Ramayana: నితేశ్‌ తివారీ ‘రామాయణ’.. త్రివిక్రమ్‌ సంభాషణల్లో..?

Ramayana: నితేశ్‌ తివారీ రూపొందిస్తున్న ‘రామాయణ’ మూవీకి తెలుగులో సంభాషణలు రాసే బాధ్యత దర్శకుడు త్రివిక్రమ్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది.

Published : 03 Apr 2024 17:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘రామాయణం’ ఎన్నిసార్లు విన్నా, చదివినా, చూసినా ఎప్పుడూ కొత్తగా కనిపించే ఇతిహాస గాథ. యుగాలు, కాలాలు, తరాలు మారినా ఆ కథ మాత్రం నిత్య నూతనం. వెండితెరపై ఎన్నోసార్లు అలరించిన రామాయణగాథ మరోసారి సరికొత్తగా ప్రేక్షకుల ముందుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. రణ్‌బీర్‌కపూర్‌ (Ranbir Kapoor) రాముడిగా, సాయి పల్లవి (Sai pallavi) సీతగా ఈ ఇతిహాస గాథ సెట్స్‌పైకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో రావణుడిగా కన్నడ స్టార్‌ హీరో యశ్‌ నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ బాలీవుడ్‌ మీడియా, సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతోంది.

నితేశ్‌ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ తెలుగు వెర్షన్‌ సంభాషణలు రాసే బాధ్యతను చిత్ర బృందం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌(Trivikram)కు అప్పగించినట్లు సమాచారం. మాటల రచయితగా ఆయన కలానికి ఉన్న పదునేంటో తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా పురాణాలు, ఇతిహాసాలతో పాటు, తెలుగు సాహిత్యంపై ఆయనకు మంచి పట్టు ఉంది. ఆయన రాసే ప్రతీ మాటకు అర్థాన్ని అచ్చుల్లో, భావాన్ని హల్లుల్లో రంగరించి రాస్తారు. అందుకే ‘రామాయణ’ చిత్ర బృందం ఈ అద్భుత దృశ్య కావ్యానికి అక్షరమాల అలరించే బాధ్యత త్రివిక్రమ్‌కు అప్పగించారని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది. ఇటీవల ‘గుంటూరు కారం’తో ప్రేక్షకులకు ముందుకువచ్చిన త్రివిక్రమ్‌ తన తదుపరి సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. అల్లు అర్జున్‌తో సినిమా ఉంటుందని గతంలో పలు సందర్భాల్లో చెప్పారు. బన్నీ ప్రస్తుతం ‘పుష్ప2’తో బిజీగా ఉన్నారు. ఇది పూర్తయిన తర్వాత అట్లీతో ఓ మూవీ ప్లాన్‌ చేస్తున్నట్లు టాక్‌. ఒకవేళ అది ఆలస్యమైతే మధ్యలో త్రివిక్రమ్‌తో మూవీ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

భారీ తారాగణంతో నిర్మిస్తున్న ‘రామాయణ’ భారతీయ సినీ పరిశ్రమలోనే టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల పాటు ప్రీ-ప్రొడక్షన్‌ పనులు జరుపుకొన్న ఈ చిత్రం తాజాగా ముంబయిలోని ఓ స్టూడియోలో చిత్రీకరణ మొదలైంది. భారీ జనసమూహం నేపథ్యంలో చిత్రీకరిస్తున్న ఈ సన్నివేశాలు కొన్ని రోజులపాటు కొనసాగనున్నట్టు సినీవర్గాలు తెలిపాయి. పలు భారతీయ భాషల్లో.. మూడు భాగాలుగా తెరకెక్కే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు శ్రీరామనవమి రోజైన ఏప్రిల్‌ 17న ప్రకటించే అవకాశముందని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని