Karnataka Results: ఆధిక్యంలో కాంగ్రెస్‌.. తమిళనాడు సీఎంతో హస్తం పార్టీ చర్చలు..?

Karnataka Results: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఈ సమయంలో తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

Updated : 13 May 2023 12:48 IST

బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly elections) ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. కాంగ్రెస్ (Congress) స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. విజయానికి చేరువగా వెళ్తోంది. ఈ సమయంలో కాంగ్రెస్ అధిష్ఠానం ‘ఆపరేషన్‌ కమలం’ ప్రభావం తమపై పడకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటోంది. తమ ఎమ్మెల్యేలను రక్షించుకోవడానికి ఏర్పాట్లు చేస్తోంది. గెలుపొందిన ఎమ్మెల్యేలను తమిళనాడు తరలించేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అలాగే ఈ రోజు సాయంత్రానికల్లా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన నేతలందరినీ బెంగళూరు చేర్చేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు సమాచారం.(Karnataka Results)

ఫలితాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న తరుణంలో ట్విటర్‌లో తమ అగ్రనేత రాహుల్ జోడో యాత్ర (Rahul Gandhi's Bharat Jodo Yatra) వీడియోను కాంగ్రెస్‌ పోస్టు చేసింది. ‘నేను అజేయంగా ఉన్నాను. నేను నమ్మకంగా ఉన్నాను. నన్నెవ్వరూ ఆపలేరు’ అని అర్థం వచ్చేలా వ్యాఖ్యలను జోడిచింది. ప్రస్తుత ఆధిక్యానికి జోడో యాత్రే కారణమని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. అది ప్రజలను ఉత్తేజపరిచిందని.. అధికార భాజపాపై ప్రభావం చూపిందని చెప్పారు. ఫలితాల సరళిని గమనిస్తోన్న భాజపా.. అధికారంపై ఆశ వదులుకోలేదని తెలుస్తోంది. ఒకవేళ.. హంగ్ ఏర్పడితే అధికారంలోకి వచ్చే ఏ అవకాశాన్నీ వదులుకోకూడదనే లక్ష్యంతో కమలం పార్టీ వ్యూహాలు పన్నుతున్నట్లు.. ఇప్పటికే జేడీ(ఎస్‌)తో సంప్రదింపులు మొదలు పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని