‘మందులోడా’ ఛాలెంజ్‌.. రూ.లక్షన్నర ప్రైజ్‌ మనీ

మీలో మంచి డ్యాన్సర్‌ ఉన్నారా అయితే ఈ ఛాలెంజ్‌ మీకోసమే అంటున్నారు నటుడు సుధీర్‌ బాబు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘శ్రీదేవి సోడా కంపెనీ’. ఇటీవల ఈ సినిమా నుంచి మొదటి పాట లిరికల్‌ వీడియోని....

Published : 20 Jul 2021 01:50 IST

హైదరాబాద్‌: మీలో మంచి డ్యాన్సర్‌ ఉన్నారా..? అయితే ఈ ఛాలెంజ్‌ మీకోసమే అంటున్నారు నటుడు సుధీర్‌ బాబు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘శ్రీదేవి సోడా కంపెనీ’. ఇటీవల ఈ సినిమా నుంచి మొదటి పాట లిరికల్‌ వీడియో విడుదలైంది. ‘మందులోడా’ అంటూ సాగే ఈ పాటలో సుధీర్‌ మాస్‌ స్టెప్పులతో ఆకట్టుకున్నారు. తాజాగా ఆ పాటకు డ్యాన్స్ చేసి వీడియో షేర్‌ చేయమంటూ సుధీర్‌ ఛాలెంజ్‌ విసిరారు. ‘‘మీరు మంచి డ్యాన్సర్‌ అయితే.. ‘మందులోడా’ పాటకు 20 సెకన్లు డ్యాన్స్‌ చేసి ఆ వీడియోని.. #MandhulodaStepChallenge అని పేర్కొంటూ మా చిత్ర నిర్మాణ సంస్థకు షేర్‌ చేయండి. జులై 21 నుంచి 26 వరకు ఈ ఛాలెంజ్‌ కొనసాగుతుంది. ప్రతి రోజూ ది బెస్ట్‌ అనిపించేలా డ్యాన్స్‌ చేసిన ముగ్గురికి రూ.5000 అందిస్తాం. చివరి రోజున మొత్తం వీడియోల్లోంచి ఉత్తమ ప్రతిభ చూపిన ముగ్గురు డ్యాన్సర్లను సెలక్ట్‌ చేసి రూ.25,000, రూ.20,000, రూ.15,000 గిఫ్ట్‌ కూపన్స్‌ అందిస్తాం. ఇలా మొత్తంగా రూ.1.5 లక్షల ప్రైజ్‌ మనీ ఇస్తాం’’ అని సుధీర్‌ పేర్కొన్నారు.

గతేడాది విడుదలైన ‘వి’ తర్వాత సుధీర్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘శ్రీదేవి సోడా కంపెనీ’. కరణ్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో సుధీర్‌ మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. ఇందులో నటి ఆనంది కథానాయికగా సందడి చేయనున్నారు. 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ స్వరాలు అందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని