Ravi Shastri : ఈసారి ఐపీఎల్‌ విజేత ఎవరో రవిశాస్త్రి చెప్పేశాడు..!

ఐపీఎల్‌(IPL 2023) మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. సగానికిపైగా మ్యాచ్‌లు పూర్తవడంతో ఏ జట్టు విజేతగా నిలుస్తుందో.. పలువురు ఇప్పటి నుంచే అంచనా వేస్తున్నారు.

Updated : 05 May 2023 15:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఐపీఎల్‌(IPL 2023) మ్యాచ్‌లు సగానికిపైగా పూర్తయ్యాయి. ఒక్కో టీమ్‌ దాదాపు తొమ్మిది, పది మ్యాచ్‌లు ఆడేశాయి. ఇక పాయింట్ల పట్టికలో పోటీ తీవ్రంగా ఉంది. తొలి నాలుగు స్థానాల్లో నిలవాలంటే విజయాలతోపాటు నెట్‌ రన్‌రేట్‌ కీలకంగా మారుతుందనే విషయం తెలిసిందే. అయితే.. ఈ సమయంలోనే టైటిల్‌ ఎవరు గెలుస్తారో మాజీ దిగ్గజ క్రికెటర్‌ రవిశాస్త్రి(Ravi Shastri) ముందుగానే అంచనా వేశాడు. అయితే ఆ జట్టు ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌(chennai super kings) కాకపోవడం గమనార్హం.

గుజరాత్‌ టైటాన్స్‌(Gujarat Titans) మరోసారి ఐపీఎల్‌ టైటిల్‌ విజేతగా నిలుస్తుందని శాస్త్రి పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఏడాదిలోనే గుజరాత్‌ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ జట్టులో ఉన్న సమతూకం, విజయాల కోసం సమష్టిగా రాణిస్తుండటం చూస్తుంటే.. ఈ సారి కూడా టైటిల్‌ ఫేవరెట్‌గా గుజరాతే నిలుస్తోందని శాస్త్రి ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ విశ్లేషించాడు.

‘ప్రస్తుత సీజన్‌లో గుజరాత్‌ ఆడుతున్న తీరు.. పాయింట్ల పట్టికలో ఆ జట్టు ఉన్న స్థితిని చూడండి. ఆ జట్టే టైటిల్‌ విజేతగా నిలుస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ జట్టులో స్థిరత్వం ఉంది. ఏడెనిమిది మంది ఆటగాళ్లు నిలకడగా రాణిస్తున్నారు. ఒకరికొకరు అండగా నిలుస్తున్నారు’ అని రవిశాస్త్రి వివరించాడు.

ఇక ఈ ఐపీఎల్‌లో రాజస్థాన్‌(Rajasthan Royals) జట్టును సంజూశాంసన్‌(Sanju Samson ) నడిపిస్తున్న తీరుపై కూడా శాస్త్రి ప్రశంసలు కురిపించాడు. ‘కెప్టెన్‌గా సంజూ ఎంతో పరిణతి సాధించాడు. స్పిన్నర్లను చాలా బాగా ఉపయోగించుకుంటున్నాడు. మంచి కెప్టెన్‌ మాత్రమే ముగ్గురు స్పిన్నర్లతో ఆడగలడు.. వారిని తెలివిగా ఉపయోగించుకోగలడు’ అని కొనియాడాడు.

ఇక ఇప్పటి వరకూ పాయింట్ల పట్టికను పరిశీలిస్తే.. గుజరాత్‌ 6 విజయాలతో తొలి స్థానంలో ఉండగా.. లఖ్‌నవూ, చెన్నై, రాజస్థాన్‌ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.  మరోవైపు వరుస అపజయాలతో సన్‌రైజర్స్‌, దిల్లీ చివరి రెండు స్థానాల నుంచి పైకి రావడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని