Rajinikanth: రాజకీయాల్లోకి రజనీ.. మొసళ్లు నిన్ను మింగడానికి వేచి ఉన్నాయని వీరప్పన్‌ హెచ్చరిక!

ప్రముఖ హీరో రజనీకాంత్‌ను ఎర్ర చందనం స్మగ్లర్‌ వీరప్పన్‌ హెచ్చరించిన దృశ్యాలను ఓటీటీ ‘జీ5’ నెట్టింట విడుదల చేసింది.

Published : 13 Dec 2023 01:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: 73 ఏళ్ల వయసులోనూ అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌ (Rajinikanth) వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. మంగళవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు. ఈ క్రమంలో.. ‘కూసే మునిసామి వీరప్పన్‌’ ( Koose Munisamy Veerapan) పేరుతో స్ట్రీమింగ్‌ కానున్న డాక్యుమెంటరీ నుంచి ఓటీటీ ‘జీ5’ (zee 5) ఓ వీడియోను పంచుకుంది. అందులో.. రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో వీరప్పన్‌ తనదైన శైలిలో స్పందిస్తారు. ఆయనను దోచుకునేందుకు, మింగేసేందుకు చాలా మొసళ్లు వేచి చూస్తున్నాయని హెచ్చరించారు.

ఆ విషయంలో ఏకైక భారతీయ నటుడు.. రజనీకాంత్‌ బర్త్‌డే స్పెషల్‌

‘‘ఆయన (ఎంజీఆర్‌) చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రజల కష్టాలు ఆయనకు తెలుసు. ఎంజీఆర్‌లాంటి వారు పుట్టడం కష్టం. అయితే, రజనీకాంత్‌ కూడా ఆయనలా అవుతారని నాకు బాగా తెలుసు. రజనీకాంత్‌ అందరినీ గౌరవిస్తారు. ఎవరి పట్లా అమర్యాదగా ప్రవర్తించరు. దేవుడిని బాగా నమ్ముతారు. కానీ, ఒక్క విషయం. అయ్యా రజనీకాంత్‌.. నేను నీతో మాట్లాడుతున్నా.. రాజకీయాల్లోకి రావద్దు. ఎవరికీ మద్దతు తెలపవద్దు. నిన్ను మింగడానికి ఎన్నో మొసళ్లు వేచి చూస్తున్నాయి. అవి ఒక్కసారిగా నీపై దాడి చేస్తాయి. దయ చేసి అమాయకుడిలా బలికావద్దు’’ అంటూ వీరప్పన్‌ మాట్లాడిన దృశ్యాలను విడుదల చేసింది.

1996లో జరిగిన తమిళనాడు ఎన్నికలకు ముందు జయలలితకు వ్యతిరేకంగా రజనీ మాట్లాడారని, ఒకవేళ జయలలిత తిరిగి అధికారంలోకి వస్తే ఆ రాష్ట్ర ప్రజలను దేవుడు కూడా రక్షించలేడని అభిప్రాయం వ్యక్తం చేశారని, అది మరో పార్టీ (డీఎంకే) గెలుపునకు దారితీసిందని కోలీవుడ్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే రజనీ గురించి వీరప్పన్‌ మాట్లాడి ఉంటారని సమాచారం. ఆ తర్వాత రజనీకాంత్‌ ఏ రాజకీయ పార్టీకి పరోక్షంగా, ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వలేదు. కొన్నాళ్ల క్రితం రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వద్దనుకున్నారు. వీరప్పన్‌ జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘కూసే మునిసామి వీరప్పన్‌’ డాక్యుమెంటరీ ఈ నెల 14 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని