Vijay: ‘బీస్ట్‌’ డైరెక్టర్‌పై విజయ్‌ తండ్రి ఆగ్రహం

కోలీవుడ్‌ స్టార్‌హీరో విజయ్‌ నటించిన సరికొత్త చిత్రం ‘బీస్ట్‌’. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకుడు. టెర్రరిజం నేపథ్యంలో సాగే కథాంశంతో పవర్‌ప్యాక్డ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంది....

Published : 20 Apr 2022 13:01 IST

ఘాటు వ్యాఖ్యలు చేసిన చంద్రశేఖర్‌

చెన్నై: కోలీవుడ్‌ స్టార్‌హీరో విజయ్‌ నటించిన సరికొత్త చిత్రం ‘బీస్ట్‌’. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకుడు. టెర్రరిజం నేపథ్యంలో సాగే కథాంశంతో పవర్‌ప్యాక్డ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంది. వేసవి కానుకగా ఏప్రిల్‌ 13న విడుదలైన ఈసినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టినప్పటికీ, మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ఫైట్స్‌, సాంగ్స్‌.. అన్నీ బాగున్నప్పటికీ  స్క్రీన్‌ప్లే విషయంలో నెల్సన్‌ ఇంకాస్త కసరత్తు చేసి ఉంటే బాగుండేదని అందరూ చెప్పుకొన్నారు. ఈనేపథ్యంలోనే ‘బీస్ట్‌’ డైరెక్టర్‌ నెల్సన్‌పై విజయ్‌ తండ్రి, దర్శకుడు చంద్రశేఖర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఓ తమిళ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన చంద్రశేఖర్‌ లైవ్‌లోనే నెల్సన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన తనయుడికి ఉన్న స్టార్‌డమ్‌ వల్లే ‘బీస్ట్‌’కి భారీ వసూళ్లు వస్తున్నాయని అన్నారు.

‘‘ఇటీవల నేను ‘బీస్ట్‌’ చూశాను. ‘అరబిక్‌ కుత్తు’ పాటను డైహార్డ్‌ ఫ్యాన్‌లా నేనూ ఎంజాయ్‌ చేశా. విజయ్‌ స్టార్‌డమ్‌ కారణంగానే ‘బీస్ట్‌’ ఇంకా నడుస్తోంది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు, వాటి మిషన్‌.. ఇలాంటి సీరియస్‌ సబ్జెక్ట్‌ని సెలక్ట్‌ చేసుకున్నప్పుడు స్క్రీన్‌ప్లేతో ఒక మేజిక్‌ క్రియేట్‌ చేయవచ్చు. మరి ‘బీస్ట్‌’లో ఆ మేజిక్‌ ఎక్కడ ఉంది? మిలటరీ వ్యవస్థ, ‘రా’ ఏజెంట్‌ ఎలా వ్యవహరిస్తాడు? ఇలాంటి వాటిపై నెల్సన్‌ ఇంకా క్షుణ్ణంగా వర్క్‌ చేయాల్సి ఉండేది. ‘బీస్ట్‌’ హిట్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే విధంగా.. సంగీత దర్శకుడు, ఫైట్‌ మాస్టర్‌, డ్యాన్స్‌ మాస్టర్‌, ఎడిటర్‌, హీరో.. వీళ్ల కారణంగానే ‘బీస్ట్‌’ విజయం సాధించింది’’ అని చంద్రశేఖర్‌ తెలిపారు. ‘బీస్ట్‌’ విజయంలో అందరి పాత్ర ఉందని తెలిపిన చంద్రశేఖర్‌.. నెల్సన్‌ పేరుని మాత్రం సినిమా విజయంలో భాగం చేయలేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని