F3 FUNtastic Event: ఈసారి అభిమానులను నిరాశ పరచను: వెంకటేశ్‌

పరిస్థితుల కారణంగా తాను నటించిన రెండు చిత్రాలు ఓటీటీలో విడుదల చేయాల్సి వచ్చిందని, కానీ, ఈసారి అభిమానులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ పరచనని అన్నారు అగ్ర కథానాయకుడు

Updated : 21 May 2022 22:56 IST

హైదరాబాద్‌: పరిస్థితుల కారణంగా తాను నటించిన రెండు చిత్రాలు ఓటీటీలో విడుదల చేయాల్సి వచ్చిందని, కానీ, ఈసారి అభిమానులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ పరచనని అన్నారు అగ్ర కథానాయకుడు వెంకటేశ్‌(Venkatesh). వరుణ్‌ తేజ్‌తో కలిసి ఆయన నటించిన తాజా చిత్రం ‘ఎఫ్‌3’. తమన్నా, మెహరీన్‌, సోనాల్‌ చౌహాన్ హీరోయిన్లు. అనిల్‌ రావిపూడి దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 27 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘ఎఫ్‌3 ఫన్‌టాస్టిక్‌’ ఈవెంట్‌ను నిర్వహించారు.

ఈ సందర్భంగా అగ్ర కథానాయకుడు వెంకటేశ్‌ మాట్లాడుతూ.. ‘‘మూడేళ్ల క్రితం నా సినిమా థియేటర్‌లో విడుదలైంది. పరిస్థితుల కారణంగా, ‘నారప్ప’, ‘దృశ్యం’ ఓటీటీల్లో విడుదలయ్యాయి. థియేటర్‌లో నా సినిమా చూడాలని ఎదురు చూసిన అభిమానులు నిరాశపడ్డారు. వారందరికీ ‘ఎఫ్‌3’ మంచి ట్రీట్‌. నన్ను అభిమానించే ఫ్యామిలీ అభిమానులు తప్పకుండా ఎంజాయ్‌ చేస్తారు. అనిల్‌ అద్భుతమైన స్క్రిప్ట్‌తో సినిమా చేశారు. ఇలాంటి సినిమాలను గతంలోనూ ఆదరించారు. అలాగే ‘ఎఫ్‌3’ని కూడా చూస్తారని ఆశిస్తున్నా. ఈ సినిమా కోసం కష్టపడి పనిచేసిన నటీనటులు, సాంకేతిక బృందానికి అభినందనలు. మే 27న ‘ఎఫ్‌3’ని థియేటర్‌లో చూసి ఆనందించండి’’ అని అన్నారు.

‘‘ఎఫ్‌3’ మొదలు పెట్టిన తర్వాత రెండు వేసవి కాలాలు పూర్తయ్యాయి. మరోవైపు పూర్తి స్థాయి కామెడీ చిత్రం వచ్చి చాలా రోజులు అయింది. సినిమా చూసి అందరూ ఎంజాయ్‌ చేస్తారు. వెంకటేశ్‌గారు చాలా మందితో మల్టీస్టారర్‌ చేశారు. కానీ, రెండోసారి చేసే అవకాశం నాకు మాత్రమే దక్కింది. వెంకటేశ్‌, అనిల్‌ రావిపూడి వల్ల నాకు ‘ఎఫ్‌3’ మరో ప్లస్‌ అవుతుంది’’ అని వరుణ్‌ తేజ్‌ చెప్పుకొచ్చారు.

‘ఎఫ్‌2’నే మాకు పెద్ద శత్రువు: అనిల్‌

దర్శకుడు అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ.. ‘‘2020 తర్వాత రెండేళ్లు అందరికీ విరామం. చాలా సుదీర్ఘ ప్రయాణం. మిమ్మల్ని నవ్వించటం కోసం చాలా కష్టపడ్డాం. ఎందుకంటే మా ముందు ‘ఎఫ్‌2’ అనే పెద్ద శత్రువు ఉంది. దానికి మించేలా ఈ సినిమా ఉండాలనుకున్నాం. నవ్వడం చాలా సులభం.. కానీ, కామెడీని క్రియేట్‌ చాలా కష్టం. నా కోసం, సినిమా కోసం నా టీమ్‌ చాలా ఇబ్బందులు పడింది. నన్ను భరించింది. ఈ సినిమాలో 35మందికి పైగా ఆర్టిస్టులు ఉన్నారు. ప్రతి ఫ్రేమ్‌లోనూ చాలా కష్టపడి పనిచేశారు. ‘ఈ సినిమాను కామెడీ ఫిల్మ్‌ అనకండి’ అని దేవిశ్రీ అన్నారు. దానికి కనెక్ట్‌ అయి, మంచి సంగీతం అందించారు. వరుణ్‌ నాకొక బ్రదర్‌లాంటివారు. ‘ఎఫ్‌2’లో కనిపించిన వరుణ్, ‘ఎఫ్‌3’ కనిపించే వరుణ్‌ వేరు. చాలా చక్కగా కామెడీ పంచారు. వెంకటేశ్‌గారు నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌. స్టార్‌ హీరో అయినా, కామెడీ చేసేటప్పుడు ఆ ఇమేజ్‌ను పక్కన పెట్టి చేస్తారు. ఈ ప్రయాణం ఇలాగే కొనసాగాలి. లవ్‌వ్యూ వెంకటేశ్‌గారు.. ‘నవ్వటం ఒక యోగం.. నవ్వలేకపోవటం రోగం.. నవ్వించటం ఒక భోగం’ ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ చేసిన పని ఇదే’’ అని అన్నారు.

నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. ‘తొలి సన్నివేశం నుంచి చివరి వరకూ అనిల్‌ రావిపూడి మిమ్మల్ని నవ్విస్తారు. నిర్మాతల కుమారుడు వెంకటేశ్‌, వరుణ్‌ మామూలుగా నవ్వించరు. ఎఫ్‌2లో ఇద్దరు హీరోయిన్లు ఉంటే ఇందులో నలుగురు ఉన్నారు. సాంకేతిక బృందం కూడా చాలా కష్టపడి పనిచేసింది. ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్‌ చేస్తారు’’ అని అన్నారు. కార్యక్రమంలో సునీల్‌, మెహ్రీన్‌, రాజేంద్ర ప్రసాద్, సోనాల్‌ చౌహాన్‌ తదితరులు పాల్గొన్నారు.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని