ఆ గుర్రాన్ని బలి ఇవ్వకుండా ఆపుతాడు. ఇలా ప్రతి ప్రాణి మంచి కోరాడు కాబట్టే ఆయన దేవుడయ్యాడు.

ఎదుటివారిలో మంచిని చూసేవాడు..
ఎప్పుడు ఎదుటివారిలో మంచిని మాత్రమే చూడగలగడం రాముని గొప్పతనం. తనను రాజ్యం వదిలేసి వెళ్లమన్న తల్లి కైకేయి గురించి ఒక్క క్షణమైనా చెడుగా ఆలోచించలేదు. అరణ్యవాసం ముగించి తిరిగి రాజ్యానికి వచ్చినప్పుడు రాముడు మొదట కైకేయి పాదాలనే తాకి నమస్కరించాడు. ఆ తర్వాతే మిగతా ఇద్దరు తల్లులకు నమస్కరించాడు. రాముడు స్త్రీలను ఎంత గౌరవిస్తాడో తెలుపుతూ ఆదిపురుష్‌లో ‘నా కోసం పోరాడొద్దు వేల సంవత్సరాల తర్వాత తల్లులు మీ వీర గాధ చెప్తూ పిల్లల్ని పెంచాలి ఆ రోజు కోసం పోరాడండి’ అనే డైలాగును పెట్టారు. 

సమర్థుడైన సోదరుడు..
రాముడు ఎంత సమర్థుడో చెప్పడం కోసం ఆదిపురుష్‌లో పెట్టిన డైలాగ్‌..‘మీరు అయోధ్య కి యువరాజు ఒక సైగ చేస్తే చాలు .. సమస్త సైన్యం మనకోసం పోరాడుతుంది..’ ఆయన అందరినీ ఒకేలా చూసేవారు. రాముడు తన సోదరులైన లక్ష్మణ, భరత, శతృఘ్నులు ముగ్గురినీ సమానంగా ఆదరించేవాడు. సీతాదేవితో కలిసి రాముడు  అరణ్యవాసం చేస్తున్నప్పుడు.. రాజ్యానికి తిరిగిరావాలని, పాలనాధికారం చేపట్టాలని కోరేందుకు భరతుడు అన్నను వెతుక్కుంటూ అడవులకు వస్తాడు. అయితే భరతుడిని చూసిన లక్ష్మణుడు ఒక్క క్షణం చెడుగా ఆలోచిస్తాడు. రాముడిని అరణ్యవాసానికి పంపించిన కైకేయి భరతుడికి తల్లి కావడమే ఆ కోపానికి కారణం. అయితే రాముడు మాత్రం సోదరుడైన భరతుడిని ప్రేమతోనే ఆప్యాయంగా ఆహ్వానించి ఆదరిస్తాడు.

అంతేకాదు దశరథుడి కొడుకుగా తండ్రి ఏం చెప్పినా గౌరవం, ప్రేమతో పాటించాడు. తండ్రికి ఇచ్చిన మాట కోసం సౌకర్యాలన్నింటిని వదిలి అడవులకు వెళ్లాడు. భార్యను రక్షించుకునేందుకు గొప్ప పోరాటం చేశాడు. ఇలా చెబుతూ పోతే రాముడిలో ఉండే మంచి గుణాలు కోకొల్లలు. వాటిల్లో కొన్నింటిని ఓంరౌత్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఆదిపురుష్‌’లో చూపించారు. జూన్‌16న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు