జాతీయ స్థాయిలో మహాకూటమి..? సోనియాతో భేటీ కానున్న లాలూ, నీతీశ్‌..!

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యేందుకు బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌, ఆర్‌జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌లు సిద్ధమయ్యారు.

Updated : 23 Sep 2022 17:13 IST

దిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం సిద్ధమవుతోన్న ప్రధాన రాజకీయ పార్టీలు.. కేంద్రంలో భాజపాను ఎదుర్కొనే వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో ఏకతాటిపైకి వచ్చేందుకు సంప్రదింపులు జరుపుతోన్న ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌ను దూరం పెడుతూ వస్తున్నాయి. ఇటువంటి సమయంలో దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యేందుకు బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌, ఆర్‌జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌లు సిద్ధం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో 2024 ఎన్నికల్లో జాతీయ స్థాయిలో మహాకూటమి (Grand Alliance) ఏర్పాటు దిశగానే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఊహాగానాలు మొదలయ్యాయి.

‘నేను, నీతీశ్‌ కుమార్‌ కలిసి దిల్లీలో సోనియా గాంధీతో (Sonia Gandhi) త్వరలో సమావేశమవుతాం. పాదయాత్ర తర్వాత రాహుల్‌ గాంధీని (Rahul Gandhi) కూడా కలుస్తాను. విపక్షాలు ఏకమైతే 2024 ఎన్నికల్లో భాజపాను అధికారం నుంచి దూరం చేయవచ్చు’ అని ఆర్‌జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పేర్కొన్నారు. దేశంలో ప్రజాసమస్యలను పక్కనపెడుతూ మత సామరస్యాన్ని దెబ్బతీయాలని భాజపా కోరుకుంటోందని ఆరోపించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా బిహార్‌లో పర్యటిస్తోన్న సమయంలో దిగ్గజ నేతలు కాంగ్రెస్‌ అధినేత్రితో భేటీ అయ్యేందుకు సిద్ధమవుతుండటం విశేషం. అయితే.. సోనియా గాంధీతో ఎప్పుడు సమావేశమవుతారనే విషయాన్ని వెల్లడించనప్పటికీ.. ఈ ఆదివారం సాయంత్రం దిల్లీలో భేటీ కానున్నట్లు సమాచారం.

ఒకవేళ ఇదే జరిగితే ఆరేళ్ల తర్వాత తొలిసారిగా మళ్లీ వీరు కలిసినట్లవుతుంది. చివరిసారిగా 2015 బిహార్‌ ఎన్నికల సమయంలో ఓ ఇఫ్తార్‌ విందులో సోనియాగాంధీ, నీతీశ్‌లు సమావేశమయ్యారు. గత నెలలో రాహుల్‌ గాంధీని నీతీశ్‌ కలిసినప్పటికీ.. ఆ సమయంలో సోనియా గాంధీ విదేశీ పర్యటనలో ఉన్నారు. మరోవైపు దాణా కుంభకోణం కేసుల్లో శిక్ష అనుభవిస్తోన్న లాలూ.. ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చారు. త్వరలోనే ఆయన కిడ్నీ మార్పిడి కోసం సింగపూర్‌ వెళ్లనున్నారు. ప్రస్తుతం సోనియా గాంధీతో మర్యాదపూర్వకంగా కలవనున్నట్లు చెబుతున్నప్పటికీ జాతీయ స్థాయిలో మహాకూటమిపై (Grand Alliance) చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని