MAA election: సిని‘మా’ వారం

కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం.. లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే షూటింగ్స్‌ పట్టాలెక్కుతున్నాయి. గడిచిన వారం రోజుల నుంచి అడపాదడపా సినిమా చిత్రీకరణలు తిరిగి ప్రారంభమయ్యాయి.....

Published : 27 Jun 2021 16:51 IST

అడపాదడపా షూట్స్.. అన్నింటినీ మించి ఎలక్షన్స్‌

వారం నుంచి రోజుకో కొత్త న్యూస్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం.. లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే షూటింగ్స్‌ పట్టాలెక్కుతున్నాయి. గడిచిన వారం రోజుల నుంచి అడపాదడపా సినిమా చిత్రీకరణలు తిరిగి ప్రారంభమయ్యాయి. దాంతో చిత్రపరిశ్రమలో సెలబ్రేషన్స్‌ షురూ అవుతున్నాయని భావించినంతలోనే ‘మా’ ఎలక్షన్‌తో ఒక్కసారిగా పరిస్థితి మరింత రసవత్తరంగా మారింది. ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది నలుగురు ప్రముఖ నటీనటులు అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. అసలు ఈ వారం ప్రారంభం నుంచి వచ్చిన సిని‘మా’ విశేషాలివే..

ఆదివారం ఆరంభం..

ఈ ఏడాది జరగనున్న ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్నట్లు నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా ‘మా’ ఎన్నికల వ్యవహారం తెరపైకి వచ్చింది. అసోసియేషన్‌లో ఎన్నో సమస్యలున్నాయని.. వాటిని చక్కదిద్దడానికి.. కళాకారులకు అన్నివిధాలుగా సేవ చేయడానికి తన వద్ద పక్కా ప్రణాళిక ఉందని ఆయన తెలిపారు.

సోమవారం ఇలా..

సెప్టెంబర్‌లో జరగనున్న ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌కు పోటీగా తాను కూడా బరిలోకి దిగుతున్నట్లు నటుడు మంచు విష్ణు ప్రకటించారు. ఈ క్రమంలోనే తన తండ్రితో కలిసి ఇండస్ట్రీలోని సీనియర్‌ నటులైన కృష్ణ ఇంటికి చేరుకుని మద్దతు కోరారు. దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టింది.

మంగళవారం.. ముచ్చటగా ముగ్గురు

ప్రస్తుతం ‘మా’ అసోసియేషన్‌లో జనరల్‌ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న నటి జీవితా రాజశేఖర్‌ సైతం ఈ ఏడాది ఎన్నికల సంగ్రామంలోకి అడుగుపెడుతున్నట్లు తెలియజేశారు. ‘మా’లో అంతర్గతంగా ఉన్న సమస్యలన్నింటిపై తనకి పూర్తి అవగాహన ఉందని వాటి పరిష్కారానికి ప్రణాళిక సిద్ధం చేశానని ఆమె అన్నారు.

బుధవారం.. తెరపైకి మరో పేరు

ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్‌ ఇలా ప్రముఖ నటీనటుల పేర్లు తెరపైకి రావడంతో ఫిల్మ్‌ నగర్‌ వర్గాల్లో ‘మా’ ఎలక్షన్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే నటి హేమ సైతం ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు వచ్చారు. ఈసారి ట్రెజ‌ర‌ర్ ప‌ద‌వికి పోటీ చేయాల‌ని అనుకున్నప్పటికీ.. తనకి అండ‌గా నిలిచిన వారంద‌రి కోసం ‘మా’ ఎన్నిక‌ల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయాల‌నుకుంటున్నానని ఆమె ప్రకటించారు.

గురువారం.. ప్యానల్‌ ప్రకటన

అసోసియేషన్‌ ఎన్నికల్లో పోటీ చేయనున్న తన ప్యానల్‌లోని 27 మంది సభ్యుల పేర్లను నటుడు ప్రకాశ్‌రాజ్‌ గురువారం మద్యాహ్నం వెల్లడించారు. ‘సిని‘మా’ బిడ్డలం’ అని ప్యానల్‌కు పేరు పెట్టినట్లు తెలిపారు. నటుడు శ్రీకాంత్‌, జయసుధ, బండ్ల గణేష్‌, అనసూయ, ప్రగతి, నాగినీడు, సుధీర్‌, సనా, అనితా చౌదరి, బ్రహ్మాజీ.. తదితరులు తన ప్యానల్‌ సభ్యులని ఆయన అన్నారు.

శుక్రవారం.. లోకల్‌, నాన్‌లోకల్‌

ప్రకాశ్‌రాజ్‌ అధ్యక్ష పదవికి పోటీ చేయడంపై కొంతమంది హర్షం వ్యక్తం చేస్తుంటే మరికొంతమంది విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఆయన నాన్‌లోకల్‌ అంటూ విమర్శలు కూడా ఎక్కుపెట్టారు. ఈ నేపథ్యంలో తన ప్యానల్‌ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం ఆయన ఓ ప్రెస్‌ మీట్‌ పెట్టారు. ఇందులో భాగంగా లోకల్‌, నాన్‌లోకల్‌ వ్యవహారంపై స్పందించారు. కళాకారులు యూనివర్సల్‌ అని వ్యాఖ్యానించారు. అదే మీటింగ్‌లో పాల్గొన్న నాగబాబు.. ప్రకాశ్‌రాజ్‌కి తన మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.

శనివారం.. అధ్యక్షుడి కౌంటర్‌

ప్రకాశ్‌రాజ్‌ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. ‘‘మా’ మసకబారిపోయింది’ అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు తనని ఎంతో బాధించాయని పేర్కొంటూ ‘మా’ అధ్యక్షుడు, నటుడు నరేష్‌ అన్నారు. ప్రస్తుతం ఫోర్స్‌లో ఉన్న తన బృందంతో కలిసి ఆయన మీడియా ముందుకు వచ్చారు. అధ్యక్ష పదవిలోకి వచ్చినప్పటి నుంచి శక్తివంచన లేకుండా సేవ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఇప్పటివరకూ చేసిన సేవా కార్యక్రమాలు, సంక్షేమ పనులకు సంబంధించిన డేటాని ఆయన రిలీజ్‌ చేశారు.

ఆదివారం.. బహిరంగ లేఖ

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేయడంపై నటుడు మంచు విష్ణు లేఖ రాశారు. ఈ ఏడాది జరగనున్న ‘మా’ అధ్యక్ష పదవికి తాను నామినేషన్‌ వేస్తున్నానని ఆయన తెలిపారు.పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టనష్టాలు, సమస్యలు తనకి బాగా తెలుసని అన్నారు. పెద్దల అనుభవాలు, యువరక్తంతో నిండిన కొత్త ఆలోచనలు కలగలిపి నడవాలనే ప్రయత్నం, విజయవంతం అవుతుందని తాను ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇదిలా ఉండగా ఈ వారంలోనే పలు చిత్రాల షూట్స్‌ కూడా పూర్తి అయ్యాయి. నితిన్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ‘మ్యాస్ట్రో’, సంపూర్ణేశ్‌ బాబు నటిస్తున్న ‘క్యాలీఫ్లవర్‌’ చిత్రీకరణలు పూర్తైనట్లు ఇటీవల ఆయా చిత్రబృందాలు ప్రకటించాయి. ప్రస్తుతం ఇవి రెండూ నిర్మాణాంతర పనుల్లో బిజీగా ఉన్నాయి. మరోవైపు ‘వరుడు కావలెను’, ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రాలు తిరిగి సినిమా షూట్‌ ప్రారంభించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని