Nara Lokesh: వెలిగొండ పూర్తి చేస్తానని ఆరుసార్లు తేదీలు మార్చారు!

‘ ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలు 2019 ఎన్నికల్లో తెదేపా గౌరవాన్ని నిలబెట్టారు. నాలుగు సీట్లు గెలిపించారు. వైకాపా ఎనిమిది సీట్లతో పాటు తెదేపాలో గెలిచిన ఒక ఎమ్మెల్యేని తీసుకుంది.

Updated : 17 Jul 2023 06:11 IST

నాలుగేళ్లలో వైకాపా చేసిన అభివృద్ధి శూన్యం
తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌

ఈనాడు, నెల్లూరు: ‘ ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలు 2019 ఎన్నికల్లో తెదేపా గౌరవాన్ని నిలబెట్టారు. నాలుగు సీట్లు గెలిపించారు. వైకాపా ఎనిమిది సీట్లతో పాటు తెదేపాలో గెలిచిన ఒక ఎమ్మెల్యేని తీసుకుంది. అంటే జిల్లాను వైకాపా ఎంత అభివృద్ధి చేయాలి? నంబర్‌ 1గా ప్రకాశం ఉండాలి. నాలుగేళ్లలో జిల్లాలో చే¸సిన అభివృద్ధి శూన్యం. వెలిగొండ ప్రాజెక్ట్‌ పనులు ఏడాదిలో పూర్తి చేస్తానని పాదయాత్రలో జగన్‌ హామీ ఇచ్చి ఆరుసార్లు తేదీలు మార్చారు. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే పనులు పూర్తయ్యాయా? నేషనల్‌ ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌ ఏర్పాటుకు తెదేపా హయాంలో భూసేకరణ చేస్తే ఆ ప్రాజెక్ట్‌ను జగన్‌ పట్టించుకోలేదు. రాయల్టీ, కరెంట్‌ ఛార్జీలు, పన్నులు పెంచి గ్రానైట్‌ పరిశ్రమను దెబ్బతీశారు. దొనకొండ వద్ద ఇండస్ట్రియల్‌ హబ్‌ ఏర్పాటు చేయాలని తెదేపా ప్రణాళిక సిద్ధం చేస్తే దానిని వైకాపా అటకెక్కించింది. గుండ్లకమ్మ ప్రాజెక్టును నాశనం చేశారు. గేటు కొట్టుకుపోయింది. ప్రాజెక్టులోని నీరు మొత్తం ఖాళీ చేశారు. జగన్‌ అసమర్థత కారణంగా ఆ ప్రాజెక్టు పరిస్థితి ప్రమాదంలో పడింది’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. ఆదివారం సాయంత్రం కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలెంలో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ‘సోమవారాన్ని  పోలవరంగా మార్చుకుని చంద్రబాబు 72 శాతం పనులు పూర్తి చేశారు. అయితే కమీషన్ల కోసం రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లి జగన్‌ ప్రాజెక్టుని ప్రమాదంలో పడేశారు. డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతినడానికి, గైడ్‌బండ్‌ కుంగిపోవడానికి జగన్‌ కక్కుర్తే కారణం. యువత ఎప్పుడూ పేదరికంలో ఉండాలని జగన్‌ కోరుకుంటున్నారు’ అని లోకేశ్‌ విమర్శించారు.

డేటా దొంగ అవతారం ఎత్తారు

‘జగనన్న సురక్ష పేరుతో జగన్‌ డేటాదొంగ అవతారమెత్తారు. క్యాబినెట్‌ సమావేశం జరిగిన రోజు సచివాలయానికి వచ్చిన పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ‘సురక్ష కార్యక్రమంలో వాలంటీర్లు వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నారు, ఫింగర్‌ ప్రింట్‌లతో పాటు, ఏ పార్టీకి చెందిన వారు? సాక్షికి అనుకూలమా కాదా అనే వివరాలు కూడా సేకరిస్తున్నారంటూ వస్తున్న వార్తలను నానీ వద్ద మీడియా ప్రస్తావించగా.. అలా జరిగే ప్రసక్తే లేదని లైవ్‌లో నిరూపిస్తా అంటూ వాలంటీర్‌కు ఆయన ఫోన్‌ చేశారు. ‘వేలిముద్రలు తీసుకుంటున్నాం, సాక్షికి, వైకాపాకు అనుకూలమా కాదా అని కూడా వివరాలు సేకరిస్తున్నామని ఆ వాలంటీరు సమాధానమిచ్చారు. అప్పుడది మీడియాలో లైవ్‌ ప్రసారం అవుతుండటంతో ఆయనకు ఫోన్‌ కూడా కట్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ప్రజలు తమ వ్యక్తిగత సమాచారం ఇస్తే వైకాపా నాయకులు వారి ఆస్తి కూడా కొట్టేయడం ఖాయం’ అని లోకేశ్‌ అన్నారు. కార్యక్రమంలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, కందుకూరు తెదేపా ఇంఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు, దివి శివారం, ఇంటూరి రాజేశ్‌, చల్లా శ్రీనివాసులు, కోటపాటి జనార్దన్‌, యువగళం కోఆర్డినేటర్‌ కిలారి రాజేశ్‌, మీడియా కోఆర్డినేటర్‌ బి.వి.వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు.

ప్రకాశం జిల్లాలోకి పాదయాత్ర..

యువగళం పాదయాత్ర 156వ రోజు నెల్లూరు జిల్లాలో పూర్తి చేసుకుని ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం సరిహద్దుకు చేరుకుంది. సోమవారం నుంచి ప్రకాశం జిల్లాలో యాత్ర సాగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని