గుజరాత్‌ ఎగరేసుకుపోయింది

ఐపీఎల్‌-17లో వరుసగా విజయాలతో దూసుకెళ్తున్న రాజస్థాన్‌తో.. తడబడుతూ సాగుతున్న గుజరాత్‌ టైటాన్స్‌ పోరు. ఆరంభంలో తడబడ్డా టైటాన్స్‌కు 197 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది రాజస్థాన్‌.

Updated : 11 Apr 2024 08:06 IST

రాజస్థాన్‌పై అనూహ్య విజయం
రషీద్‌, తెవాతియా అద్భుత పోరాటం
మెరిసిన శుభ్‌మన్‌
పరాగ్‌, శాంసన్‌ శ్రమ వృథా

ఐపీఎల్‌-17లో వరుసగా విజయాలతో దూసుకెళ్తున్న రాజస్థాన్‌తో.. తడబడుతూ సాగుతున్న గుజరాత్‌ టైటాన్స్‌ పోరు. ఆరంభంలో తడబడ్డా టైటాన్స్‌కు 197 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది రాజస్థాన్‌. ఛేదనను మెరుగ్గానే ఆరంభించినా సీజన్లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న పేసర్‌ కుల్‌దీప్‌ సేన్‌ (3/41) ధాటికి కుదేలై 11 ఓవర్లకు 83/3తో నిలిచింది టైటాన్స్‌. ఒంటరి పోరాటం సాగిస్తున్న కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (72) సైతం 16వ ఓవర్లో ఔటైపోయాడు. టైటాన్స్‌ 27 బంతుల్లో 65 పరుగులు చేయాల్సి రావడంతో రాజస్థాన్‌ గెలుపు లాంఛనమే అనుకున్నారంతా. కానీ అనూహ్యం.. చివరికి గుజరాత్‌ గెలిచింది. ఆఖర్లో రషీద్‌ ఖాన్‌ (24 నాటౌట్‌), రాహుల్‌ తెవాతియా (22) జోడీ అద్భుతం చేసింది.

జైపుర్‌

జైపుర్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ అద్భుతం చేసింది. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో అనూహ్య విజయం సాధించింది. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (72; 44 బంతుల్లో 6×4, 2×6) జట్టును ముందుండి నడిపిస్తే.. ఆఖర్లో రాహుల్‌ తెవాతియా (22; 11 బంతుల్లో 3×4), రషీద్‌ ఖాన్‌ (24 నాటౌట్‌; 11 బంతుల్లో 4×4) గొప్పగా పోరాడి జట్టును గెలిపించారు. ఆ జట్టు 197 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి చివరి బంతికి ఛేదించింది. మొదట రియాన్‌ పరాగ్‌ (76; 48 బంతుల్లో 3×4, 5×6), సంజు శాంసన్‌ (68 నాటౌట్‌; 38 బంతుల్లో 7×4, 2×6) మెరుపులతో రాయల్స్‌ 3 వికెట్లకు 196 పరుగులు చేసింది.

పోరాడిన గిల్‌: 8 ఓవర్లలో 64/0. ఛేదనలో గుజరాత్‌ ఆరంభమిది. పరుగులు మరీ వేగంగా రాకపోయినా.. ఒక్క వికెట్టూ కోల్పోని టైటాన్స్‌ మెరుగైన స్థితిలో నిలిచింది. ఓపెనర్లు గిల్‌, సాయి సుదర్శన్‌ (35; 29 బంతుల్లో 3×4, 1×6) ఇన్నింగ్స్‌ను నడిపించారు. గిల్‌ కాస్త బ్యాట్‌ ఝళిపించాడు. కానీ సుదర్శన్‌ ఎక్కువగా సింగిల్స్‌కే పరిమితమయ్యాడు. అయినా 8 ఓవర్లు ముగిసేసరికి ఛేదనలో సాఫీగానే సాగుతున్నట్లు కనిపించిన టైటాన్స్‌.. క్రమంగా గతి తప్పింది. కుల్‌దీప్‌ సేన్‌ పదునైన పేస్‌తో ఆ జట్టును గట్టి దెబ్బతీశాడు. అతడి ధాటికి 15 పరుగులు వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయిన టైటాన్స్‌.. 79/3తో నిలిచింది. ఓ వైపు గిల్‌ నిలిచినా సాధించాల్సిన రన్‌రేట్‌ పెరుగుతూ పోయింది. 14వ ఓవర్లో విజయ్‌ శంకర్‌ (16) ఔటయ్యేప్పటికి స్కోరు 111. చివరి నాలుగు ఓవర్లలో టైటాన్స్‌ 86 పరుగులు చేయాల్సిన పరిస్థితి. గిల్‌, తెవాతియా క్రీజులో ఉండడంతో ఆ జట్టు ఆశలతోనే ఉంది. అందుకు తగ్గట్లే  గిల్‌ చకచకా నాలుగు ఫోర్లు కొట్టి ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. ఆటను ఆసక్తికరంగా మార్చాడు. కానీ అదే ఊపులో ఆడబోయి చాహల్‌ (2/43) బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. కానీ షారుక్‌ ఖాన్‌ (14), తెవాతియా ధాటికి 17వ ఓవర్లో అశ్విన్‌ 17 పరుగులు సమర్పించుకోవడంతో టైటాన్స్‌ రేసులోనే నిలిచింది. తర్వాతి ఓవర్లో ఏడు పరుగులే ఇచ్చి షారుక్‌ను ఔట్‌ చేసిన అవేష్‌.. టైటాన్స్‌ లక్ష్యాన్ని క్లిష్టం చేశాడు. ఆ జట్టుకు ఆఖరి రెండు ఓవర్లలో 35 పరుగులు అవసరమయ్యాయి. అయితే 19వ ఓవర్లో కుల్‌దీప్‌ సేన్‌ పేలవ బౌలింగ్‌తో రాజస్థాన్‌ కొంప ముంచాడు. ఆ ఓవర్లో తెవాతియా రెండు ఫోర్లు, రషీద్‌ ఖాన్‌ ఓ ఫోర్‌ కొట్టారు. బౌలర్‌ రెండు వైడ్లు, నోబాల్‌ కూడా వేయడంతో 20 పరుగులొచ్చాయి. ఆఖరి ఓవర్‌ (అవేష్‌ ఖాన్‌) రసవత్తరంగా సాగింది. ఉత్కంఠ పెరిగిపోయింది. తొలి నాలుగు బంతుల్లో రషీద్‌ ఖాన్‌ వరుసగా 4, 2, 4, 1 చేశాడు. తర్వాతి బంతికి మూడో పరుగు చేసే ప్రయత్నంలో తెవాతియా ఔటయ్యాడు. ఆఖరి బంతికి టైటాన్స్‌కు రెండు పరుగులు అవసరం కాగా.. రషీద్‌ ఖాన్‌ బౌండరీ బాదేశాడు.

చెలరేగిన ఆ ఇద్దరు: రాజస్థాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌లో రియాన్‌ పరాగ్‌, సంజు శాంసన్‌ల మెరుపులే హైలైట్‌. సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ పరాగ్‌ మరోసారి రెచ్చిపోతే.. శాంసన్‌ విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించాడు. వీళ్లిద్దరి భాగస్వామ్యమే (78 బంతుల్లో 130) రాయల్స్‌కు భారీ స్కోరును అందించింది. కానీ ఆ జట్టు ఆరంభం గొప్పగా ఏమీ లేదు. 43/2.. పవర్‌ప్లే ముగిసే సమయానికి రాజస్థాన్‌ స్కోరిది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు 4 ఓవర్ల వరకు వికెట్‌ కోల్పోలేదు. ఫామ్‌లో లేని ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (24; 19 బంతుల్లో 5×4) కొన్ని చక్కని షాట్లతో గాడినపడ్డట్లే కనిపించాడు. కానీ ఆరంభాన్ని పెద్ద స్కోరుగా మలుచుకోలేకపోయాడు. అయిదో ఓవర్లో అతణ్ని ఔట్‌ చేయడం ద్వారా ఉమేశ్‌ యాదవ్‌.. రాజస్థాన్‌ పతనాన్ని ఆరంభించాడు. శాంసన్‌ వస్తూనే రెండు బౌండరీలు బాదినప్పటికీ.. మరో ఓపెనర్‌ బట్లర్‌ (8) కూడా త్వరగానే నిష్క్రమించాడు. రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో అతడు ఔటయ్యాడు. శాంసన్‌, పరాగ్‌ వెంటనే మరో వికెట్‌ పడనివ్వలేదు. అయితే పరుగులు అంత వేగంగా ఏమీ రాలేదు. పరాగ్‌ రెండు ఫోర్లు, ఓ సిక్స్‌ కొట్టినప్పటికీ తొలి 28 బంతుల్లో 32 పరుగులే చేశాడు. శాంసన్‌ తన తొలి 15 బంతుల్లో చేసింది 23. 12 ఓవర్లకు రాజస్థాన్‌ స్కోరు 89/2. కానీ ఆ తర్వాత ఇన్నింగ్స్‌ స్వరూపమే మారిపోయింది. క్రీజులో నిలదొక్కుకున్న బ్యాటర్లిద్దరూ గేర్లు మార్చి జోరు పెంచడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. నూర్‌ అహ్మద్‌ ఓవర్లో రెండు సిక్స్‌లు బాదిన పరాగ్‌.. మోహిత్‌ బౌలింగ్‌లో లాంగాన్‌లో మరో సిక్స్‌ కొట్టాడు. మరోవైపు శాంసన్‌ కూడా కళ్లు చెదిరే షాట్లతో అలరించాడు. స్పెన్సర్‌ జాన్సన్‌ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, సిక్స్‌ కొట్టాడు. 19వ ఓవర్లో (మోహిత్‌) పరాగ్‌ డీప్‌ స్క్వేర్‌ లెగ్‌లో సిక్స్‌ దంచాడు. కానీ మరో భారీ షాట్‌కు యత్నించి వెనుదిరిగాడు. ఉమేశ్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో శాంసన్‌, హెట్‌మయర్‌ (13 నాటౌట్‌) చెరో సిక్స్‌ కొట్టడంతో రాజస్థాన్‌ రెండొందల స్కోరుకు చేరువగా వెళ్లింది. ఆఖరి 10 ఓవర్లలో రాయల్స్‌ 123 పరుగులు పిండుకోవడం విశేషం. మోహిత్‌ శర్మ 4 ఓవర్లలో ఒక వికెట్‌ పడగొట్టి 51 పరుగులు సమర్పించుకున్నాడు. నూర్‌ అహ్మద్‌ (0/43), ఉమేశ్‌ (1/47) కూడా ఎక్కువే ఇచ్చాడు. కొత్తగా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ వస్తూ కీలక ఇన్నింగ్స్‌లతో అదరగొడుతోన్న రియాన్‌ పరాగ్‌కు ఈ టోర్నీలో అయిదు ఇన్నింగ్స్‌లో ఇది మూడో అర్ధశతకం. స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో వ్యక్తిగత స్కోరు 0, 6 వద్ద పరాగ్‌ ఇచ్చిన క్యాచ్‌లను వేడ్‌ జారవిచడంతో టైటాన్స్‌ పెద్ద మూల్యమే చెల్లించుకుంది.

రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌: యశస్వి (సి) వేడ్‌ (బి) ఉమేశ్‌ 24; బట్లర్‌ (సి) తెవాతియా (బి) రషీద్‌ 8; సంజు నాటౌట్‌ 68; పరాగ్‌ (సి) శంకర్‌ (బి) మోహిత్‌ శర్మ 76; హెట్‌మయర్‌ 13 నాటౌట్‌; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 196; వికెట్ల పతనం: 1-32, 2-42, 3-172; బౌలింగ్‌: ఉమేశ్‌ 4-0-47-1; స్పెన్సర్‌ 4-0-37-0; రషీద్‌ 4-0-18-1; నూర్‌ 4-0-43-0; మోహిత్‌ 4-0-51-1

గుజరాత్‌ ఇన్నింగ్స్‌: సుదర్శన్‌ ఎల్బీ (బి) సేన్‌ 35; శుభ్‌మన్‌ (స్టంప్డ్‌) శాంసన్‌ (బి) చాహల్‌ 72; వేడ్‌ (బి) సేన్‌ 4; అభినవ్‌ (బి) సేన్‌ 1; శంకర్‌ (బి) చాహల్‌ 16; తెవాతియా రనౌట్‌ 22; షారుఖ్‌ ఖాన్‌ ఎల్బీ (బి) అవేష్‌ 14; రషీద్‌ నాటౌట్‌ 24; నూర్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 11 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 199; వికెట్ల పతనం: 1-64, 2-77, 3-79, 4-111, 5-133, 6-157, 7-195; బౌలింగ్‌: బౌల్ట్‌ 2-0-8-0; అవేష్‌ 4-0-48-1; కేశవ్‌ 2-0-16-0; అశ్విన్‌ 4-0-40-0; చాహల్‌ 4-0-43-2; కుల్‌దీప్‌ సేన్‌ 4-0-43-2

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని