PawanKalyan: మూడు పార్టీలు కలుస్తాయనే ఆశిస్తున్నా..

ఏపీలో వైకాపా ప్రభుత్వాన్ని కూలదోయడానికి తెదేపా, జనసేన, భాజపాలు కలుస్తాయని తాను ఆశిస్తున్నట్లు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు.

Updated : 19 Jul 2023 08:35 IST

రాష్ట్రంలో కూటమి ఏర్పాటుపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌  

ఈనాడు, దిల్లీ: ఏపీలో వైకాపా ప్రభుత్వాన్ని కూలదోయడానికి తెదేపా, జనసేన, భాజపాలు కలుస్తాయని తాను ఆశిస్తున్నట్లు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. ఎన్డీయే సమావేశంలో పాల్గొనడానికి దిల్లీకొచ్చిన ఆయన మంగళవారం ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్డీయే, భాజపాతో 2014 నుంచి కలిసి పనిచేస్తున్నాం. ఎన్డీయే సమావేశంలో పాల్గొనడం ఇదే తొలిసారి కాదు. 2014లో ప్రధాని ప్రమాణ స్వీకారం సందర్భంగా పార్లమెంటు సెంట్రల్‌హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో నేనూ పాల్గొన్నా. దేశాన్ని ప్రగతి పథంలో నడిపించాలంటే కనీసం దశాబ్దం పడుతుంది. ఇప్పటివరకు జరిగిన ప్రగతిని ముందుకు తీసుకెళ్లడానికి, మోదీ కన్నకలలు పూర్తి చేయడానికి, దేశ ప్రజల ఆకాంక్షలను సంపూర్ణంగా నెరవేర్చడానికి ఎన్డీయేకు మరోసారి అవకాశమివ్వాలి. మోదీ నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లో గెలవడమే కూటమి లక్ష్యం. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ఏడాదిలోపు వస్తాయా? అంతకుముందే ఉంటాయా? అన్నది మనకు తెలియదు. అది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

ఏపీ ప్రభుత్వ పనితీరుపట్ల ప్రజల్లో చాలా అసంతృప్తి ఉంది. జాతీయ ఛానళ్లు, పత్రికల్లో చూస్తున్నది వేరు, క్షేత్రస్థాయి పరిస్థితి వేరు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు వైకాపాకు వణుకు పుట్టిస్తున్నాయి. అంతులేని అవినీతి జరుగుతోంది. ముఖ్యంగా డేటా చౌర్యం జరుగుతోంది. పెగాసెస్‌పై పార్లమెంటు అట్టుడికింది. ప్రజల ఆధార్‌కార్డు వివరాలు సేకరించడానికి ప్రయత్నిస్తే అన్ని పార్టీలూ అభ్యంతరం తెలిపిన సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల వివరాలను నెలకు రూ.5వేలకు, రోజుకు రూ.166 వేతనానికి నియమించుకున్న ప్రైవేటు వ్యక్తులు సేకరిస్తున్నారు. ఐరిస్‌, ఫింగర్‌ప్రింట్స్‌, ఆధార్‌, బ్యాంకు ఖాతాల్లాంటి 23 వివరాలు సేకరిస్తున్నారు. ఈ సున్నితమైన సమాచారాన్ని తెలంగాణలోని డేటాసెంటర్లలో పెడుతున్నారు. ఇదంతా ప్రజల్లో తీవ్ర అభద్రతను సృష్టిస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా లేవు. ఉద్యోగాలు లేవు. మౌలిక వసతుల పరిస్థితి దారుణంగా ఉంది.

రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. ఉద్యోగులకు సరిగా జీతాలందని పరిస్థితి నెలకొంది. బిల్లులు చెల్లించకపోవడం వల్ల పనులు చేయడానికి కాంట్రాక్టర్లు తిరస్కరిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం 10%వడ్డీకి రుణాలు తీసుకొని తమకు కావాల్సిన వారికి డబ్బును బదిలీ చేస్తోంది. ఇలాంటి వారిని ఎవరో ఒకరు ప్రశ్నించాలని ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే జనసేనకు ప్రజల మద్దతు లభిస్తోంది. రాష్ట్రంలో అధికారపక్షాన్ని ఓడించడానికి ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసికట్టుగా పోరాడాలన్నది నా అభిప్రాయం. 2014లో మేం ఇలాగే చేశాం. 2019లో ఎన్డీయే కొంత భిన్నంగా ఉంది. ఆ తర్వాత మేం ముందుకొచ్చి ఎన్డీయేకి మద్దతిచ్చాం. అప్పటినుంచి భాజపా, జనసేన కలిసి పనిచేస్తున్నాయి. తెదేపాతో పాటు మూడు పార్టీలూ కలుస్తాయని ఆశిస్తున్నా. ప్రజలకు స్థిరమైన ప్రభుత్వాన్ని అందించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే ముఖ్యం. అందువల్ల ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలన్నది మాకు ముఖ్యంకాదు. అందరూ కలిసి వైకాపా ప్రభుత్వాన్ని ఓడించి రాష్ట్ర ప్రజలకు సుస్థిర ప్రభుత్వం అందించడం గురించే నేను ఆలోచిస్తున్నా’ అని పవన్‌ పేర్కొన్నారు.

పొత్తులపై చర్చించలేదు..

ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం అనంతరం పవన్‌ విలేకర్లతో మాట్లాడారు. ‘ఈ సమావేశంలో పొత్తుల గురించి ప్రత్యేకంగా చర్చించలేదు. ప్రధానమంత్రి మోదీ మొత్తం దేశం గురించే మాట్లాడారు. చర్చకూడా అదే అంశంపై జరిగింది. ఇప్పటివరకు ఏం చేశాం? ఇక ముందేం చేయాలన్న దానిపైనే ప్రధాని ప్రసంగించారు. మూడోసారి కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఏం చేయాలన్న దానిపై చర్చించారు. దేశంలో జరుగుతున్న మౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధి, ఆత్మనిర్భర్‌ భారత్‌లాంటి కార్యక్రమాలపై ప్రతి ఒక్కరూ లోతుగా అభిప్రాయాలు చెప్పారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏం చేయాలన్న అంశంపై ప్రఖ్యాత న్యాయకోవిదుడు నానీపాల్కీవాలా చెప్పిన అంశాలను ప్రస్తావించాను. ఇదివరకు పార్లమెంటుపై, ముంబయి తాజ్‌హోటల్‌పై ఉగ్రవాద దాడి జరిగినప్పుడు నేను దేశానికి బలమైన నాయకత్వం ఉండాలనుకున్నాను. అలాంటి సమయంలోనే నరేంద్రమోదీ నాయకత్వం వచ్చింది. ఆయన నాయకత్వంలో దేశం మరింత బలోపేతం కావాలని, అందుకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని జనసేన తరఫున చెప్పాం’ అన్నారు. దేశ పరిస్థితులపై తప్ప రాష్ట్ర పరిధిలోని అంశాలు చర్చించలేదన్నారు. ఏపీ నుంచి ఎన్డీయేలోకి కొత్త పార్టీలను చేర్చుకొనే అంశం లాంటివి ప్రస్తావనకు రాలేదని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని