Tamil movies: కోలీవుడ్‌ క్రేజీ మూవీస్‌.. వేసవిలో వినోదం డబుల్‌

ఈ వేసవి మరింత వినోదాల విందు పంచేందుకు సిద్ధమవుతోంది. తెలుగుతో పాటు, తమిళ హీరోల చిత్రాలూ అలరించేందుకు వస్తున్నాయి.

Published : 19 Feb 2022 09:40 IST

ఈ వేసవి మరింత వినోదాల విందు పంచేందుకు సిద్ధమవుతోంది. తెలుగుతో పాటు, తమిళ హీరోల చిత్రాలూ అలరించేందుకు వస్తున్నాయి. టాలీవుడ్‌లోనూ కోలీవుడ్‌ చిత్రాల దండయాత్ర కొనసాగనుంది. ఈ మధ్యేనే విశాల్‌ ‘సామాన్యుడు’తో థియేటర్‌లో సందడి చేయగా, ‘మహాన్‌’ అంటూ విక్రమ్‌ ఓటీటీలో అలరించారు. త్వరలోనే ఇంకొందరు హీరోలు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రాబోతున్నారు.

సినిమా: వాలిమై; హీరో: అజిత్‌; విడుదల: ఫిబ్రవరి 24

150 కోట్ల భారీ బడ్జెట్‌ సినిమాగా తెరకెక్కుతున్న చిత్రం వాలిమై. బోనీకపూర్‌ నిర్మాత. తెలుగు హీరో కార్తికేయ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నాడు. దర్శకుడు వినోద్‌. తమిళ్‌, తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నారు. అజిత్‌ పోలీసు అధికారిగా నటిస్తున్నాడు. యువన్‌ శంకర్‌ రాజా సంగీత దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో అంచనాలు భారీగా పెరిగాయి.


సినిమా: ఈటీ; హీరో: సూర్య; విడుదల: మార్చి 10

జై భీమ్‌ తర్వాత సూర్య ఎలాంటి కథాంశంతో వస్తాడని అంతా ఎదురుచూస్తున్నారు. దానికి తగ్గట్టే భిన్నంగా ఎత్తర్కుమ్‌ తునింధవన్‌ (ఈటీ)తో యాక్షన్‌ థ్రిల్లర్‌ని ఎంచుకున్నాడు. ఒక సామాన్యుడు సమాజంలోని అన్యాయాలపై తిరబడి ఎదిరించడమే కథాంశం. తెలుగుతోపాటు కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలవుతోంది. దర్శకుడు పాండీరాజ్‌. 2019లో జరిగిన పొలాచ్చి సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల సంఘటన ఆధారంగా కథ రాసుకున్నట్టు పాండీరాజ్‌ తెలిపారు. ఈ సినిమాలో తెలుగులో కూడా సూర్య సొంతంగా డబ్బింగ్‌ చెప్పాడు.


సినిమా: బీస్ట్‌; హీరో: విజయ్‌; విడుదల: ఏప్రిల్‌ 2022

తెలుగు తెరని ముంచెత్తుబోతున్న మరో యాక్షన్‌ థ్రిల్లర్‌ బీస్ట్‌. దర్శకుడు నెల్సన్‌. ముందు ఈ సినిమాని ఏ.ఆర్‌.మురుగదాస్‌తో మొదలుపెట్టినా తను పారితోషికం అత్యధికంగా డిమాండ్‌ చేయడంతో నెల్సన్‌ని దర్శకుడిగా మార్చారు. అనిరుధ్‌ రవిచందర్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. పూజాహెగ్డే తన సొగసులతో అలరించనుంది.


సినిమా: సర్దార్‌; హీరో: కార్తి; విడుదల: మే  2022

ఇది గూఢచారి క్రైం థ్రిల్లర్‌ సినిమా. గతేడాది ఏప్రిల్‌లోనే షూటింగ్‌ మొదలైనా.. కొవిడ్‌ కారణంగా నిరవధికంగా వాయిదా వేశారు. కార్తి ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో తనకి జోడీగా రాశీఖన్నా, రాజీష విజయన్‌లు నటిస్తున్నారు. పీఎస్‌ మిత్రన్‌ దర్శకుడు. తెలుగు ఓటీటీ సంస్థ ఆహా స్ట్రీమింగ్‌ హక్కులు దక్కించుకుంది.


సినిమా: విక్రమ్‌; హీరో: కమల్‌హాసన్‌; విడుదల: ఏప్రిల్‌ చివరి వారం

విశ్వనటుడు కమల్‌ హాసన్‌ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రంలో కమల్‌ హాసన్‌ పోలీసు అధికారిగా నటిస్తున్నాడు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం.. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకుడు. హిందీ హక్కులు రూ.37 కోట్లకు అమ్ముడయ్యాయి. విజయ్‌ సేతుపతి, ఫహాద్‌ ఫాసిల్‌లు సైతం ఇందులో నటిస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.


సినిమా: కణ్మని రాంబో ఖతీజా; హీరో: విజయ్‌ సేతుపతి; విడుదల: ఏప్రిల్‌

నయనతార, సమంత.. ఈ ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే.. అభిమానులకు పండగే కదా! కణ్మని రాంబో ఖతీజాలో ఇదే జరగబోతోంది. ఈ ఇద్దరికీ ప్రియుడిగా విజయ్‌ సేతుపతి నటిస్తున్నాడు. ఇది కామెడీతో కూడిన ముక్కోణపు ప్రేమకథా చిత్రమ్‌. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నాడు. దాదాపు చిత్రీకరణ పూర్తయింది. విఘ్నేశ్‌ శివన్‌ దర్శకుడు.


సినిమా: సర్‌; హీరో: ధనుష్‌

తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి తమిళ్‌ స్టార్‌ ధనుష్‌తో కలిసి చేస్తున్న తొలి చిత్రం. తమిళంలో ‘వాథీ’గా తెలుగులో ‘సర్‌’గా తెరకెక్కుతోంది. ఇదీ యాక్షన్‌ డ్రామా చిత్రమే. సంయుక్తమేనన్‌ ధనుష్‌కి జోడీ. సాదాసీదా ఓ కాలేజీ లెక్చరర్‌ పరిస్థితుల ప్రభావం కారణంగా చిక్కుల్లో ఇరుక్కుని ఎడ్యుకేషన్‌ మాఫియాతో ఎలా పోరాడి విజయం సాధించాడు అన్నదే కథాంశం. జీవీ ప్రకాశ్‌కుమార్‌ సంగీతం అందిస్తున్నాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని