జన్మభూమి సేవకు పునరంకితమవుతాం.. తెదేపా ఆవిర్భావ వేడుకల్లో ప్రవాసులు

తెలుగుదేశం 40వ ఆవిర్భావ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఘనంగా జరిగాయి. పలు ప్రాంతాల్లో తెదేపా కార్యకర్తలు, అభిమానులు జెండాలు చేతపట్టి ‘కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా’ అనే పాటలతో సందడి చేశారు. జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేశారు....

Updated : 29 Mar 2022 22:25 IST

వైకాపా అరాచకాలను ఎండగడతాం.. తెదేపాను అధికారంలోకి తెస్తాం

ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లోని 200 నగరాల్లో ఘనంగా తెదేపా 40 వసంతాల వేడుకలు

జెండాలు చేతపట్టి జై తెలుగుదేశం అంటూ నినదించిన కార్యకర్తలు

పసుపు జెండాలతో వివిధ దేశాల్లో వాహనాల ర్యాలీలు

అమరావతి: తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఘనంగా జరిగాయి. పలు ప్రాంతాల్లో తెదేపా కార్యకర్తలు, అభిమానులు జెండాలు చేతపట్టి ‘కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా’ అనే పాటలతో సందడి చేశారు. ‘జై తెలుగుదేశం.....జై జై తెలుగుదేశం’ అంటూ నినాదాలు చేశారు. అధిక సంఖ్యలో అభిమానులు కార్లతో ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో అధిక సంఖ్యలో పార్టీ అభిమానులు కుటుంబాలతో సహా హాజరయ్యారు. అధిక సంఖ్యలో మహిళలు, చిన్నారులూ వేడుకల్లో పాల్గొన్నారు.

తెదేపాను అధికారంలోకి తెస్తాం..

రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చేందుకు సమష్టిగా పనిచేస్తామని వివిధ దేశాల్లోని తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వ దుర్మార్గపు పాలనలో ప్రజాజీవితం దుర్భరంగా మారిందని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతోందని.. వీటన్నింటినీ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవాల్సిన అవసరం ఉందని, అప్పటి వరకు విశ్రమించబోమని ప్రతిజ్ఞ చేశారు.

న్యూజెర్సీ సహా 40 నగరాల్లో తెదేపా ఆవిర్బావ వేడుకలు..

40 వసంతాల వేడుకలను అమెరికాలోని అట్లాంటా, ఆస్టిన్, బే ఏరియా, బోస్టన్, చికాగో, డల్లాస్, డెట్రాయిట్, హూస్టన్‌. న్యూజెర్సీ తదితర 40 నగరాల్లో వైభవంగా నిర్వహించారు. తెదేపా సీనియర్‌ నాయకులు కోమటి జయరాం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అధిక సంఖ్యలో పార్టీ అభిమానులు హాజరయ్యారు. చికాగోలో బీద రవిచంద్ర, డల్లాస్‌లో కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ముళ్లపూడి బాపిరాజు, న్యూజెర్సీలో మన్నవ మోహన్‌కృష్ణ, కలపటపు రామ్‌ప్రసాద్, షార్లెట్‌లో ఆరిమిల్లి రాధాకృష్ణ తదితరులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

డెట్రాయిట్‌లో...

ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం మాత్రమే నాలుగు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల అభివృద్ధిని ఆకాంక్షిస్తోందని అమెరికాలోని డెట్రాయిట్‌ తెదేపా కౌన్సిల్‌ సభ్యులు కొనియాడారు. ఎన్నారై తెలుగుదేశం అమెరికా విభాగం ఆధ్వర్యంలో డెట్రాయిట్‌లోని విందు రెస్టారెంట్‌లో సురేశ్‌ పుట్టగుంట, కిరణ్‌ దుగ్గిరాల, దంతేశ్వరరావు, మనోరమ గొంది, సీత కావూరి, ఉమామహేశ్వరరావు ఒమ్మి, జోగేశ్వరరావు పెద్దబోయిన తదితరుల ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోని తెదేపా నేతలు జూమ్‌ ద్వారా వారితో మాట్లాడారు. ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గద్దె రామ్మోహన్రావు, మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్, తెదేపా అధికార ప్రతినిధి గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్‌ తదితరులు ప్రసంగించారు.

యూకే, యూరప్‌లో...

యూకే, యూరోప్‌లోని 40 పైగా నగరాల్లో ఎన్నారై కౌన్సిల్‌ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎన్నారై తెదేపా నాయకుడు వేణు మాధవ్‌ పోపూరి, యూరోప్‌ తెదేపా కౌన్సిలర్లు ప్రసన్న నాదెండ్ల, నరేశ్‌ మల్లినేని, చక్రి మొవ్వా, శ్రీకాంత్‌ యర్రం, మహేంద్ర తాళ్లూరి, నారాయణరెడ్డి, విక్రమ్‌ పరిటాల, శివరాం కూరపాటి, సురేశ్‌ కోరం, జయ్‌కుమార్‌ గుంటుపల్లి, భాస్కర్‌ అమ్మినేని, వెంకట్‌ కంతేటి, ప్రభాకర్‌ అమిర్నేని, గిరి దొమ్మేటి, శ్రీనివాస్‌ లగడపాటి, సుందర్‌రాజు మల్లవరపు, శ్రీకిరణ్‌ పరుచూరి, శ్రీనివాస్‌ పాలడుగు, భానూజి కుక్కాల, చందు నారా, శ్రీధర్‌ నారా, చందు జాస్తి, యశ్వంత్, రవితేజ లింగ, హర్ష చప్పిడి, మహేశ్వర్‌ కందుల, రూప్‌ తేజ, లీలా సాయి ఈదర, రవితేజ నల్లమోతు, నరేంద్ర ములకలపల్లి, సాయి కుర్రా, అభినయ్‌ కాపా, రవి కిరణ్‌ అర్వపల్లి, వేణు పంగులూరి, వంశీ నాగళ్ల తదితరులు పాల్గొన్నారు. హాట్‌ఫీల్డ్‌లో జరిగిన కార్యక్రమంలో తెదేపా ఆవిర్భావం నుంచి వివిధ వర్గాల సంక్షేమానికి చేసిన కృషిని శివరామ్‌ కూరపాటి వివరించారు.

ఐర్లాండ్‌లో....

ఐర్లాండ్‌లో మురళి రాపర్ల, జర్మనీలో తిట్టు మద్దిపట్ల, శివ, పారిస్‌లో మహేశ్‌ గొపునూరు, జెనాలో వపన్‌ జాగర్లమూడి, అనుదీప్‌ పచ్చాల, బెల్పాస్ట్‌లో దినేశ్‌ కుదరవల్లి, బ్రసెల్స్‌లో దినేశ్‌వర్మ, పోలాండ్‌లో చందు తదితరులు ఆధ్వర్యంలో  తెదేపా ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జై తెలుగుదేశం, జై చంద్రబాబు అనే నినాదాలు చేశారు. 40 వసంతాల కేక్‌ కట్‌ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలిపారు.








Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని