Vishnu Vishal: చిన్న సినిమాల్లో నటించను.. అలాంటి పాత్రలు చేయాలనుకోవడం లేదు..: విష్ణు విశాల్‌

సినిమాను అంగీకరించే ముందు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటానని నటుడు విష్ణు విశాల్ అన్నారు.

Updated : 08 Feb 2024 13:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విష్ణు విశాల్‌, విక్రాంత్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘లాల్‌ సలామ్‌’ (Lal Salaam). ఇందులో రజనీకాంత్‌ కీలకపాత్ర పోషించారు. ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం ప్రచారం జోరు పెంచింది. ఈ నేపథ్యంలో నటుడు విష్ణు విశాల్ (Vishnu Vishal) ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన సినీ కెరీర్‌ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

‘‘నేను స్క్రిప్ట్‌ వినకుండానే చిత్రబృందాన్ని చూసి సినిమాలు అంగీకరిస్తానని అందరూ అనుకుంటారు. కానీ, అది నిజంకాదు. ‘లాల్‌ సలామ్‌’ కోసం ఐశ్వర్య రజనీకాంత్‌ నన్ను సంప్రదించినప్పుడు నేను సమయం కావాలని అడిగాను. మొత్తం స్క్రిప్ట్‌ వివరించాలని కోరాను. ఆమె నాకు ఐదు గంటలు పాటు దానిని చెప్పారు. ఇలా అడిగినందుకు కొందరు నాకు అహంకారమనుకున్నారు. నిజమేంటంటే.. నేను మంచి సినిమాల్లో మాత్రమే పనిచేయాలనుకుంటాను. కథ ప్రేక్షకాదరణ పొందుతుందనుకుంటేనే ఓకే చేస్తాను. అంత జాగ్రత్త తీసుకుంటాను కాబట్టే.. నా సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టాయి. అలాగే చిన్న పాత్రలు చేయాలనుకోను. హీరోగా విజయం సాధించాలనే ఇన్నేళ్లుగా కష్టపడుతున్నా. పెద్ద స్టార్‌ల సినిమాల్లో బ్రదర్‌గా, సెకండ్‌ లీడ్‌గా అవకాశాలు వచ్చినా నో చెప్పాను. మంచి సినిమాల్లో మాత్రమే నటించాలనుకుంటా. రజనీకాంత్‌తో కలిసి పనిచేయాలనే నా కల ‘లాల్‌ సలామ్‌’తో తీరింది’ అని చెప్పారు.

తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రచారమవుతోన్న వార్తలపై స్పందించారు. వాటిని రూమర్లుగా కొట్టిపారేశారు. తనకు ఆ ఆలోచనే లేదని స్పష్టం చేశారు.  రాజకీయాలపై అసలు అవగాహన లేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని