ATA Seminer: ‘ఆటా’ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో బిజినెస్‌ సెమినార్‌

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో తెలుగు వారిని ప్రోత్సహించేందుకు అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో బిజినెస్‌ సెమినార్‌ నిర్వహించారు.......

Published : 23 Dec 2021 19:46 IST

* తెలుగు వ్యాపారవేత్తలకు మెంటారింగ్, ఫండింగ్‌తో స‌హ‌కారంపై దృష్టి

* తెలంగాణ‌లోని టైర్-2 న‌గ‌రాల్లో వ్యాపార వాతావ‌ర‌ణాన్ని ప్రోత్సహించాలని నిర్ణయం

హైదరాబాద్‌: అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో తెలుగు వారిని ప్రోత్సహించేందుకు అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో బిజినెస్‌ సెమినార్‌ నిర్వహించారు. వ్యాపారాల‌కు సంబంధించిన ఆలోచ‌న‌ల్ని ప్రోత్సహించడం, యువ వ్యాపారవేత్తలకు మెంటారింగ్‌, వెంచ‌ర్ క్యాపిట‌లిస్టుల‌కు ఒక వేదిక క‌ల్పించ‌డం, స్టార్టప్‌ కంపెనీల‌కు ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అమెరికా, భార‌త్‌లకు చెందిన సుమారు 100 మంది మెంటార్లు, వెంచర్‌ క్యాపిట‌లిస్టులు, వ్యాపారవేత్తలు, సాంకేతిక రంగ నిపుణులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆటా వేడుక‌ల బిజినెస్ క‌మిటీ ఛైర్మన్‌ కాశీ కొత్త మాట్లాడుతూ.. ‘‘ఈ బిజినెస్ సెమినార్ ఎజెండా బ‌హుముఖం. అమెరికాలో స్థిర‌ప‌డిన తెలుగు వ్యాపారవేత్తలు, తెలంగాణ‌లోని వ్యాపార‌వేత్తల మధ్య అనుసంధానం, అనుబంధాన్ని పెంచడం, భారత్‌లో మరీ ముఖ్యంగా తెలంగాణలో స్టార్టప్‌ కంపెనీలకు మాంటారింగ్‌ చేసి వాటిలో పెట్టుబడులు పెట్టడం, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్, న‌ల్గొండ‌, క‌రీంన‌గ‌ర్, నిజామాబాద్ లాంటి టైర్-2 న‌గ‌రాల‌కు మ‌రిన్ని కంపెనీల‌ను ఆక‌ర్షించ‌డమే ప్రధాన లక్ష్యం’’ అని అన్నారు.

‘తెలుగు వాణిజ్యవేత్తలు అమెరికాతో పాటు ప్రపంచమంతా మంచి గుర్తింపు పొందుతున్నారు. భార‌త్‌-అమెరికా భాగ‌స్వామ్యాల‌ను ప్రోత్సహించి తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పెట్టుబ‌డులు పెట్టేందుకు వ్యాపారుల్ని ప్రోత్సహించేందుకు ఆటా బిజినెస్ సెమినార్ ఒక మంచి ప్రయత్నం. 2014 నుంచి హైద‌రాబాద్‌లో ప్రతి రెండేళ్లకొకసారి ఆటా ఇలాంటి సెమినార్లు నిర్వహిస్తోంది. వీటి ద్వారా ఇప్పటివరకు భార‌తీయ స్టార్టప్‌లలో దాదాపు 20 మిలియన్‌ డాలర్లు (రూ.150 కోట్లకు పైగా) పెట్టుబ‌డులు వ‌చ్చాయి. ఈ బిజినెస్ సెమినార్‌ల వల్ల పలు సంస్థలు టైర్-2 న‌గ‌రాల‌కు తరలివెళ్లాయి. ఖ‌మ్మం పట్టణంలో టి-హ‌బ్ ప్రారంభించ‌డం ఆటా బిజినెస్ కో-ఛైర్ లక్ష్‌ చేపూరి సాధించిన ఓ అతిపెద్ద విజ‌యం” అని అమెరికా తెలుగు సంఘం కాన్ఫరెన్స్‌ స‌ల‌హా క‌మిటీ ఛైర్మన్‌ జ‌యంత్ చ‌ల్లా అన్నారు.

మరోవైపు, మెంటారింగ్‌, పెట్టుబ‌డిదారులు, వెంచ‌ర్ క్యాపిట‌లిస్టులు, వాణిజ్యవేత్తల మధ్య పెట్టుబ‌డుల‌కు సంబంధించిన మంచి చర్చలు జరగడంతో పాటు ఈ బిజినెస్ సెమినార్ అనేది ద్వితీయ‌ శ్రేణి న‌గ‌రాల‌కు వెళ్లాలనే కంపెనీలకు, ప్రభుత్వ అధికారులకు మధ్య నిరంతర చర్చలకు కూడా ఓ వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమంలో  తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జ‌యేష్ రంజ‌న్‌, ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్, తెలంగాణ ఐటీ పెట్టుబ‌డుల విభాగం సీఈవో విజ‌య్ రంగినేని, తెలంగాణ అకాడ‌మీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సీఈవో శ్రీ‌కాంత్ సిన్హతో పాటు ఆటా అధ్యక్షుడు భువనేష్‌ బూజల, ఆటా ఉపాధ్యక్షుడు (ఎలక్ట్‌) మధు బొమ్మినేని, సదస్సు సలహా కమిటీ ఛైర్మన్‌ జయంత్‌ చల్లా, కిరణ్‌ పాశం (సదస్సు సమన్వయకర్త), కాశీ కొత్త (ఆటా వేడుకలు బిజినెస్‌ ఛైర్‌), లక్ష్‌ చేపూరి (ఆటా వేడుకలు బిజినెస్‌ కో ఛైర్‌) త‌దిత‌రులు పాల్గొన్నారు. అనంత‌రం, ద్వితీయ‌శ్రేణి న‌గ‌రాల‌కు త‌ర‌లాల‌ని భావించే కంపెనీల‌కు తెలంగాణ ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలను ప్రతిపాదించింది. 

ఆటా గురించి.. అమెరికా వ్యాప్తంగా ఉన్న దాదాపు 5 లక్షల మందికి పైగా తెలుగువారికి ప్రాతినిధ్యం వ‌హించేందుకు 1990లో ఏర్పాటైన ప్రధాన జాతీయ సంస్థ అమెరికా తెలుగు సంఘం (ఆటా). ఇందులోని ప్రతినిధుల్లో అధికంగా తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాకు వ‌చ్చిన తొలిత‌రం వారే. స‌మాజ సేవ‌, వాణిజ్యం, సంస్కృతి, సామాజిక కార్యకలాపాలు, విద్యార్థుల‌కు సాయం, తెలుగు భాష, సంస్కృతుల‌ పరిరక్షణ, ప్రోత్సాహం త‌దిత‌ర సేవల్ని అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ నిర్వహిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని