Gopala Reddy: నాగార్జునతో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తే...
Gopala reddy: ఆలీతో సరదాగా కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ గోపాల్‌రెడ్డి పంచుకున్న విశేషాలు మీకోసం..
ఇంటర్నెట్ డెస్క్: తొలి ప్రయత్నానికి విమర్శలు రావడంతో తన పని అయిపోయిందనుకున్నారు. ఏం చేయాలి? అనే ఆలోచనలో పడ్డారు. అప్పుడే వచ్చిన ఓ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అప్పటి నుంచి తిరుగులేని సినిమాటోగ్రాఫర్‌గా మారారు. ఆయనెవరో కాదు ఎస్. గోపాలరెడ్డి. అసిస్టెంట్ కెమెరామెన్ నుంచి సినిమాటోగ్రాఫర్, నిర్మాత, దర్శకుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ చిత్రపరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి గోపాలరెడ్డి విచ్చేసి, పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ వివరాలివీ...
ఆలీ: ఎస్. గోపాల్‌రెడ్డి.. ఎస్ అంటే మీ ఇంటి పేరా?
గోపాలరెడ్డి: అవును. ఎస్ అంటే శనగల. పూర్తి పేరు శనగల వేణు గోపాల్ రెడ్డి. వేణుని చిన్నప్పుడే కట్ చేసేశారు.
ఆలీ: మీ ఒంటి పేరు గోపాల్‌రెడ్డి, మీ లోపల ఉన్నది సమరసింహారెడ్డి అని విన్నాను..
గోపాలరెడ్డి: కానే కాదు (నవ్వులు).
ఆలీ: మీరు.. జాలీగా ఉండే వ్యక్తా? కోపిష్టా? మంచివారా? చెడ్డవారా?
గోపాలరెడ్డి: పని విషయంలో సీరియస్‌గా ఉంటాను. షూటింగ్ పూర్తయ్యాక అందరితో ఓ స్నేహితుడిలా సరదాగా ఉంటాను.
ఆలీ: మీరు పుట్టి పెరిగిందెక్కడ?
గోపాలరెడ్డి: సొంతూరు కృష్ణా జిల్లాలోని తేలప్రోలు. అక్కడే నాలుగో తరగతి వరకు చదివా. తర్వాత విజయవాడకి మారాం. ఆ తర్వాత చెన్నైకి షిఫ్ట్ అయ్యాం. తమ్మారెడ్డి భరద్వాజ్ తండ్రి తమ్మారెడ్డి కృష్ణమూర్తి, నాన్న, మరో వ్యక్తి కలిసి సినిమా తీద్దామని చెన్నై వెళ్లారు. ఎన్టీఆర్ రామారావుతో ‘లక్షాధికారి’, ‘డాక్టర్ ఆనంద్’ అనే చిత్రాలు తీశారు.
ఆలీ: ‘లక్షాధికారి’ సినిమా తీశారు. మరి వాళ్లు లక్షాధికారి అయ్యారా?
గోపాలరెడ్డి: ‘లక్షాధికారి’ చిత్రంతో లక్షాధికారి అయ్యారు. ‘డాక్టర్ ఆనంద్’ సినిమాతో భిక్షాధికారి అయ్యారు (నవ్వులు). ఆ తర్వాత ఆ ముగ్గురూ విడిపోయారు. కృష్ణమూర్తిగారు హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యారు. డీవీ రెడ్డి అనే ఆయన సొంత ఊరికి వెళ్లిపోయారు. మా నాన్న చెన్నైలోనే ఉన్నారు.
ఆలీ: చిత్ర పరిశ్రమకి ఎలా పరిచయమయ్యారు?
గోపాలరెడ్డి: అప్పట్లో ప్రముఖ కెమెరామెన్‌గా పేరొందిన సి. నాగేశ్వరరావు మా నాన్నగారికి స్నేహితుడు. ‘మా వాడు ఎలాగూ ఎస్.ఎల్.సి. ఫెయిల్ అవుతాడు. వీడికి చదువురాదు. వీడ్ని ఏదో పనిలో మీరే చేర్చాలి’ అని మా నాన్న అంటే నాగేశ్వరరావు గారు నన్ను వీనస్ స్టూడియోకి తీసుకెళ్లారు. ఆ స్టూడియో అధినేత రాజాగారితో నా గురించి చెప్పారు. ‘మా స్నేహితుడి కొడుకు. మీ దగ్గర అప్రెంటీస్‌గా చేర్చుకోండి’ అని ఆయన్ను అడిగారు. అలా 1968లో నా సినీ కెరీర్ ప్రారంభమైంది. తొలిసారిగా ఎస్వీ రంగారావు దర్శకత్వంలో వచ్చిన ‘చదరంగం’, ఎన్టీఆర్ ‘నిండుమనసులు’ చిత్రాలకు అప్రెంటీస్‌గా పనిచేశాను. అదే సమయంలో మరో ప్రముఖ కెమెరామెన్ వి.ఎస్.ఆర్. స్వామి నన్ను చూసి, నా గురించి ఆరా తీశారు. నేను మా నాన్న గారి పేరు చెప్పగానే ‘ఒకప్పుడు మీ నాన్న నాకు సాయం చేశారు. నేను మీ నాన్నతో మాట్లాడతా. కొన్నాళ్లు ఇక్కడ పనిచేశాక నా దగ్గరకి రా’ అన్నారు. ఈ మాట చెప్పిన 8 నెలల తర్వాత ఆయన దగ్గర పనిలో చేరా.
ఆలీ: ఇప్పటి వరకు ఎన్ని సినిమాలకు పనిచేశారు? కొవిడ్‌కి ముందు మీరు చేసిన ఆఖరి చిత్రం?
గోపాలరెడ్డి: ఇప్పటి వరకు 114 చిత్రాలకు పనిచేశా. కొవిడ్‌కి ముందు పనిచేసిన చిత్రం ‘నమో వేంకటేశాయ’.
ఆలీ: ‘ముద్దమందారం’ సమీక్ష చూసి మీరు బాధపడ్డారని తెలిసింది?
గోపాలరెడ్డి: ‘ముద్దమందారం’ కాదు ‘సంసార బంధం’ సినిమా విషయంలో బాధపడ్డాను. ఎందుకంటే అదే నా తొలి సినిమా. ‘అన్ని విభాగాలు బాగున్నాయి. ఫొటోగ్రఫీ తప్ప’ అని సమీక్షల్లో రాశారు. అది చూసి కన్నీళ్లు వచ్చాయి. దాంతో అవకాశాలు రావేమోనని మళ్లీ నా గురువు స్వామి దగ్గరికి వెళ్లి ‘మీ దగ్గరే అసిస్టెంట్‌గా చేరతా’ అన్నాను. కొన్నాళ్లకు విజయబాపినీడు ఫోన్ చేసి ‘గూటిలోని రామచిలుక’ సినిమా తీస్తున్నా ఫొటోగ్రఫీ చేస్తావా? అని అడిగారు. ఓకే అని ఆ సినిమా చేశాను. తర్వాతతర్వాత బాల సుబ్రహ్మణ్యం, శోభన్‌బాబు నా పని గురించి కొందరి చెప్పారు. అలా సినిమా తర్వాత సినిమా చేసుకుంటూ వచ్చాను.
ఆలీ: ‘శివ’ చిత్రానికి పనిచేయడానికి కారణమేంటి?
గోపాలరెడ్డి: ఆ సినిమా ప్రారంభానికి ముందే దర్శకుడు రామ్ గోపాల్‌వర్మతో పరిచయం ఉంది. కెమెరా పనితనం పరిశీలించేందుకు నాతో ప్రయాణించేవాడు. ఓసారి నాగార్జునతో సినిమా ఓకే అయిందని, మీరే ఫొటోగ్రఫీ చేయాలని అన్నాడు. నాగార్జున, వెంకట్, సురేందర్.. ఈ చిత్రానికి నా కంటే పెద్ద కెమెరామెన్‌ని పెట్టుకోమని ఆర్జీవీకి ఆఫర్ ఇచ్చారు. నా మీద అతనికి ఉన్న నమ్మకం ఏంటో తెలీదు కానీ ‘నాకు ఎవరూ వద్దు. గోపాల్‌రెడ్డి కావాలి’ అని రాము చెప్పాడు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టినందుకు ఈ సందర్భంగా రాముకి థ్యాంక్స్ చెప్తున్నా.
ఆలీ: ఆయన (ఆర్జీవీ) సన్నివేశాల గురించి చెబుతుంటే.. ఇతనిలో ప్రతిభ ఉంది. పైకి వస్తాడని అనుకున్నారా?
గోపాలరెడ్డి: ఆయన కథ చెప్పే విధానం బాగుంటుంది. అది వినే సమయంలో విజువల్ మదిలో మెదులుతుంటుంది. ఆయన స్ఫూర్తితోనే ‘శివ’కి అంతలా పనిచేయగలిగా. చిత్రీకరణ పూర్తయ్యాక, రీరికార్డింగ్‌కి ముందు ఈ సినిమా చూసి యావరేజ్ అనుకున్నా కానీ ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు.
ఆలీ: ఏ సినిమా మీకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది?
గోపాలరెడ్డి: ‘శివ’, ‘క్షణం క్షణం’, ‘వర్షం’.
ఆలీ: కత్తిమీద సాము అనిపించిన చిత్రమేది?
గోపాలరెడ్డి: అమితాబచ్చన్ హీరోగా తెరకెక్కిన ‘ఆఖరి రాస్తా’. ఆయన ఇందులో ద్విపాత్రాభినయం చేశారు. డ్యుయల్ రోల్‌ని ఎలా చిత్రీకరించాలో నాకు అప్పటికి తెలియదు. అందుకే ఆయా సన్నివేశాలకు మరో కెమెరామెన్‌కి తీసుకోండి అని చిత్ర బృందానికి చెప్పాను. ‘ఎవరూ అవసరం లేదు. నువ్వు చేయగలవు గోపాల్’ అని అమితాబ్ భరోసా ఇచ్చారు . దాంతో ఈ సినిమాని సవాలుగా స్వీకరించాను.
ఆలీ: సినిమాటోగ్రాఫర్‌గా బిజీగా ఉండే మీరు నిర్మాతగా ఎందుకు మారారు? ఈ ఆలోచన ఎవరిది?
గోపాలరెడ్డి: జంధ్యాల గారి వల్ల నేను నిర్మాతగా మారాను. ఓ సందర్భంలో ఒక శిల్పి కథ చెప్పారు. నాకు చాలా బాగా నచ్చింది. వెంటనే ఈ సినిమాని నేను నిర్మిస్తానండీ అని ఆయనతో అన్నాను. బాలకృష్ణ, రాధికని నటులుగా అనుకున్నాం. చిత్రీకరణకి ముందే జంధ్యాలగారు పిలిచి ‘ఇది ఆర్ట్ ఫిల్మ్. మీ తొలి చిత్రానికి డబ్బులు రాకపోతే నాకు నిద్రపట్టదు. ముందు కమర్షియల్‌గా ఒక చిత్రం చేద్దాం. తర్వాత శిల్పికథ చేద్దాం’ అని ‘బాబాయ్- అబ్బాయ్’ కథ చెప్పారు. మళ్లీ ఆ కథ బాలకృష్ణకి వినిపించాం. ఆయన ఓకే అన్నారు. సుధాకర్ రెడ్డితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించా.
ఆలీ: నిర్మాతగా ఎన్ని సినిమాలు రూపొందించారు?
గోపాలరెడ్డి: కె.ఎల్. నారాయణతో కలిసి ఏడు చిత్రాలు నిర్మించాను. ‘క్షణక్షణం’, ‘హలో బ్రదర్’, ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’, ‘దొంగాట’, ‘నిన్నే ఇష్టపడ్డాను’, సంతోషం’, ‘రాఖీ’.
ఆలీ: ‘క్షణక్షణం’లో శ్రీదేవితో పాట పాడించాలనే ఆలోచన మీదా?వర్మదా?
గోపాలరెడ్డి: ఆలోచన ఆయనదే. నేనే శ్రీదేవిని బతిమిలాడి పాడించాను.
ఆలీ: దర్శకత్వం చేయాలని ఎప్పుడు అనిపించింది?
గోపాలరెడ్డి: ‘‘తమిళ సినిమా ‘ఆటోగ్రాఫ్’ రీమేక్ హక్కులు తీసుకున్నా, ఓసారి ఆ చిత్రం చూస్తారా’’ అంటూ బెల్లంకొండ సురేశ్ నన్ను పిలిచారు. ఆయన ఆఫీసుకి వెళ్లి సినిమా చూసుకొచ్చాక నాకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఇంతమంచి సినిమా ఈ మధ్యకాలంలో నేను చూడలేదు అనుకుంటూ ఆ సినిమా ధ్యాసలోనే ఉన్నాను. మరుసటి రోజు ఉదయం సురేశ్ వచ్చి సినిమా ఎలా ఉందో తెలుసుకుని, ఈ చిత్రానికి మీకు డైరెక్షన్ ఆఫర్ ఇస్తే చేస్తారా? అని అడిగారు. నాకు దర్శకత్వం వహించాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదు, రెండు మూడు రోజులు సమయం కావాలన్నాను. తర్వాత ఓకే అని సురేశ్‌తో చెప్పా. 45 రోజుల్లో చిత్రీకరణ పూర్తయింది. రవితేజ చాలా బాగా నటించాడు. దర్శకుడిగా చాలా సంతృప్తినిచ్చిన చిత్రమిది.
ఆలీ: అప్పట్లోనే మీరు పాన్ ఇండియా చిత్రాన్ని రూపొందించాలనుకున్నారట?
గోపాలరెడ్డి: అవును.. నాగార్జునతో అనుకున్నాం. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అశోక్ మెహతా రాసిన స్ర్కిప్టు అది. వేగవంతమైన సన్నివేశాలతో 48 గంటల్లో సాగే కథ. తనకి విషం ఎక్కించిన ముగ్గురు విలన్లని హీరో చంపాలి. ఒక్కో విలన్ ఒక్కో రాష్ట్రంలో ఉంటాడు. వారిని అన్వేషించే మార్గంలో హీరో ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఇందులో నటించేందుకు డింపుల్ కపాడియా, అనుపమ్ ఖేర్ తదితరుల్ని ఎంపిక చేశాం. అంతా సిద్ధమైంది. వారంలో ప్రారంభమవుతుందనే సమయంలో చిన్న సందేహం కలిగింది. నాకూ కె.ఎల్. నారాయణకి, నాగార్జున సోదరుడు వెంకట్‌కి కొన్ని సన్నివేశాల్లో మార్పులు చేస్తే బాగుంటుందనిపించింది. దానికి అశోక్ మెహతా నో అన్నారు. అందుకే అది కార్యరూపం దాల్చలేదు.
ఆలీ: ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత రాజమౌళి మీ బ్యానర్‌లో సినిమా చేస్తున్నారని విన్నాను..
గోపాలరెడ్డి: నిజమే. అయితే ఎప్పుడు ప్రారంభమవుతుందనేది రాజమౌళికే తెలియాలి (నవ్వులు).
ఆలీ: మీ అభిమాన దర్శకుడు?
గోపాలరెడ్డి: జంధ్యాల గారంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో 13 సినిమాలు చేశాను. ‘ముద్ద మందారం’ మా కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం.
ఆలీ: మీ గురువు స్వామిగారితో అనుబంధం ఎలా ఉండేది?
గోపాలరెడ్డి: నన్ను మంచి కెమెరామెన్‌గా తీర్చిదిద్దింది ఆయనే. చాలా గొప్పవ్యక్తి. ఒక గురువుకి నిదర్శనం ఆయన. తొమ్మిదేళ్లు ఆయన దగ్గర పనిచేశా.
ఆలీ: మోహన్‌బాబుతో మీ స్నేహం గురించి..
గోపాలరెడ్డి: నేను అసిస్టెంట్ కెమెరామెన్‌గా ఉన్నప్పుడు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. మా గురువు స్వామి ఇంటికి వచ్చి, అక్కడి నుంచి నా దగ్గరకి వస్తుండేవారాయన. కొన్ని చిత్రాలకు మేం ఇద్దరం కలిసి పనిచేశాం. అలా మొదలైన మా స్నేహం ఇప్పటికీ కొనసాగుతుంది. మోహన్ బాబు చాలా మంచి మనిషి .
ఆలీ: మిమ్మల్ని రాజమండ్రి అల్లుడు అంటారు కదా.. ఆ సంగతేంటి?
గోపాలరెడ్డి: అప్పుడు ‘సిరిసిరి మువ్వ’ సినిమాకి పనిచేస్తున్నా. ఈ సినిమా నిర్మాత బంధువు, నా భార్య బంధువు స్నేహితులు. అలా నేనూ జయకృష్ణ, కనకాల దేవదాసు.. వాళ్లింటికి (నా భార్య) భోజనానికి వెళ్లాం. తనని చూడగానే పెళ్లంటూ చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయా. మరో షెడ్యూల్‌కి రాజమండ్రి వెళ్లినపుడు అనుకోకుండా ఆమెని కలిశాను. నా ప్రేమని వ్యక్తం చేశాను. ఉత్తరాలు రాసుకుంటూ కొన్ని నెలలు గడిపాం. అందులో ఒకటి మా నాన్న కంటపడింది. ఈ విషయాన్ని మా గురువు స్వామికి చెప్పి పెళ్లి కుదిర్చారు.
ఆలీ: మీకు ఎంతమంది పిల్లలు?
గోపాలరెడ్డి: నాకు ఒక అబ్బాయి. ఒక అమ్మాయి. ఇద్దరికీ పెళ్లి అయిపోయింది. మా అబ్బాయికి ఒక బాబు.. అమ్మాయికి ఒక పాప.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Orange: 13 ఏళ్లు అయినా.. ఆ క్రేజ్ ఏమాత్రం తగ్గలే..!
-
General News
Rain Alert: తెలంగాణలో రెండ్రోజులు వర్షాలు.. 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్
-
India News
Rahul Gandhi: సూరత్ కోర్టులో రాహుల్ లాయర్ ఎవరు..?
-
General News
TSPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 100మార్కులకు పైగా వచ్చిన అభ్యర్థుల జాబితా.. సిద్ధం చేసిన సిట్
-
Politics News
Revanth Reddy: పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తాం: రేవంత్
-
India News
Mann Ki Baat: అవయవదానానికి ముందుకు రావాలి.. ప్రధాని మోదీ