Tiger 3: సల్మాన్‌ ఖాన్‌ ‘టైగర్‌ 3’.. ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ ఎంతంటే?

సల్మాన్‌ ఖాన్‌ హీరోగా దర్శకుడు మనీష్‌ శర్మ తెరకెక్కించిన చిత్రం ‘టైగర్‌ 3’. నవంబరు 12న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా తొలిరోజు వసూళ్లను నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ వెల్లడించింది.

Published : 14 Nov 2023 01:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అగ్ర హీరోల సినిమాలు ప్రారంభమైనా, విడుదలపైనా చాలామంది ఆసక్తి చూపిస్తారు. భారీ అంచనాల నడుమ విడుదల కావడమే ఆలస్యం.. టాక్‌ ఏంటి? వసూళ్లు ఎలా ఉన్నాయి? అంటూ ఆరా తీస్తుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా నిర్మాణ సంస్థలు తమ సినిమాల కలెక్షన్‌ వివరాలు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలోనే యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ (Yash Raj Films) సంస్థ ‘టైగర్‌ 3’ (Tiger 3) ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ ప్రకటించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.94 కోట్ల (గ్రాస్‌) వసూళ్లు (Tiger 3 First Day Collections) రాబట్టిందని తెలిపింది. ఇండియాలో రూ.52.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.41.50 కోట్లుగా పేర్కొంది. ఓవర్సీస్‌లో విడుదలైన తొలిరోజు అత్యధిక గ్రాస్‌ కలెక్షన్స్‌ (పెయిడ్‌ ప్రివ్యూలు సహా) చేసిన తొలి హిందీ సినిమా ఇదేనని పోస్టర్‌లో పేర్కొంది. మనీష్‌ శర్మ దర్శకత్వంలో సల్మాన్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా దీపావళి సందర్భంగా ఆదివారం విడుదలైన సంగతి తెలిసిందే. హిందీ, తెలుగు, తమిళంలో సందడి చేస్తోంది.

అమీషాపటేల్‌ విషయంలో అసహనం.. మాట్లాడటానికి ఇష్టపడని కరీనాకపూర్‌

స‌ల్మాన్‌ ఖాన్‌ (Salman Khan), క‌త్రినాకైఫ్ (Katrina Kaif) జంట‌గా ఇదివ‌ర‌కు వ‌చ్చిన ‘ఏక్ థా టైగ‌ర్‌’, ‘టైగ‌ర్ జిందా హై’ సినిమాల‌కి కొనసాగింపుగా ‘టైగ‌ర్ 3’ రూపొందింది. య‌శ్‌రాజ్ స్పై యూనివ‌ర్స్‌లో భాగంగానే రూపొందిన ‘వార్‌’, ‘ప‌ఠాన్’ల హీరోలు షారూఖ్‌, హృతిక్ రోష‌న్‌ల అతిథి పాత్ర‌లు ప్రేక్షకులను అలరించాయి. సల్మాన్‌- కత్రినా జోడీ, యాక్షన్‌ సీక్వెన్స్‌ విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ సినిమా కథేంటంటే: విద్వేష‌పు ఆలోచ‌న‌ల్లో ఉన్న మాజీ ఐఎస్ఐ ఏజెంట్ అతీష్ రెహ్మాన్ (ఇమ్రాన్ హ‌ష్మీ) పాకిస్థాన్‌ ప్ర‌ధాన మంత్రి న‌స్రీన్ ఇరానీ (సిమ్రాన్‌)ని హ‌త్య చేసి, ఆ నేరాన్ని ఇండియా ఏజెంట్ టైగ‌ర్ (స‌ల్మాన్‌ఖాన్‌)పై వేయాల‌ని ప‌న్నాగం ప‌న్నుతాడు. న‌స్రీన్ ఇరానీ చేస్తున్న శాంతి ప్ర‌య‌త్నాలు న‌చ్చ‌ని అతీష్‌, పాకిస్థాన్‌ దేశ సైన్యాధికారుల్ని రెచ్చ‌గొట్టి మ‌రీ ఇందుకోసం వ్యూహం ర‌చిస్తాడు. టైగ‌ర్ (స‌ల్మాన్‌ఖాన్‌), అత‌ని భార్య జోయా (క‌త్రినాకైఫ్‌) వ్య‌క్తిగ‌త జీవితంలోకి వెళ్లి వారి బిడ్డ జూనియ‌ర్‌ని అడ్డం పెట్టుకుని ఇద్ద‌రినీ ఇస్తాంబుల్‌లో ఓ ఆప‌రేష‌న్‌కి వాడుకుంటాడు. ఆ ఆప‌రేష‌న్‌తోనే టైగ‌ర్‌నీ, జోయానీ దేశ‌ద్రోహులుగా ప్ర‌పంచం ముందు నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేస్తాడు. మ‌రి అతీష్ అనుకున్న‌ది నెర‌వేరిందా? అత‌ని విద్వేష‌పు ప్ర‌య‌త్నాల్ని టైగ‌ర్ ఎలా తిప్పికొట్టాడనేది తెర‌పై చూడాల్సిందే.

పూర్తి రివ్యూ కోసం క్లిక్‌ చేయండి..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని