Sunny: నాకెలాంటి ‘ఇగో’ లేదు.. కానీ వారిని ఓవర్‌టేక్‌ చేయొద్దనే.. : గావస్కర్‌

టీమ్ఇండియా (Team India) ప్రస్తుత తరం ఆటగాళ్ల బ్యాటింగ్‌ విషయంలోనూ సమస్యలు ఉన్నాయని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) అభిప్రాయపడ్డాడు. అయితే, తనను ఎవరూ సంప్రదించలేదని పేర్కొన్నాడు. 

Updated : 14 Jul 2023 12:36 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత యువ క్రికెటర్లు తమ బ్యాటింగ్‌ శైలికి సంబంధించి ఎవరూ తనను సంప్రదించలేదని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) వ్యాఖ్యానించాడు. ఇప్పటి తరం బ్యాటర్ల శైలిలో కొన్ని టెక్నిక్‌కు సంబంధించి సమస్యలు ఉన్నాయని పేర్కొన్నాడు. అయితే, ఒక్కరూ తనను కలవలేదని తెలిపాడు. రాహుల్ ద్రవిడ్, సచిన్‌ తెందూల్కర్‌ వంటి ఆటగాళ్లు తన దగ్గర సూచనలు తీసుకున్నారని గుర్తు చేశాడు. ఆటపరంగా ఎలాంటి సాయం చేయడానికైనా తాను సిద్ధంగా ఉంటానని తెలిపాడు. అయితే ప్రస్తుత కోచ్‌లను పక్కన పెట్టేసి మరీ ప్లేయర్లతో సంభాషించనని స్పష్టం చేశాడు.

‘‘ఇప్పటితరం ఆటగాళ్లు ఎవరూ నా వద్దకు రాలేదు. గతంలో రాహుల్ ద్రవిడ్, సచిన్, వీవీఎస్ లక్ష్మణ్‌ తరచూ వచ్చేవారు. తమ సమస్యలను చెప్పి పరిష్కారం కోసం సూచనలు తీసుకునేవారు. ఇక ఇప్పుడున్న ఆటగాళ్ల వద్దకు వెళ్లి మాట్లాడేందుకు నాకెలాంటి అహం లేదు. తప్పకుండా మాట్లాడతా. కానీ, ఇప్పుడు అక్కడ ఇద్దరు కోచ్‌లు రాహుల్‌ ద్రవిడ్, విక్రమ్‌ రాఠోడ్‌ ఉన్నారు. కాబట్టి, వారిని అయోమయంలోకి నెట్టేలా ఆటగాళ్లకు మరింత సమాచారం అందించడకూడదని భావించా. అందుకే కాస్త వెనుకడుగు వేస్తున్నా.

ఓ బ్యాటర్‌ పదే పదే అదే పొరపాట్లు చేస్తుంటే.. తప్పకుండా అతడితో మాట్లాడాలి. నీ టెక్నిక్‌కు ఏమైందని అడగాలి. సదరు బ్యాటర్ మెరుగయ్యేలా ఏం చేయాలి? ఎక్కడ పొరపాటు చేస్తున్నాడో వివరించి చెప్పాలి. స్టంప్‌ వద్ద గార్డ్‌ను మార్చుకోవడం ద్వారా ఏమైనా ఫలితం ఉంటుందేమో చూడాలి. గతంలో ఇలానే వీరేంద్ర సెహ్వాగ్‌ విషయంలోనూ పిలిపించా. పరుగులు చేయడానికి కాస్త ఇబ్బంది పడిన సమయమది. ‘వీరూ, నువ్వు ఆఫ్‌ స్టంప్‌ గార్డ్‌’ను తీసుకుని ఆడు అని సూచించా. ఎందుకని అతడు అడిగాడు. ‘నీకు గొప్ప ఫుట్‌వర్క్‌ లేదు. వికెట్లకు వేసిన బంతిని ఆడబోయి పెవిలియన్‌కు చేరుతున్నావు. అదే నీకు సమస్యగా మారింది. అదే ఆఫ్‌స్టంప్‌ గార్డ్‌ తీసుకుంటే నీకు ఆ బంతి బయటకు వెళ్తుందని కచ్చితంగా అర్థమవుతుంది’ అని చెప్పా. ఇలాంటి విషయాలను కోచింగ్‌ సిబ్బంది వివరించాలి. అప్పుడే సత్ఫలితాలు రాబట్టేందుకు అవకాశం ఉంటుంది’’ అని గావస్కర్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని