#NBK108: బాలకృష్ణతో చేయి కలిపిన యువ హీరోయిన్‌.. ఆకర్షిస్తోన్న పోస్టర్‌

బాలకృష్ణ హీరోగా దర్శకుడు అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎన్బీకే 108’ (వర్కింగ్‌ టైటిల్‌). ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న యువ హీరోయిన్‌ వివరాలను చిత్ర బృందం ప్రకటించింది.

Published : 09 Mar 2023 19:36 IST

హైదరాబాద్‌: ప్రముఖ హీరో బాలకృష్ణ (Balakrishna)తో యువ హీరోయిన్‌ శ్రీలీల (Sreeleela) చేయి కలిపిన పోస్టర్‌ తాజాగా విడుదలై, నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. శ్రీలీలతోపాటు బాలకృష్ణ చెయ్యి మాత్రమే కనిపించేలా డిజైన్‌ చేసిన ఈ పోస్టర్‌ ఆసక్తిని పెంచుతోంది. బాలకృష్ణ హీరోగా దర్శకుడు అనిల్‌ రావిపూడి ఓ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. #NBK108 వర్కింగ్‌ టైటిల్‌తో ప్రారంభమైన ఈ సినిమాలో శ్రీలీల ఓ కీలక పాత్ర పోషించనుందని దర్శకుడు గతంలోనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇప్పుడు సోషల్‌ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోన్న చిత్రీకరణలో ఆమె గురువారం పాల్గొన్నట్టు తెలిపారు. ఈ మేరకు రిలీజ్‌ చేసిన ఫొటోలో శ్రీలీల నవ్వుతూ, విజయ సంకేతం చూపిస్తూ కనిపించారు. బాలకృష్ణ చేతికి ఓ తాడు, కడియం, టాటూ కనిపించడంతో సినీ అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది.

‘పటాస్‌’, ‘ఎఫ్‌ 2’, ‘సరిలేరు నీకెవరు’, ‘ఎఫ్‌ 3’ తదితర హిట్‌ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడే అనిల్‌ రావిపూడి. గత చిత్రాలకు భిన్నంగా ఈ ‘ఎన్బీకే 108’ను రూపొందిస్తున్నారు. ఇందులో శ్రీలీలను బాలకృష్ణ కూతురిగా చూపించనున్నారు. బాలయ్య సరసన ఎవరు నటిస్తారన్నది ఇంకా ప్రకటించలేదు. ఈ విషయంలో కాజల్‌ అగర్వాల్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. షైన్స్‌ స్క్రీన్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ‘పెళ్లి సందD’తో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల తొలి ప్రయత్నంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. రవితేజ సరసన ఆమె నటించిన ‘ధమాకా’ ఆమెకు విశేష క్రేజ్‌ తీసుకొచ్చింది. ‘ఎన్బీకే 108’సహా పలువురి అగ్ర హీరోల చిత్రాల్లో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని