Ravichandran Ashwin: అందుకే అశ్విన్‌ టెస్టు మధ్యలోనే రావాల్సి వచ్చింది.. ఫ్యామిలీ ఎమర్జెన్సీపై సతీమణి వివరణ

రాజ్‌కోట్‌ టెస్టు మధ్యలోనే అశ్విన్‌ (Ravichandran Ashwin) మైదానాన్ని వీడి ఇంటికి తిరిగివచ్చాడు. అప్పుడు తలెత్తిన ఫ్యామిలీ ఎమర్జెన్సీని అతడి సతీమణి తాజాగా వివరించారు.

Updated : 06 Mar 2024 17:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin) రాజ్‌కోట్‌ టెస్టు (IND vs ENG 2024) మధ్యలోనే ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఎమర్జెన్సీయే ఇందుకు కారణమని అప్పట్లో పేర్కొన్న బీసీసీఐ.. అసలు ఏమైంది అనే విషయం తెలపలేదు. ఆ తర్వాత దీనిపై అశ్విన్‌ కూడా ఎక్కడా స్పందించలేదు. అయితే తల్లి అనారోగ్యం వల్లే అశ్విన్‌ ఇంటికొచ్చేశాడని వార్తలొచ్చాయి. గురువారం నుంచి వందో టెస్టు ఆడుతున్న నేపథ్యంలో అశ్విన్‌ సతీమణి ప్రీతి ఈ విషయంపై తొలిసారి స్పందించారు. తల్లికి అనారోగ్యం కారణంగానే అశ్విన్‌ ఆ టెస్టు నుంచి అర్ధాంతరంగా వెనక్కి రావాల్సి వచ్చిందని ఆమె ఓ మీడియాకు తెలిపారు. ఆ రోజు ఏం జరిగిందో వివరించారు. 

‘‘రాజ్‌కోట్‌ టెస్టు జరుగుతోంది. అశ్విన్‌ 500 వికెట్ల ఘనత సాధించాడు. కాసేపటికే మా పిల్లలు స్కూల్‌ నుంచి తిరిగి వచ్చారు. మేమంతా అశ్విన్‌కు అభినందనలు చెబుతూ కాల్‌ చేస్తున్న వారికి సమాధానమిస్తున్నాం. ఆ సమయంలో మా అత్తయ్య ఒక్కసారిగా కుప్పకూలారు. దాంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాం. ఆ సమయంలో అశ్విన్‌కు ఈ విషయాన్ని వెంటనే చెప్పకూడదని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే రాజ్‌కోట్‌ నుంచి చెన్నైకి విమాన కనెక్టివిటీ సరిగా లేదు’’ అని ప్రీతి తెలిపారు.

భయమేల.. రవిచంద్రుడుండగ!

‘‘దాంతో ఛెతేశ్వర్‌ పుజారాకు కాల్‌ చేసి పరిస్థితి వివరించాను. పుజారా కుటుంబం మాకు గొప్ప సాయం చేసింది. రాజ్‌కోట్‌ నుంచి అశ్విన్‌ చెన్నై రావడానికి ఉన్న మార్గాలను తెలుసుకున్నాం. స్కానింగ్‌ రిపోర్టులు చూశాక.. వైద్యులు కూడా అశ్విన్‌ తల్లి వద్ద ఉంటే బాగుంటుందని సూచించారు. వెంటనే అశ్విన్‌కు కాల్‌ చేశాం. ఇక్కడి పరిస్థితి వివరించాం. ఆ తర్వాత అతను తిరిగి కాల్‌ చేయడానికి మరో 20 - 25 నిమిషాలు పట్టింది. అశ్విన్‌ తన తల్లి దగ్గరకు రావడానికి సహకరించిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, బీసీసీఐకి ధన్యవాదాలు. అతడు ఇంటికి చేరుకోవడానికి వారు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ రోజు రాత్రి పొద్దుపోయాక అశ్విన్‌ ఇంటికి వచ్చాడు’’ అని ప్రీతి ఆ రోజు పరిస్థితిని వివరించారు. 

అశ్విన్‌ నేరుగా ఆస్పత్రికి చేరుకుని ఐసీయూలో తల్లిని చూశాడు. ఆ తర్వాతే ఆమె కోలుకున్నారు. దీంతో తిరిగి రాజ్‌కోట్‌ చేరుకుని నాలుగో రోజు ఆటలో భాగమయ్యాడు. ‘‘తల్లిని ఐసీయూలో చూడటం అశ్విన్‌కు భారమైన క్షణంగా గడిచింది. ఆమె కోలుకున్న తర్వాత.. జట్టులో తిరిగి చేరాలని కోరాం. గేమ్‌ను మధ్యలోనే వదలడం అతడి వ్యక్తిత్వం కాదు. తన జట్టును గెలిపించలేకపోతే గిల్టీగా ఫీలవుతాడు. ఆ రెండు రోజులు తల్లి కోసం పడిన ఆరాటాన్ని గ్రహించాను’’ అని ప్రీతి వివరించారు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా ధర్మశాల వేదికగా జరుగుతున్న ఆఖరి మ్యాచ్‌ అశ్విన్‌ కెరీర్‌లో వందోది కావడం గమనార్హం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని