IPL 2024: దిల్లీకి షాక్‌.. ఐపీఎల్‌ నుంచి వైదొలిగిన హ్యారీ బ్రూక్‌

త్వరలో ఐపీఎల్‌ 17వ సీజన్‌ ప్రారంభం కాబోతున్న తరుణంలో వ్యక్తిగత కారణాలతో దిల్లీ క్యాపిటల్స్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ఇంగ్లాండ్‌ ఆటగాడు హ్యారీ బ్రూక్‌ ప్రకటించాడు. 

Published : 14 Mar 2024 00:09 IST

దిల్లీ: ఐపీఎల్‌ 17వ సీజన్‌ (IPL 2024) ప్రారంభానికి ముందు దిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals)కు షాక్‌ తగిలింది. మరో తొమ్మిది రోజుల్లో క్రికెట్‌ పండుగ ప్రారంభం కాబోతున్న తరుణంలో ఇంగ్లాండ్‌ (England)కు చెందిన యువ ఆటగాడు హ్యారీ బ్రూక్‌ (Harry Brook) ఈ ఐపీఎల్‌ సీజన్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్‌కు దూరమవుతున్నట్లు తెలిపాడు. ఈ ఐపీఎల్‌లో ఆడకూడదని కష్టమైన నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశాడు. 

‘‘దిల్లీ క్యాపిటల్స్‌ ఫ్రాంచైజీ తనను ఎంపిక చేసుకున్నందుకు ఆనందించాను. జట్టు సభ్యులతో కలవాలని చాలా ఉత్సాహంగా ఎదురుచూశారు. నా నిర్ణయం వెనక వ్యక్తిగత కారణాలను వెల్లడించాలని నేను భావించలేదు. అయితే ప్రశ్నించేవారు చాలా మంది ఉంటారు కాబట్టి వెల్లడిస్తున్నాను. మా నానమ్మ గత నెలలో కన్నుమూశారు. నా బాల్యమంతా తనతోనే గడిపాను. నా ఆలోచన విధానం, క్రికెట్‌ వరకు అన్నీ మాతాత, నానమ్మ మార్గదర్శకత్వంలోనే రూపొందాయి’’ అని బ్రూక్‌ పేర్కొన్నాడు. ఈ కష్ట సమయంలో కుటుంబంతో పాటు తాను గడపాల్సి ఉందని తెలిపాడు.  

గత సీజన్‌ వేలంలో రూ. 13.25 కోట్ల భారీ ధరతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు బ్రూక్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే 11 మ్యాచ్‌లు ఆడిన అతడు కేవలం 190 పరుగులు చేసి ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. దీంతో ఆ జట్టు వేలం ముందు అతడిని వదిలేసుకుంది. ఇక ఈ ఏడాది నిర్వహించిన వేలంలో దిల్లీ క్యాపిటల్స్‌ రూ.4 కోట్లకు ఈ యువఆటగాడిని సొంతం చేసుకుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని