Srimanthudu: ‘శ్రీమంతుడు’ స్టోరీ ఇష్యూ.. స్పందించిన టీమ్‌.. ఏమందంటే?

‘శ్రీమంతుడు’ సినిమా కథ విషయంలో జరుగుతున్న చర్చపై టీమ్‌ స్పందించింది.

Published : 02 Feb 2024 01:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహేశ్‌ బాబు (Mahesh Babu) హీరోగా దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) తెరకెక్కించిన ‘శ్రీమంతుడు’ (Srimanthudu) సినిమా సమస్యల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తాను రాసిన నవల ‘చచ్చేంత ప్రేమ’ను కాపీ కొట్టి ఆ చిత్రాన్ని తీశారని రచయిత శరత్‌ చంద్ర (Sharath Chandra) ఆరోపించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన స్క్రిప్టు తనదేనని దర్శకుడు అంగీకరించాలని కోరారు. సినీ పెద్దలు రాజీ కుదర్చడానికి ప్రయత్నించారని చెప్పారు. టాలీవుడ్‌లో ప్రస్తుతం ఇదే హాట్‌టాపిక్‌గా మారింది. దీనిపై చిత్ర బృందం స్పందించింది. సోషల్‌ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసింది.

అప్పుడు ₹15 లక్షలు ఇస్తామన్నారు: శరత్‌ చంద్ర

‘‘శ్రీమంతుడు’, ‘చచ్చేంత ప్రేమ’.. రెండూ పబ్లిక్‌ డొమైన్‌లోనే ఉన్నాయి. వేటికవే విభిన్నం. పుస్తకం, సినిమాను పరిశీలించి ఈ వాస్తవాన్ని గుర్తించొచ్చు. ప్రస్తుతం ఈ వ్యవహారం లీగల్‌ రివ్యూలో ఉంది. అందువల్ల అప్పుడే ఒక అభిప్రాయానికి రావొద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఓపిక పట్టండి. చట్టపరమైన ప్రక్రియపై మాకు నమ్మకం ఉంది’’ అని పేర్కొంది.

ఏం జరిగిందంటే..?

2015లో విడుదలైన ‘శ్రీమంతుడు’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఆ సమయంలోనే ఆ చిత్రాన్ని తన నవల ఆధారంగా తెరకెక్కించారంటూ శరత్‌ చంద్ర హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. కొరటాల శివపై క్రిమినల్‌ చర్యలకు ఆదేశించింది. అయితే నాంపల్లి కోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ కొరటాల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కొరటాలకు చుక్కెదురైంది. దీంతో సుప్రీంకోర్టు తలుపు తట్టగా అక్కడా అదే పరిస్థితి. స్థానిక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం క్రిమినల్‌ కేసు ఎదుర్కోవాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని