రాజమౌళి టు అట్లీ.. దక్షిణాదిలో ఒక్క ఫ్లాప్‌ లేని దర్శకులు వీరే!

ZERO flop directors: దక్షిణాదిలో కొందరు దర్శకులు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. రాజమౌళి నుంచి అట్లీ వరకూ ఎవరెవరు ఉన్నారో ఓ లుక్‌ వేయండి.

Published : 09 Sep 2023 17:26 IST

సినీ పరిశ్రమలో దర్శకుడిని ‘కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌’ అంటారు. ఒక సినిమాను విజయ తీరాలకు చేర్చినా, నడి సముద్రంలో ముంచినా కీలక బాధ్యుడు అతడే. కథ మొదలుకొని, నటీనటులు, సంగీతం, ఎడిటింగ్‌, సినిమాటోగ్రఫీ అన్ని విభాగాల్లో పట్టు ఉన్నప్పుడే ఆ దర్శకుడు విజయం సాధిస్తాడు. ఒకప్పుడు ‘ఫలానా హీరో సినిమా’ అని ప్రేక్షకులు థియేటర్‌ వెళ్లారు. కానీ, గత కొంతకాలంగా ‘ఫలానా దర్శకుడి మూవీ’ అనే స్థాయికి కొందరు డైరెక్టర్లు ఎదిగారు. అంతేకాదు, ఇప్పటివరకూ కెరీర్‌లో ఒక్క ఫ్లాప్‌ను కూడా వాళ్లు చూడలేదు. అలా దక్షిణాదిలో వరుస హిట్‌లతో అదరగొడుతున్న దర్శకులెవరో తెలుసా?

ప్రస్తుతం అంతా షారుక్‌ఖాన్‌ ‘జవాన్‌’ (Jawan) ట్రెండ్‌ నడుస్తోంది. విడుదలైన తొలిరోజు బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ తెచ్చుకోవడమే కాదు, రూ.129 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. తమిళ దర్శకుడు అట్లీ షారుక్‌ను మాస్‌ అవతార్‌లో చూపించి ఘన విజయం సాధించారు. ఇప్పటివరకూ అట్లీ తీసిన ఒక్క మూవీ కూడా ఫ్లాప్‌ అవలేదు. ‘రాజా రాణి’, ‘తెరి’, ‘మెర్సెల్‌’ (అదిరింది), బిగిల్‌ (విజిల్‌), ఇప్పుడు ‘జవాన్‌’. ప్రతి చిత్రం కాసుల వర్షాన్ని కురిపించిందే!

ఇక మరో తమిళ దర్శకుడు కూడా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఆయన లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh kangaraj) ఇప్పటివరకూ ఆయన తీసిన సినిమాలన్నీ మంచి టాక్‌ను సొంతం చేసుకున్నవే. ‘మా నగరం’, ‘ఖైదీ’, ‘మాస్టర్‌’, ‘విక్రమ్‌’ సినిమాలతో వరుస విజయాలను అందుకున్నారు. ఇప్పుడు ‘లియో’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విజయ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.  అలాగే రజనీకాంత్‌తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన మరో తమిళ దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ కూడా మంచి విజయాలను తనఖాతాలో వేసుకున్నారు. విజయ్‌తో తీసిన ‘బీస్ట్‌’ రివ్యూల పరంగా మిశ్రమ స్పందనలు అందుకున్నా, కమర్షియల్‌గా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది.

మలయాళంలో నటుడిగా కెరీర్‌ను ప్రారంభించి దర్శకుడి రాణిస్తున్నారు బసిల్‌ జోసెఫ్‌ (basil joseph). ఆయన తీసిన ‘కుంజి రామాయణం’, ‘గోదా’, ‘మిన్నల్‌ మురళి’ చిత్రాలు అలరించాయి. ఇక మలయాళంలో సమీర్‌ తాహిర్‌, అంజలి మేనన్‌, గీతూ మోహన్‌ దాస్‌ తదితరులు కూడా వరుస హిట్లు అందుకున్నారు. అలాగే కన్నడలోనూ రాజ్‌ బి.శెట్టి, రిషబ్‌ శెట్టి (rishab shetty)లతో పాటు ప్రశాంత్‌ నీల్‌ (prashanth neel) భారతీయ చిత్ర పరిశ్రమపై తనదైన ముద్రవేశాడు. ఆయన తీసిన ‘కేజీయఫ్‌’ మూవీలు వందల కోట్లు రాబట్టాయి. ఇప్పుడు ప్రభాస్‌తో చేస్తున్న ‘సలార్‌’కు విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఈ నెల 28న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడటంతో ఒకే రోజు దాదాపు ఆరు సినిమాలు ఆ రోజున విడుదలకు సిద్ధమవుతుండటం గమనార్హం.

తెలుగులో వన్‌ అండ్‌ ఓన్లీ జక్కన్న

రాజమౌళి (Raja mouli).. ఇది పేరు కాదు.. విజయానికి రాజముద్ర. స్టూడెంట్‌ నెం.1 మొదలుకొని, ఇప్పటివరకూ ఆయన తీసిన ప్రతి సినిమా బాక్సాఫీస్‌ వద్ద హిట్టు కొట్టినదే. కాసుల వర్షాన్ని కురిపించిందే! ‘బాహుబలి’ భారతీయ సినిమాను ప్రపంచ యవనికపై నిలబెట్టాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆస్కార్‌ను సైతం ఒడిసి పట్టింది. ప్రస్తుతం మహేశ్‌బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కాల్సి ఉంది. స్క్రిప్ట్‌వర్క్‌ చివరి దశలో ఉండగా, ప్రస్తుతం ప్రీప్రొడక్షన్‌ పనులు సాగుతున్నట్లు సమాచారం.

- ఇంటర్నెట్‌డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని