Lok Sabha election: ఎన్నికల బరిలో మాజీ భార్యాభర్తలు

Lok Sabha election: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బెంగాల్‌లో ఓ నియోజకవర్గం నుంచి మాజీ భార్యాభర్తలు పోటీ పడనున్నారు. 

Updated : 11 Mar 2024 11:01 IST

కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha election) రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమైన తృణమూల్ కాంగ్రెస్(TMC).. 42 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ క్రమంలో కొన్నిస్థానాల్లో అభ్యర్థుల ఎంపిక చర్చనీయాంశంగా మారింది. బిష్ణుపుర్ నియోజకవర్గం నుంచి మాజీ భార్యాభర్తలు పోటీ పడుతుండటం గమనార్హం.

కొద్దిరోజుల క్రితం బంకురా జిల్లాలో బిష్ణుపుర్ స్థానం నుంచి భాజపా.. సౌమిత్రా ఖాన్‌ను బరిలో దింపింది. తాజాగా అక్కడి నుంచి సుజాతా మండల్‌ను టీఎంసీ పోటీ ఉంచింది. 2021లో వారిద్దరు విడిపోయారు. ఆ ప్రాంతంలో ఖాన్‌ కీలక నేతగా ఉన్నారు. 2019లో లోక్‌సభ ఎన్నికల ముందు టీఎంసీని వీడి, భాజపాలో చేరారు. అప్పుడు సుజాత తన భర్త తరఫున ప్రచారం చేశారు. అయితే, 2021లో ఆమె మమతా బెనర్జీ పార్టీలో చేరారు. దాంతో అసహనానికి గురైన ఆయన.. కెమెరా ముందే ఆమెతో విడిపోతున్నట్టు ప్రకటించారు. తాజాగా వీరిద్దరు పోటీ పడనున్నారు.

ఆదివారం కోల్‌కతాలోని బ్రిగేడ్‌ పరేడ్‌ మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో మమత అభ్యర్థులను ప్రకటించి, వారిని ప్రజలకు పరిచయం చేశారు. టీఎంసీ జాబితాలో మాజీ క్రికెటర్‌ యూసుఫ్‌ పఠాన్‌తో పాటు, బాలీవుడ్‌ దిగ్గజ నటుడు శత్రుఘ్నసిన్హా, సభలో ప్రశ్నలు అడగడానికి ముడుపులు అందుకున్నారన్న ఆరోపణలతో పార్లమెంటు సభ్యత్వం కోల్పోయిన మహువా మొయిత్రా, సినీనటి రచనా బెనర్జీలు ఉన్నారు. 

ఐదు సార్లు ఎంపీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌధరీ నియోజకవర్గమైన బరహామ్‌పుర్‌ నుంచి యూసుఫ్‌ పఠాన్‌ పోటీ చేయనున్నారు. ఆయన ఎంపికపై అధీర్‌ స్పందించారు. టీఎంసీ బయటివ్యక్తుల్ని గౌరవించాలనుకుంటే.. యూసుఫ్‌ను రాజ్యసభకు పంపించాల్సిందని వ్యాఖ్యానించారు. విపక్ష ‘ఇండియా’ కూటమిలోనే కొనసాగితే తృణమూల్‌ పార్టీ మోదీ ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుందని దీదీ భయపడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని