KL Rahul: గావస్కర్‌ మాటలు ఆశ్చర్యపరిచాయి.. ఊహించలేదు: కేఎల్ రాహుల్

దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ 0-1తో వెనుకబడింది. తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (101) అద్భుత శతకం సాధించినా.. రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ (76) కీలక పరుగులు చేసినా టీమ్‌ఇండియాకు ఇన్నింగ్స్‌ తేడాతో ఓటమి తప్పలేదు. 

Published : 30 Dec 2023 01:34 IST

ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికాపై తొలి టెస్టులో (SA vs IND) భారత్‌ ఓడినప్పటికీ.. మిడిలార్డర్‌ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ (KL Rahul) శతకం మాత్రం ప్రతి అభిమానిని ఆకట్టుకుంది. మాజీ క్రికెటర్లు అతడిపై పొగడ్తల వర్షం కురిపించారు. ఇదే క్రమంలో క్రికెట్‌ దిగ్గజం సునీల్ గావస్కర్ కూడా రాహుల్ సెంచరీని అభినందిస్తూ.. టాప్‌ -10 అద్భుత శతకాల్లో ఇది నిలిచిపోతుందని వ్యాఖ్యానించాడు. తొలి టెస్టు అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కేఎల్ రాహుల్ దృష్టికి ఓ రిపోర్టర్‌ ఈ విషయాన్ని తీసుకెళ్లారు. దానిపై కేఎల్ స్పందించాడు. 

‘‘దిగ్గజ క్రికెటర్‌ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు అస్సలు ఊహించలేదు. ఆశ్చర్యానికి గురి చేశాయి. ఆ ప్రశంసలు నాకెప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ సందర్భంగా ఆయనకు (సునీల్ గావస్కర్) ధన్యవాదాలు చెబుతున్నా.  ఇక మ్యాచ్‌ విషయానికొస్తే ఇలాంటి ఫలితం మమ్మల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేయడం చాలా కష్టం. ఓ ప్రణాళిక వేసుకుని దానికి తగ్గట్టుగా ఆడటం ఇక్కడ కుదరదు. క్రీజ్‌లోకి వెళ్లినప్పుడు పరిస్థితిని బట్టి ఆటతీరును మార్చుకోవాలి. మనం ఎలా ఆడాలనేది మ్యాచే మనకు చెబుతుంది. అందుకే, బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు ఖాళీ మైండ్‌సెట్‌తో వస్తా. మిడిలార్డర్‌లో వచ్చినప్పుడు టెయిలెండర్లతో కలిసి బ్యాటింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ అవకాశాలు తీసుకుని జట్టు స్కోరుబోర్డును నడిపించేందుకు ప్రయత్నించా’’ అని కేఎల్ రాహుల్ తెలిపాడు.

సునీల్‌ గావస్కర్‌ ఏమన్నాడంటే? 

క్లిష్టమైన సెంచూరియన్‌ మైదానంలో కేఎల్ రాహుల్ సెంచరీ సాధించడంపై సునీల్ గావస్కర్ స్పందిస్తూ.. ‘‘గత 50 ఏళ్లుగా నేను క్రికెట్‌ను చూస్తూనే ఉన్నా. కేఎల్ చేసిన సెంచరీ తప్పకుండా భారత క్రికెట్ చరిత్రలో టాప్ -10 జాబితాలో నిలిచిపోతుంది’’ అని వ్యాఖ్యానించాడు.

గొప్ప ఇన్నింగ్స్‌ మరుగున పడిపోతుందేమో: చోప్రా

‘‘ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి సెంచరీ సాధించడమంటే చిన్న విషయం కాదు. టెయిలెండర్లతో బ్యాటింగ్‌ చేస్తూ.. వారి నుంచి సరైన మద్దతు లభించకపోయినా ఏమాత్ర తడబాటుకు గురి కాలేదు. భారత తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులు చేస్తే.. అందులో కేఎల్‌వే శతకం ఉండటం విశేషం. కానీ, బ్రాడ్‌కాస్టర్లు, మీడియా, సోషల్‌ మీడియా వల్ల ఇలాంటి అద్భుతమైన ఇన్నింగ్స్‌ క్రికెట్‌ చరిత్రలో మరుగున పడిపోతుందేమో అనిపిస్తోంది’’ అని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ట్వీట్‌ చేశాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని