Salaar: అప్పుడు ‘సలార్‌’లో నటించేందుకు అంగీకరించలేదు.. కానీ!: శ్రియారెడ్డి

ప్రభాస్‌ హీరోగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన చిత్రం ‘సలార్‌’. ఇందులో కీలక పాత్ర పోషించిన శ్రియారెడ్డి మీడియాతో ముచ్చటించారు.

Published : 27 Dec 2023 01:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘పొగరు’ (pogaru) సినిమాలోని ఓ కీలక పాత్రతో అటు కోలీవుడ్‌, ఇటు టాలీవుడ్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న నటి శ్రియారెడ్డి (Sriya Reddy). ఇన్నేళ్లలో అతి తక్కువ సినిమాలు చేసిన ఆమె.. ‘సలార్‌’ (Salaar)లోని రాధారమ మన్నార్‌ క్యారెక్టర్‌తో మరోసారి అదే స్థాయిలో అలరించించారు. ప్రభాస్‌ (Prabhas), పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రల్లో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) తెరకెక్కించిన చిత్రమిది. శ్రుతిహాసన్‌ కథానాయిక. డిసెంబరు 22న విడుదలైన ఈ సినిమాకి మంచి విజయం దక్కడంతో శ్రియారెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..

ప్రశాంత్‌ పట్టుపట్టారు..

‘‘ప్రశాంత్‌ నీల్‌ నన్ను కలిసి, ఈ సినిమా గురించి చెప్పినప్పుడు నటించేందుకు అంగీకరించలేదు. ఎందుకంటే నేను సినిమాలు చేయకూడదని అప్పటికే నిర్ణయించుకున్నా. కానీ, ఎలాగైనా నటింపజేయాలని ప్రశాంత్‌ పట్టుపట్టారు. స్క్రిప్టు పూర్తిగా విని ఆ తర్వాత సమాధానం చెప్పమన్నారు. నాకు ఆ కథ నచ్చడంతో నటించేందుకు ఓకే చెప్పా. స్క్రిప్టులో తొలుత నా పాత్ర లేదు. కథలోకి లోతుగా వెళ్లే క్రమంలో లేడీ విలన్‌ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో తర్వాత ఆ క్యారెక్టర్‌ను రాశారు. అందులో విలనిజాన్ని టచ్‌ చేస్తూనే అందంగా చూపించాలనుకున్నారు. ‘పొగరు’ సినిమాలోని నా నటన నచ్చడంతో ప్రశాంత్‌ ‘సలార్‌’లోని రాధారమ పాత్రకు ఎంపిక చేసుకున్నారు. ఈ పాత్రకు మంచి పేరు వస్తుందని ప్రశాంత్‌ నీల్‌ నాకు ప్రామిస్‌ చేశారు. ఎలాంటి సందేహం లేకుండా సెట్‌కు వచ్చి నటించమన్నారు. ఆయనకు తన స్క్రిప్ట్‌ మీద అంత నమ్మకం. అనుకున్నట్లుగానే నాకు మంచి పేరు వచ్చింది. చిత్రీకరణ సమయంలో అలా చేయను.. ఇలా చేయను అని చాలాసార్లు చెప్పా. కానీ, చివరకు ఓ చిన్న పిల్లలాగా నన్ను ఒప్పించేవారు’’

‘సలార్‌ 2’.. మరో స్థాయిలో..

‘‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’, ‘కేజీయఫ్‌’, ‘బాహుబలి’ తదితర సినిమాల తొలి భాగాల కథలు చాలామందికి అర్థంకావు. ‘సలార్‌’ కూడా అంతే. ఫస్ట్‌ పార్ట్‌లో మేం కథను పరిచయం చేసే ప్రయత్నం చేశాం. సెకండ్‌ పార్ట్ మరో స్థాయిలో ఉంటుంది. రెండో భాగంలో నా పాత్ర నిడివి ఎక్కువ. ప్రభాస్‌ స్వీట్‌ పర్సన్‌. ఎప్పుడూ కూల్‌గా ఉంటారు. ఆయనలాగే పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కూడా ఎక్కువగా మాట్లాడరు’’

అంతకుమించి చెప్పలేను!

‘‘పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘ఓజీ’ సినిమా స్టోరీ చాలా బాగుంటుంది. అందులో యాక్షన్‌తోపాటు మంచి ఎమోషన్‌ ఉంది. ప్రకాశ్‌రాజ్‌, అర్జున్‌ దాస్‌, ఇమ్రాన్‌ హష్మీ.. ఇలా ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటారు. నేనిందులో నెగెటివ్‌ రోల్‌లో నటించడం లేదు. కానీ, చాలా విభిన్న పాత్ర అది. అంతకు మించి ఇప్పుడు ఇతర వివరాలు చెప్పలేను. ఈ సినిమా తర్వాత రిటైర్డ్‌ అయిపోతానేమో (నవ్వుతూ)..!’’ అని చెప్పుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని