Tiger Nageswara Rao: పులుల్ని వేటాడే పులి

జింకల్ని వేటాడే పులుల్ని చూసుంటావ్‌. పులుల్ని వేటాడే పులిని ఎప్పుడైనా చూశావా? అంటున్నాడు రవితేజ. ఆ కథేమిటో తెలియాలంటే ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘టైగర్‌ నాగేశ్వరరావు’ చూడాల్సిందే.

Updated : 25 May 2023 16:16 IST

జింకల్ని వేటాడే పులుల్ని చూసుంటావ్‌. పులుల్ని వేటాడే పులిని ఎప్పుడైనా చూశావా? అంటున్నాడు రవితేజ. ఆ కథేమిటో తెలియాలంటే ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘టైగర్‌ నాగేశ్వరరావు’ చూడాల్సిందే. నుపుర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌  కథానాయికలు. వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ పతాకంపై అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు. అక్టోబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు వినూత్నంగా ఆరంభమయ్యాయి. రాజమహేంద్రవరంలోని గోదావరి నదిపై కట్టిన ఐకానిక్‌ హేవ్‌లాక్‌ బ్రిడ్జ్‌పై, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైలు వద్ద ఫస్ట్‌లుక్‌ ప్రచార చిత్రాన్ని విడుదల వేడుకని నిర్వహించారు.  ఐదు భాషల్లో విడుదలైన ప్రచార చిత్రంలో  ఐదుగురు తారలు టైగర్‌  నాగేశ్వరరావు ప్రపంచాన్ని పరిచయం చేశారు. ‘అది 70వ దశకం. బంగాళాఖాతం తీర ప్రాంతంలోని ఓ చిన్న గ్రామం. ప్రపంచాన్ని భయపెట్టే చీకటి కూడా అక్కడి జనాల్ని చూసి భయపడుతుంది. దడదడమంటూ వెళ్లే రైలు ఆ ప్రాంత పొలిమేర రాగానే గజగజ వణుకుతుంది. ఆ ఊరు మైలురాయి కనపడితే జనం అడుగులు తడబడతాయి. దక్షిణ భారతదేశపు నేర రాజధాని... స్టూవర్ట్‌పురం. ఆ ప్రాంతానికి ఇంకో పేరు కూడా ఉంది. టైగర్‌ జోన్‌... ది జోన్‌ ఆఫ టైగర్‌ నాగేశ్వరరావు’ అంటూ వెంకటేష్‌ ఇచ్చిన వాయిస్‌ ఓవర్‌తో తెలుగు ప్రచార చిత్రం విడుదలైంది. వేడుకలో వంశీ మాట్లాడుతూ ‘‘రవితేజ అభిమానుల ఆకలి తీరేలా ఉంటుందీ చిత్రం. నవ్వు చేయ్‌ వంశీ, నేనున్నా అని అభయమిచ్చారు రవితేజ. స్టూవర్ట్‌పురం నేపథ్యంలో ఇదివరకు సినిమాలొచ్చాయి. వాటికి భిన్నంగా టైగర్‌ నాగేశ్వరరావు బయోపిక్‌గా ఈ సినిమాని తీస్తున్నా. ఆయనేం చేశారో దాన్నే తెరపైకి తీసుకొస్తున్నా. రవితేజ అభిమానులు కోరుకునే యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఇందులో చాలానే ఉన్నాయి. వాటి కోసం రాజమహేంద్రవరం బ్రిడ్జ్‌ సెట్‌ని ప్రత్యేకంగా తీర్చిదిద్దాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు సినిమాని  చేరువ చేయగలిగే నటుడైన రవితేజ ఇందులో భిన్నంగా కనిపిస్తారు. ఆయన ‘ధమాకా’ వంద కోట్లు వసూళ్లు సాధించింది. ఈ సినిమా రూ: వెయ్యి కోట్లు వసూళ్లు సాధించేలా కథని సిద్ధం చేసి తెరకెక్కించాం. టైగర్‌ నాగేశ్వరరావు జీవితంలో బయటపడని నిజమేదో దాగుందని నాకు అర్థమైంది. ఆ నిజం కోసమే ఈ సినిమా చేస్తున్నా. టైగర్‌ నాగేశ్వరరావు పుట్టింది ఇక్కడే అయినా, అన్ని పాంతాలవారికీ సాయం చేశాడు. ఆయన చేసిన మంచి అందరికీ తెలియాలనే ఈ సినిమాని పాన్‌ ఇండియా స్థాయిలో తీస్తున్నాం’’ అన్నారు. నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా మాకు చాలా ప్రత్యేకమైనది. దర్శకుడు వంశీ నాలుగేళ్లు కష్టపడి ఈ సినిమా కోసమే ప్రయాణం చేస్తున్నాడు. అందరినీ అలరించే ఓ మంచి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సహ నిర్మాత మయాంక్‌ సింఘానియాతోపాటు ఇతర చిత్రబృందం పాల్గొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని