ఐపీఎల్‌ది గట్టి బుడగేనా? నిర్వహణకు సవాళ్లెన్నో!

జరుగుతుందో లేదోనన్న పొట్టి క్రికెట్‌ వేడుక జరుగుతుందని తెలియగానే అందరూ ఎగిరి గంతేశారు. జరిగేది భారత్‌లో కాదు యూఏఈలో అన్నప్పటికీ టీవీ తెరల్లో చూడొచ్చని ఆనందించారు. సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు లీగ్‌ అనగానే ఇక ప్రతిరోజూ పండగే అని భావించారు.....

Updated : 04 Sep 2020 16:52 IST

స్పాన్సర్‌, ఫిట్‌నెస్‌, కరోనా, కుటుంబ సమస్యలు

బీసీసీఐ, ఫ్రాంచైజీలు ఏం చేయనున్నాయి?

జరుగుతుందో లేదోనన్న పొట్టి క్రికెట్‌ వేడుక జరుగుతుందని తెలియగానే అందరూ ఎగిరి గంతేశారు. జరిగేది భారత్‌లో కాదు యూఏఈలో అన్నప్పటికీ టీవీ తెరల్లో చూడొచ్చని ఆనందించారు. సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు లీగ్‌ అనగానే ఇక ప్రతిరోజూ పండగే అని భావించారు. అభిమానుల వైపు నుంచి ఓకే గానీ బీసీసీఐ, ఐపీఎల్‌ పాలక మండలి, ఆటగాళ్లు ఎదుర్కొనే సవాళ్లు మాత్రం అత్యంత కఠినంగా ఉండబోతున్నాయి. ఈ కరోనా కాలం పెట్టే పరీక్షలు ఏంటి? అవెలా ఉండనున్నాయో తెలుసా?


కొత్త స్పాన్సర్‌ దొరికేనా?

నిజానికి ఐపీఎల్‌ మార్చి ఆఖర్లో మొదలై మేలో ముగియాల్సిన వేడుక. కొవిడ్‌-19 వల్ల వాయిదా పడింది. ప్రపంచకప్‌, ఆసియాకప్‌ వాయిదాతో అనుకూలమైన విండో దొరికింది. కానీ ఈ సీజన్‌ కుదరకపోతే బీసీసీఐ దాదాపు రూ.4,500 కోట్ల వరకు నష్టపోయేది. సాధారణంగా భారత్‌లో నిర్వహిస్తే టోర్నీ నిర్వహణకు అయ్యే ఖర్చు తక్కువే. ఇప్పుడు యూఏఈలో కాబట్టి ఎక్కువగానే ఖర్చు చేయాల్సి రావొచ్చు. అందులోనూ ఖాళీ స్టేడియాల్లోనే కాబట్టి గేట్‌మనీ రాదు. ఫ్రాంచైజీలు ఆ మేరకు నష్టపోక తప్పదు. యాజమాన్యాలు కొంతైన పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్న తరుణంలో బీసీసీఐ ఏం చేస్తుందో చూడాలి. దీనికి తోడు ‘చైనా వస్తు బహిష్కరణ’ సెగ బోర్డుకు గట్టిగానే తగిలింది. దాంతో టైటిల్‌ స్పాన్సర్‌ హోదా నుంచి తప్పుకొనేందుకు వివో సిద్ధమైంది. అంటే రూ.440 కోట్ల వరకు ఆదాయం కోల్పోవాల్సి వస్తోంది. మరి ఈ నష్టాన్ని పూడ్చుకొనేందుకు అదే స్థాయిలో మరో స్పాన్సర్‌ దొరకడం కరోనా కాలంలో కష్టమే. అందులో సగం చెల్లించేందుకైనా ఒక్కరు ముందుకొచ్చినా గొప్పేనని మార్కెట్‌ నిపుణుల మాట. మరి ఈ సవాల్‌ను బోర్డు ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.


గట్టి బుడగేనా?

ఐపీఎల్‌కు మరో సవాల్‌ బయో బుడగ! వెస్టిండీస్‌, పాకిస్థాన్‌తో సిరీసులకు ఇంగ్లాండ్‌ ఇదే ప్రయోగం చేసి విజయవంతమైంది. అయితే అక్కడ కేవలం రెండు జట్లు మాత్రమే సురక్షిత వాతావరణంలో ఉన్నాయి. మొత్తంగా 50 మందికి మించి ఉండరు. కానీ ఐపీఎల్‌లో మాత్రం అత్యంత కష్టం. ఒక్కో జట్టులో కనీసం 20+ ఆటగాళ్లు ఉంటారు. కోచింగ్‌, ఫ్రాంచైజీ సిబ్బంది అదనం. ఒక్కో ఫ్రాంచైజీ నుంచి అందరూ కలిపి 35 మంది ఉన్నా ఎనిమిది ఫ్రాంచైజీలకు 280 మంది అవుతారు. వీరే కాకుండా ఐపీఎల్‌ నిర్వహక కమిటీ సభ్యులు, అధికారులు, సాంకేతిక, అంపైరింగ్‌, లాజిస్టిక్స్‌, ప్రసారదారు, రవాణా సిబ్బందీ ఉంటారు. అంటే ఈ లీగ్‌లో మొత్తంగా 350-400 మంది ఉండే అవకాశం ఉంది. అంత మందితో బయో బబుల్‌ విజయవంతమైతే చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. ఆటగాళ్లలో ఏ ఒక్కరికైనా కొవిడ్‌-19 సోకితే ఏం చేస్తారో ఇంకా నిర్ణయించలేదు! క్వారంటైన్‌, చికిత్స, ప్రైమరీ కాంటాక్టుల పరంగా ఏం చేస్తారో తెలియదు.


ఫిట్‌నెస్‌ ఎలా?

లీగ్‌ పరంగా ఆటగాళ్లు ఎదుర్కొనే సమస్యలు చాలానే ఉన్నాయి. లాక్‌డౌన్‌ వల్ల వారంతా దాదాపుగా నాలుగు నెలలు ఇంటికే పరిమితం అయ్యారు. ఇప్పుడు వీరు దేహదారుఢ్యం సంతరించుకోవడం అత్యంత ముఖ్యం. అయితే ఇదంత సులభం కాదు. మ్యాచ్‌ నిడివి మూడున్నర గంటలే అయిన ఆడేందుకు అవసరమైన ఫిట్‌నెస్‌ స్థాయి మాత్రం చాలా ఎక్కువ. సీజన్‌ ఆరంభానికి ఇంకా ఉన్నది నెల రోజుల కాలమే. ఈ స్వల్ప సమయంలో ఆటగాళ్లంతా వేగంగా లయ అందుకోవాలి. బౌలర్లకు ఇదెంతో కష్టం. అతిగా శ్రమిస్తే మొదటికే మోసం వస్తుంది. ఎందుకంటే గాయాల పాలవుతారు. ప్రస్తుతం ఎంఎస్‌ ధోనీ, కోహ్లీ, రోహిత్‌ సహా కొందరు క్రికెటర్లు ఇంటి వద్దే సాధన చేస్తున్నారు. సురేశ్‌ రైనా, రిషభ్‌ పంత్‌, మహ్మద్‌ షమి సహా అనేక మంది సొంత రాష్ట్రాలకు చెందిన మైదానాల్లో శిక్షణ పొందుతున్నారు. దుబాయ్‌, షార్జా, అబుదాబి వాతావరణానికి అలవాటు పడాలని 20 రోజులు ముందుగానే ఆటగాళ్లను దుబాయ్‌కి చేర్చేందుకు ఫ్రాంచైజీలు పనులు మొదలెట్టాయి.


ఫ్యాన్స్‌కు ప్రత్యామ్నాయం ఏంటి?

ఇన్నాళ్లుగా ఆటగాళ్లు వేలాది మంది అభిమానుల మధ్య ఆడేందుకు అలవాటు పడ్డారు. వారు ఉత్సాహపరుస్తుంటే పరుగుల వరద పారించేవారు. కళ్లు చెదిరే సిక్సర్లు బాదేవారు. బౌలర్లు సైతం కసికసిగా బంతులు విసిరేవారు. హఠాత్తుగా వారిప్పుడు ఖాళీ స్టేడియాల్లో ఆడాల్సి వస్తోంది. ఇది క్రికెటర్లపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలియదు. తమ ఆటలో తీవ్రతేమీ తగ్గదని కోహ్లీ గతంలో చెప్పినప్పటికీ అభిమానులు ఉన్నప్పటి మజా, అనుభూతి ఎప్పటికీ రాదన్నాడు. ఈ లోటును పూడ్చేందుకు స్టేడియంలో కటౌట్లు పెట్టడం, అభిమానుల కేరింతల ధ్వనులు వినిపించడం వంటివి నిర్వాహకులు చేపట్టొచ్చు. ఇక మైదానంలో కరోనా కట్టుబాట్లకు వారెలా సర్దుకుపోతారన్నది మరో సవాల్‌. ఇప్పటికే బంతిపై ఉమ్మి రుద్దడాన్ని ఐసీసీ నిషేధించింది. వికెట్లు తీసినప్పుడు ఒకరినొకరు ముట్టుకోవడానికి వీల్లేదు. కౌగిలించుకొని మనసారా అభినందించడం కుదరదు. ఇది వారిని మానసికంగా దెబ్బతీసేదే!


కుటుంబ సభ్యులు వస్తారా?

ద్వైపాక్షిక సిరీసులు ఆడేటప్పుడు కుటుంబ సభ్యులను కలిసేందుకు క్రికెటర్లకు అనుమతి ఉండదు. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడూ అంతే. అయితే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఇందుకు భిన్నంగా ఉంటుంది. భార్యా పిల్లలతో డ్రస్సింగ్‌ రూముల్లో సందడి వాతావరణం నెలకొటుంది. స్టేడియంలో కూర్చొని వారు ప్రోత్సహించడం కనిపిస్తుంది. చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇందుకు సరైన ఉదాహరణ. ధోనీ, రైనా, జడ్డూ, భజ్జీ, రాయుడు వంటి క్రికెటర్ల జీవిత భాగస్వాములు, పిల్లలు సరదాగా ఉండటం మనకు తెలిసిందే. ఐపీఎల్‌లో రోహిత్‌ శర్మ తన సతీమణి రితిక సజ్దె లేకుండా అస్సలు కనిపించడు. మరి యూఏఈకి కుటుంబ సభ్యులను అనుమతించడంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ అంశాన్ని ఫ్రాంచైజీలకే వదిలేస్తున్నామని బీసీసీఐ చెప్పింది. అయితే కచ్చితమైన నిర్వాహక విధాన ప్రక్రియ (ఎస్‌ఓపీ) లేకుండా నిర్ణయం తీసుకోవడం కష్టమని యాజమాన్యాలు వాదిస్తున్నాయి. కుటుంబీకులు కూడా వస్తే బయో బుడగ‌ మరింత కష్టం. భౌతిక దూరం పరంగా ఇబ్బందులు తలెత్తుతాయి.


పరీక్షించే పరీక్షలు?

ఆటగాళ్లు, సిబ్బందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం మరో సవాల్‌. డోపింగ్‌ కోసం తప్ప గతంలో ఇలా పరీక్షలు చేయించుకోవడం వారికి అలవాటు లేదు. మానసికంగా ఇది వారిపై పెను ప్రభావమే చూపించే అవకాశం ఉంది! ఎందుకంటే నమూనాలు తీసుకున్న తర్వాత ఫలితాలు ఎలా వస్తాయోనని ఆందోళన చెందడం సహజం. ఎందుకంటే వాటిపై ఆధారపడే లీగ్‌లో ఆడాల్సి ఉంటుంది. పెద్ద క్రికెటర్లకు ఒత్తిడి అలవాటే కాబట్టి ప్రశాంతంగా ఉండగలరు. యువ క్రికెటర్లు సర్దుకుపోవడం మాత్రం కష్టం. వారిపై ఒత్తిడి లేకుండా చూడాలి. నిబంధనల ప్రకారం యూఏఈలో సాధన ఆరంభించాలంటే కనీసం అయిదుసార్లు నెగెటివ్‌ రావాలి. టోర్నీలోనూ ప్రతి ఐదు రోజులకు ఒకసారి పరీక్షలు చేస్తారు. ఐపీఎల్‌ ఆడే భారత ఆటగాళ్లు తమ జట్లతో 14 రోజులు క్వారంటైన్‌ వెళ్లేందుకు వారం ముందు ఒక్కో రోజు వ్యవధిలో రెండు ఆర్‌టీ పీసీఆర్‌ టెస్టులు చేయించుకోవాలి. పాజిటివ్‌ వస్తే 14 రోజుల తర్వాత 24 గంటల వ్యవధిలో రెండుసార్లు చేయించుకోవాలి. అప్పుడు నెగెటివ్‌ వస్తేనే యూఏఈకి టికెట్‌ లభిస్తుంది. మొత్తంగా ఈ ప్రకియంతా ఆటగాళ్లను మానసికంగా కుంగదీసే అవకాశం లేకపోలేదు.

-ఇంటర్‌నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని