Congress: కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికపై అతిగా మాట్లాడొద్దు..!

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి సీనియర్‌ నేత శశిథరూర్‌ పోటీ చేయనుండటంపై కొందరు హస్తం పార్టీ నేతలు బహిరంగంగానే విముఖత వ్యక్తం చేస్తున్నారు

Published : 23 Sep 2022 14:47 IST

అధికార ప్రతినిధులకు సూచించిన అధిష్ఠానం

దిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి సీనియర్‌ నేత శశిథరూర్‌ పోటీ చేయనుండటంపై కొందరు హస్తం పార్టీ నేతలు బహిరంగంగానే విముఖత వ్యక్తం చేస్తున్నారు. సీనియర్‌ నేత గౌరవ్‌ వల్లభ్‌ ఆయనపై విమర్శలు గుప్పించారు. దీంతో ఇది కాస్తా అంతర్గత విభేదాలకు దారితీస్తుండటంతో అధిష్ఠానం రంగంలోకి దిగింది. అధ్యక్ష ఎన్నికలు, పోటీ చేస్తున్న అభ్యర్థులపై పార్టీ అధికార ప్రతినిధులెవరూ అతిగా మాట్లాడొద్దని గట్టిగానే సూచించింది.

అధిష్ఠానం సూచనల మేరకు ఈ వ్యవహారంపై ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ కమ్యూనికేషన్స్‌ ఇన్‌ఛార్జ్‌ జైరాం రమేశ్.. పార్టీ అధికార ప్రతినిధులు, ఆఫీస్‌ బేరర్లకు సందేశం పంపినట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. అధ్యక్ష పదవికి పోటీ చేస్తోన్న అభ్యర్థులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని ఆ సందేశంలో స్పష్టంగా పేర్కొన్నారు. ‘‘మనందరికీ వ్యక్తిగత అభిప్రాయాలు, ప్రాధాన్యాలు ఉంటాయి. కానీ, పార్టీ పరంగా మన బాధ్యత ఒక్కటే. అధ్యక్ష ఎన్నికల్లో ప్రజాస్వామ్య, పారదర్శక వ్యవస్థను కలిగి ఉన్న ఏకైక రాజకీయ పార్టీ మనది. దాన్ని మనమంతా చాటిచెప్పాలి. అధ్యక్ష పదవికి పోటీ చేసే ఏ అభ్యర్థికైనా నామినేషన్‌ వేసేందుకు 10 మంది పీసీసీ ప్రతినిధుల మద్దతు ఉంటే సరిపోతుంది. ఇంకెవరి అనుమతులు అవసరం లేదు. ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారిక ప్రతినిధులదే’’ అని జైరాం రమేశ్ పార్టీ సభ్యులను సూచించారు.

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని శశిథరూర్‌ చెప్పిన తర్వాత అనేక మంది కాంగ్రెస్‌ నేతలు ఆయనపై విమర్శలు వ్యక్తం చేశారు. గౌరవ్‌ వల్లభ్‌ కూడా దీనిపై స్పందించారు. జీ23 నేతల లేఖను ప్రస్తావిస్తూ థరూర్‌ను విమర్శించారు. అదే సమయంలో ఈ అధ్యక్ష ఎన్నిక బరిలో ఉన్న మరో సీనియర్‌ నేత అశోక్‌ గహ్లోత్‌కు మద్దతు ప్రకటించారు. ‘‘గత ఎనిమిదేళ్లలో శశిథరూర్‌ పార్టీ కోసం చేసిన ఏకైక సహకారం.. సోనియాజీ ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆమెకు లేఖ పంపడమే. ఇది నాలాంటి ఎంతోమంది పార్టీ కార్యకర్తలకు ఆవేదన కలిగించింది. కానీ, గహ్లోత్‌ మాత్రం మూడు సార్లు ముఖ్యమంత్రిగా, ఐదు సార్లు ఎంపీగా పార్టీకి ఎంతో సేవ చేశారు. మోదీ-షాను నేరుగా ఎదుర్కొ్న్నారు. అందువల్ల అధ్యక్ష ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలనే దానిపై అందరికీ స్పష్టత ఉంది’’ అని వల్లభ్‌ విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి 24వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలుకానుంది. ఒకరు కంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే అక్టోబరు 17న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ పదవికి పలువురు సీనియర్‌ నేతల పేర్లు వినిపిస్తున్నప్పటికీ.. ప్రధానంగా శశిథరూర్, గహ్లోత్‌ మధ్యే పోటీ ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే, గహ్లోత్‌కు పార్టీలో అత్యధికుల మద్దతు లభిస్తోంది. దీంతో ఆయనే తదుపరి అధ్యక్షుడి అయ్యే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని