Elections: ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌కు కష్టమే.. రాష్ట్రాభివృద్ధికి ఒక్క పనీ చేయలేదు: ప్రశాంత్‌ కిశోర్‌

ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి తిరిగి అధికారంలోకి రావడం చాలా కష్టమని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ (Prashant Kishor) పేర్కొన్నారు.

Published : 07 Apr 2024 16:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయాలపై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ (Prashant Kishor) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి తిరిగి అధికారంలోకి రావడం చాలా కష్టమని అన్నారు. 2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ఆయన.. ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎంతో జగన్‌ను పోల్చారు.

‘‘ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్‌ లాగే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి బదులు నియోజకవర్గాలకు ‘ప్రొవైడర్‌’ మోడ్‌లోనే జగన్‌ ఉండిపోయారు. ఒకప్పటి చక్రవర్తుల మాదిరిగా తాయిలాలతోనే సరిపెట్టడం తప్పితే ఇంకా ఏం లేదు. ప్రజలకు నగదు బదిలీ చేశారు. కానీ, ఉద్యోగాలు కల్పించడం, రాష్ట్రాభివృద్ధిని మరింత ఊతమిచ్చేందుకు ఏమీ చేయలేదు‘’ అని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్‌ కిశోర్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన ఓ సదస్సులోనూ జగన్‌ ఓటమి ఖాయమని పీకే చెప్పిన విషయం తెలిసిందే.

ఇక జాతీయ స్థాయిలో భాజపా విజయావకాశాలపై ప్రశాంత్‌ కిశోర్‌ మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, బిహార్‌ కలిపి మొత్తంగా 204 లోక్‌సభ స్థానాలుంటే 2014 లేదా 2019లో భాజపా ఇక్కడ 50 సీట్లకు మించి సాధించలేదని గుర్తుచేశారు. 2014లో 29 చోట్ల, 2019లో 47 స్థానాల్లో కాషాయ పార్టీ గెలుపొందిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు మే 13న జరగనున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని