ODI WC 2023: కథ మారేనా.. కల తీరేనా?

రెండు బలమైన జట్లే.. కానీ, ఇప్పటిదాకా వాటికి ప్రపంచకప్‌ అనేది కలగానే మిగిలిపోయింది. గతంలో ఒక జట్టు తృటిలో కప్‌ గెలిచే అవకాశాన్ని కోల్పోతే.. మరో జట్టు సెమీస్‌లోనే వెనుగుతిరుగుతుంది. ఇంతకీ ఆ రెండు జట్లు ఏవి? ఈ సారి ఆ జట్ల కూర్పు ఎలా ఉందో చూద్దాం?  

Updated : 02 Oct 2023 17:10 IST

తొలి ప్రపంచకప్‌ కోసం ఆ రెండు జట్ల తహతహ

వన్డే ప్రపంచకప్‌ (ODI WC 2023) మొదలవుతుంటే ప్రతిసారీ ఆ రెండు జట్లనూ ఫేవరెట్ల జాబితాలో పెడతారు విశ్లేషకులు. అవి చాలా టోర్నీలో చక్కటి ప్రదర్శన చేసినవే. కానీ ఇప్పటిదాకా ట్రోఫీని మాత్రం ముద్దాడలేకపోయాయి. ఈసారి మళ్లీ భారీ ఆశలతో ప్రపంచకప్‌లో అడుగు పెడుతున్నాయి. ఆ రెండు జట్లే.. న్యూజిలాండ్ (New Zealand), దక్షిణాఫ్రికా (South Africa). ఈసారైనా ఈ రెండు జట్లలో ఒకటి ప్రపంచకప్‌ గెలుస్తుందేమో చూడాలి.

వన్డేల్లో ఇప్పటిదాకా పన్నెండు ప్రపంచకప్‌లు జరిగాయి. అందులో అత్యధికంగా ఆస్ట్రేలియా అయిదు టైటిళ్లు (1987, 1999, 2003, 2007, 2015) సాధించింది. 1983లో తొలి కప్‌ సాధించిన భారత్‌.. 2011లో రెండోసారి కప్‌ను ముద్దాడింది. వెస్టిండీస్‌ కూడా రెండుసార్లు (1975, 1979) విజేతగా నిలిచింది. పాకిస్థాన్‌ (1992), శ్రీలంక (1996), ఇంగ్లాండ్‌ (2019) సైతం ఒక్కోసారి కప్‌ అందుకున్నాయి. కానీ పెద్ద జట్లుగా పేరున్నప్పటికీ, ప్రతిసారీ బలమైన ఆటగాళ్లతో బరిలోకి దిగుతున్నప్పటికీ న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మాత్రం ఇప్పటిదాకా కప్‌ కలను నెరవేర్చుకోలేకపోయాయి. ఈసారి ప్రపంచకప్‌లో బరిలోకి దిగుతున్న బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, నెదర్లాండ్స్‌ సైతం టైటిల్‌ సాధించని జట్లే. కానీ వాటికి కప్‌ గెలిచే స్థాయి లేదు. బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌ రెండు మూడు విజయాలు సాధిస్తే గొప్ప. నెదర్లాండ్స్‌ ఒక్క విజయం సాధించినా అది సంచలనమే అవుతుంది.

ఈసారి ఛాన్సుందా?

న్యూజిలాండ్‌ గత రెండు ప్రపంచకప్‌ల్లోనూ టైటిల్‌ విజయానికి చేరువగా వెళ్లింది. 2015, 2019 టోర్నీలో ఆ జట్టు ఫైనల్‌కు చేరింది. 2015లో ఆస్ట్రేలియా సునాయాసంగానే కివీస్‌ను ఓడించింది. కానీ 2019లో మాత్రం కివీస్‌ అంత తేలిగ్గా లొంగలేదు. నిజానికి ఆ జట్టే టైటిల్‌ గెలిచేలా కనిపించింది. కానీ ముందు మ్యాచ్‌ టై కాగా.. ఆ తర్వాత సూపర్‌ ఓవర్‌ కూడా టై అవడంతో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లాండ్‌కే కప్‌ సొంతమైంది. దీంతో కివీస్‌ గుండె పగిలింది. ప్రపంచకప్‌నకు ముందు కివీస్‌ ఎక్కువ హడావుడి చేసే జట్టు కాదు. సైలెంట్‌గా టోర్నీలో అడుగు పెడుతుంది. నిలకడగా ఆడుతుంది.

ఈసారి కూడా కప్‌ ముంగిట కివీస్‌పై మరీ అంచనాలు లేవు. కానీ సెమీస్‌ చేరగల సత్తా ఆ జట్టు సొంతం. బ్యాటింగ్‌ గ్రేట్, కెప్టెన్‌ విలియమ్సన్‌తో పాటు మేటి ఆటగాళ్లు సౌథీ, బౌల్ట్‌లకు ఇదే చివరి ప్రపంచకప్‌గా భావిస్తుండగా.. వారికి కప్‌తో వీడ్కోలు పలకాలని సహచరులు పట్టుదలతో ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్‌ రెండింట్లోనూ ఆ జట్టు బలంగానే కనిపిస్తోంది. కాన్వే, ఫిలిప్స్, మిచెల్‌ లాంటి ఉత్తమ ఆటగాళ్లు ఆ జట్టు సొంతం. ఈసారి టైటిల్‌ కోసం కివీస్‌ గట్టిగా ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు.

ఇక దక్షిణాఫ్రికా విషయానికి వస్తే.. ఈసారి ఆ జట్టును అండర్‌ డాగ్‌ పరిగణిస్తున్నారు. ఇప్పటిదాకా నాలుగుసార్లు ఆ జట్టు సెమీస్‌ చేరింది. కానీ ప్రతిసారీ ఆ దశలోనే వెనుదిరిగింది. ఆ జట్టును ప్రపంచకప్‌లో ఎప్పుడూ దురదృష్టం వెంటాడుతుంటుంది. ఈసారి దక్షిణాఫ్రికా గురించి పెద్దగా చర్చ లేదు. దాన్ని ఫేవరెట్‌గానూ పరిగణించట్లేదు. కానీ మార్‌క్రమ్, వాండర్‌డసెన్, డికాక్, క్లాసెన్, రబాడ, మార్కో జాన్సన్, షంసి లాంటి నాణ్యమైన ఆటగాళ్లతో దక్షిణాఫ్రికా కాగితం మీద బలంగానే ఉంది. కాకపోతే భారత స్పిన్‌ పిచ్‌లు ఆ జట్టును కొంత కంగారు పెట్టేవే. మరి ప్రతికూలతలను అధిగమించి కివీస్, దక్షిణాఫ్రికా ముందంజ వేస్తాయా.. వీటిలో ఏదో ఒక జట్టు కప్‌ కలను నెరవేర్చుకుంటుందా అన్నది చూడాలి.

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని