IND vs AUS: మైదానంలోకి దూసుకొచ్చి ఫేమస్‌ అవుదామని.. ఎవరీ జాన్సన్ వేన్‌?

ఇటీవల భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య జరిగిన ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో భద్రతా వైఫల్యం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. భారత ఇన్నింగ్స్‌ సాగుతున్నప్పుడు మైదానంలోకి దూసుకొచ్చిన వ్యక్తి ఎవరో గుర్తించారు.

Updated : 21 Nov 2023 12:22 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ కప్‌ ఫైనల్‌లో టీమ్‌ఇండియా (Team India) ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఇన్నింగ్స్‌ కొనసాగుతుండగా..  భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. మైదానంలోకి అనూహ్యంగా ఓ వ్యక్తి దూసుకొచ్చాడు. ‘ఫ్రీ పాలస్తీనా’ అని రాసి ఉన్న టీషర్ట్‌ ధరించిన అతడు నేరుగా విరాట్‌ కోహ్లీ  (Virat Kohli) వద్దకు వెళ్లి భుజంపై చేయి వేశాడు. దీంతో అప్రమత్తమైన భద్రతాసిబ్బంది వెంటనే అతడిని మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ బాంబు దాడులు ఆపాలని అతడి టీషర్ట్ ముందు భాగంలో రాసి ఉంది. కొంతకాలంగా ఇజ్రాయెల్‌-హమాస్ (Israel- Hamas Conflict) మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, భారత్, ఆస్ట్రేలియా ఫైనల్‌ మ్యాచ్‌కు ఆటంకం కలిగించిన వ్యక్తిని ఆస్ట్రేలియాకు చెందిన జాన్సన్ వేన్‌ (Johnson Wen)గా గుర్తించారు.

ఎవరీ జాన్సన్ వేన్‌?

నరేంద్ర మోదీ స్టేడియంలో జాన్సన్ వేన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. జాన్సన్ పబ్లిసిటీ కోసం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడని పోలీసులు వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో ఉన్న సమస్యలను అడ్డుపెట్టుకుని ఇలా మ్యాచ్‌లకు అంతరాయం కలిగించి ఫేమస్‌ టిక్‌టాకర్‌గా ప్రచారం చేసుకోవడానికి ఇలా చేస్తున్నాడని వెల్లడించారు. ‘‘నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చాను. కోహ్లీని కలవడానికి మైదానంలోకి వెళ్లాను. పాలస్తీనాలో జరుగుతున్న యుద్ధంపై నిరసన తెలిపేందుకు ఇలా చేశా’’ అని పోలీసులు అదుపులోకి తీసుకున్న అనంతరం జాన్సన్ వేన్‌ విలేకరులతో చెప్పాడు.

గతంలో కూడా

జాన్సన్ వేన్ ఇలా మైదానాల్లోకి దూసుకురావడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది ఆగస్టులో ఇంగ్లాండ్, స్పెయిన్ మధ్య జరిగిన మహిళల ప్రపంచ కప్ ఫుట్‌బాల్ ఫైనల్ మ్యాచ్‌లోనూ భద్రతాసిబ్బంది కళ్లు గప్పి మైదానంలోకి దూసుకెళ్లాడు. అప్పుడు ‘ఫ్రీ ఉక్రెయిన్.. స్టాప్‌ పుట్లర్’ (పుతిన్‌ని హిట్లర్‌తో పోలుస్తూ) అని రాసి ఉన్న టీషర్ట్ ధరించి నిరసన తెలిపాడు. 2020లో ఓ రగ్బీ మ్యాచ్‌కి కూడా అంతరాయం కలిగించి డ్యాన్స్ చేశాడు. ఇలా చేసినందుకు అతడికి 200 ఆస్ట్రేలియా డాలర్లు జరిమానా విధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని