Vishwak Sen: సినిమా మారినా ఆ రోజు నేను రావడం పక్కా: విశ్వక్‌ సేన్‌

సినిమా మారినా తాను మార్చి 8న ప్రేక్షకుల ముందుకురావడం పక్కా అని అన్నారు హీరో విశ్వక్‌సేన్‌. ప్రెస్‌ మీట్‌లో ఆయన మాట్లాడారు.

Published : 07 Feb 2024 21:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తనను నిజమైన అఘోరా అనుకొని కుంభమేళాలో పలువురు డబ్బులు దానం చేశారని హీరో విశ్వక్‌సేన్‌ (Vishwaksen) తెలిపారు. ఆ క్షణాలు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయన్నారు. అఘోరా పాత్రలో ఆయన నటించిన చిత్రం ‘గామి’ (Gaami). నూతన దర్శకుడు విద్యాధర్‌ తెరకెక్కించారు. చాందిని చౌదరి కథానాయిక. చిత్ర బృందం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించి విడుదల తేదీ ప్రకటించింది. ఈ సినిమా మార్చి 8న ప్రేక్షకుల ముందుకురానున్నట్లు తెలిపింది. అదే రోజు విడుదల కావాల్సిన తన మరో చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari) తర్వాత వస్తుందన్నారు విశ్వక్‌.

‘‘గతంలో నేను నటించిన ‘ఫలక్‌నుమా దాస్‌’ సినిమా విడుదలకు ముందే ‘గామి’ పనులు ప్రారంభమయ్యాయి. దర్శకుడు కథ మొత్తాన్ని నాతో బలవంతంగా చదివించాడు. ఈ స్టోరీతో నాలుగున్నరేళ్లు ప్రయాణం చేశాం. ఇంత సమయం తీసుకున్నాం కాబట్టే విజువల్‌ ఎఫెక్ట్స్‌ అనుకున్న స్థాయిలో వచ్చాయి. ట్రైలర్‌ అదిరిపోయింది. మీ అందరికీ చూపించేందుకు ఆసక్తిగా ఉన్నా. సినిమా మారినా నేను మార్చి 8న మీ ముందుకురావడం పక్కా. ఈ చిత్రం రెడీగా ఉంది. అందుకే ఆ రోజున విడుదల చేయబోతున్నాం. ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ పనులు పెండింగ్‌లో ఉన్నాయి’’ అని తెలిపారు.

1990 నేపథ్యంలో సాగే కథతో ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ రూపొందుతోంది. అప్పట్లో గోదావరి గ్యాంగ్‌ వార్స్‌, రాజకీయాలు ఎలా ఉండేవో చూపించనున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నేహాశెట్టి హీరోయిన్‌. అంజలి కీలకపాత్ర పోషిస్తున్నారు. గతేడాది డిసెంబరులోనే ఈ సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేశారు. కానీ, సాధ్యపడలేదు. మార్చి 8న రిలీజ్‌ చేస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం ప్రకటించినా, మేలో విడుదలయ్యే అవకాశాలున్నాయని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని