IPL 2024: ఆ ట్యాగ్‌ స్టార్క్‌ను ఒత్తిడికి గురి చేయదు.. కేకేఆర్‌కు అతడే కీలక ప్లేయర్: గౌతమ్‌ గంభీర్‌

గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) కోల్‌కతా చేరుకున్నాడు. కేకేఆర్‌ మెంటార్‌గా జట్టును నడిపించేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో తన జట్టులోని కీలక బౌలర్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Published : 15 Mar 2024 13:22 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ మినీ వేలంలో రూ.24.75 కోట్లు వెచ్చించి మరీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (Kolkata Knight Riders) మిచెల్‌ స్టార్క్‌ను దక్కించుకుంది. ఈ సీజన్‌లో అతడే తమ జట్టుకు కీలక ఆటగాడు అవుతాడని కేకేఆర్‌ మెంటార్‌ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) అభిప్రాయపడ్డాడు. అత్యంత విలువైన క్రికెటర్‌ అనే ట్యాగ్‌ అతడిని ఒత్తిడికి గురి చేయదని వ్యాఖ్యానించాడు. ఇప్పటికే రాజకీయాల నుంచి విరామం తీసుకుంటానని వెల్లడించిన గంభీర్‌.. కోల్‌కతాలో అడుగు పెట్టాడు. జట్టుతోపాటు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొననున్నాడు. మిచెల్‌ స్టార్క్‌ రెండు ఐపీఎల్‌ సీజన్లలో ఆడాడు. మొత్తం 34 వికెట్లు పడగొట్టాడు. దాదాపు 9 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఐపీఎల్‌లో మరోసారి ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. చివరిసారిగా 2018లో రూ.9.4 కోట్లకు స్టార్క్‌ను కేకేఆర్‌ కొనుగోలు చేసింది. కానీ, అప్పటి నుంచి అతడు ఐపీఎల్‌ ఆడలేదు.

‘‘ఆస్ట్రేలియా జట్టుకు ఎలాంటి సేవలు అందించాడో.. కేకేఆర్‌ తరఫునా మంచి ప్రదర్శన ఇస్తాడని భావిస్తున్నా. కోల్‌కతా మెంటార్‌గా మళ్లీ రావడం నాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే కేకేఆర్‌ను ఓ ఫ్రాంచైజీగా చూడను. భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది. తప్పకుండా అభిమానులకు మామీద భారీ అంచనాలే ఉంటాయి. వారిని సంతోషపెట్టేందుకు ప్రయత్నిస్తాం. గత సీజన్లలో మేం పెద్దగా రాణించలేకపోయాం. కానీ, ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి పునరావృతం కానివ్వం’’ అని గంభీర్‌ వ్యాఖ్యానించాడు.

లుంగి ఎంగిడి స్థానంలో కొత్త బౌలర్‌ను తీసుకున్న దిల్లీ

దిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురు దెబ్బ తగిలింది. దక్షిణాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడి ఈ సీజన్‌ మొత్తానికి దూరమైనట్లు ఆ ఫ్రాంచైజీ ప్రకటించింది. గాయం కారణంగా ఆడటం లేదని పేర్కొంది. దీంతో అతడి స్థానంలో ఆస్ట్రేలియా యువ ఆల్‌రౌండర్ జేక్‌ ఫ్రేజర్ మెక్‌గుర్క్‌ను తీసుకున్నట్లు దిల్లీ వెల్లడించింది. 21 ఏళ్ల ఆసీస్‌ ఆటగాడు లెగ్‌ స్పిన్‌తోపాటు హార్డ్‌ హిట్టింగ్‌ చేయగల సమర్థుడు. గత నెలలోనే అతడు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. తన రిజర్వ్‌ ధర రూ.50 లక్షలతో దిల్లీ క్యాపిటల్స్‌ జట్టులోకి వస్తున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని