న్యూజెర్సీలో సందడిగా జొన్నవిత్తుల సాహితీ సమావేశం

న్యూజెర్సీ రాష్ట్రంలోని సోమర్‌సెట్‌లో న్యూజెర్సీ తెలుగు కళా సమితి, ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) సంయుక్తంగా జూన్ 3న  ప్రత్యేక సాహితీ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు.

Published : 16 Jun 2022 01:37 IST

అమెరికా: మనుషులే కాదు, ఒక మంచి పుస్తకం, లేదా ఒక పద్యం, ఒక పాట ఎదురుకావడం కూడా మానవ జీవితంలో ఒక పెద్ద సంఘటనే అని ప్రముఖ సినీ గేయరచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరావు అన్నారు. న్యూజెర్సీ రాష్ట్రంలోని సోమర్‌సెట్‌లో న్యూజెర్సీ తెలుగు కళా సమితి, ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) సంయుక్తంగా జూన్ 3న  ప్రత్యేక సాహితీ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాషా, సాహిత్య రంగాలలో విశిష్ట కృషి చేసిన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసమావేశంలో పలువురు సాహితీ ప్రియులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేశారు.

ఈ కార్యక్రమంలో ముందుగా కల్చరల్  కార్యదర్శి బిందు యలమంచిలి ఈ సదస్సుకు వచ్చిన వారిని సాదరంగా ఆహ్వానించారు. అనంతరం చిరంజీవి శ్రీహన్ గరిమెళ్ల వినాయక  శ్లోకాన్ని ఆలపించారు. కమ్యూనిటీ కార్యదర్శి శ్రీదేవి పులిపాక ఈ సందర్భంగా జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుకు స్వాగతం పలికి వారిని ప్రసంగించాల్సిందిగా కోరారు. శతక సాహిత్యంలో ప్రత్యేక ముద్రవేసిన జోన్నవిత్తుల మాట్లాడుతూ.. చిన్నతనం నుంచి తనకు సాహిత్యం పట్ల మక్కువ ఎక్కువగా ఉండేదని తెలిపారు. అందువల్ల పద్యాలు, పాటలు రాస్తూ వుండేవాడినని పేర్కొన్నారు. ఇప్పటికి 24వ శతకాలు రాసినట్లు తెలిపి వాటి  గురించి వివరించారు.  ఇంతమంది తెలుగు భాషాభిమానులు ఈ సాహితీ సమావేశం ఏర్పాటు చేయటం ఒక గొప్ప అనుభూతి అని పేర్కొన్నారు. తాను  రచించిన శతకాలలోని అనేక పద్యాలను జొన్నవిత్తుల శ్రావ్యంగా పాడి వినిపించారు. దీంతో సభా ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగింది.

అనంతరం తెలుగు కళా సమితి అధ్యక్షులు మధు రాచకుళ్ల మాట్లాడుతూ కొత్తగా బాధ్యతలను చేపట్టిన తమ కార్యవర్గం తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణ కోసం చేపట్టబోయే కార్యక్రమాల గురించి వివరించారు. తరువాత కార్యదర్శి రవి కృష్ణ అన్నదానం తెలుగు కళా సమితి నూతన కార్యవర్గాన్ని సభికులకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాట్స్ ప్రతినిధులు, న్యూజెర్సీ తెలుగు కళా సమితి కార్యవర్గ బృందం జొన్నవిత్తులను శాలువా, జ్ణాపికలతో సత్కరించారు. సమావేశంలో నాట్స్ ప్రతినిధులు, శ్యాం నాళం, శ్రీహరి మందాటి, రవి కృష్ణ, వంశీకృష్ణ వెనిగళ్ల, చంద్ర శేఖర్ కొణిదెల, శేషగిరి కంభంపాటి, రమేష్ బేతంపూడి తదితరులు పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. న్యూజెర్సీలో కళాంజలి నృత్య శిక్షణశాల స్థాపించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జొన్నవిత్తుల, ఉపాధ్యక్షురాలు అనూరాధ దాసరి, కోశాధికారి శ్రీనివాస్ చెరువు, మెంబర్ షిప్ కార్యదర్శి జ్యోతి కామరసు, తెలుగు కళా సమితి యువజన కార్యదర్శి సుధా దేవులపల్లిని ఘనంగా సత్కరించారు.      

        

కార్యక్రమాన్ని విజయవంతానికి కృషి చేసిన వాలంటీర్లు రవి శంకర్ అప్పన, శ్రీని తోడుపునూరి, మోహన్ ములే,  సత్య నేమాన తదితరులతో పాటు ఇందిరా రెడ్డి, శ్రీరామ్ కొల్లూరి, రవి కృష్ణ,  శ్రీదేవి జాగర్లమూడి, జనని కృష్ణ, ఆనంద్ పాలూరి,సుధాకర్ ఉప్పల, శరత్ వేట, ధనలక్ష్మి రాచకుళ్ళ తదితరులకు తెలుగు కళా సమితి కార్యవర్గం  ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది.  

   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని