
Smartphone: జనవరి 4నుంచి ఆ ఫోన్లు పనిచేయవు.. కారణమిదే!
ఇంటర్నెట్‌డెస్క్: మార్కెట్లో ఎన్ని రకాల ఫోన్లు ఉన్నా.. ఒక్కసారైనా ఐఫోన్ ఉపయోగించాలనుకుంటాం. అంతే మరి..ఆ ఫోన్‌కు ఉన్న క్రేజ్ అలాంటిది. అలానే ఒకప్పుడు మొబైల్ ప్రపంచంలో బ్లాక్‌బెర్రీ ఫోన్ అంటే ఎంతో క్రేజ్ ఉండేది. క్వర్టీ కీబోర్డుతో వెడల్పాటి డిస్‌ప్లే, డేటా సెక్యూరిటీ ఫీచర్లతో దశాబ్దకాలంపాటు మొబైల్ మార్కెట్లో ఈ ఫోన్ల హవా కొనసాగింది. కాలక్రమంలో టచ్ డిస్‌ప్లే ఫోన్లు రావడంతో బ్లాక్‌బెర్రీ ఫోన్లకు ఆదరణ తగ్గింది. తాజాగా బ్లాక్‌బెర్రీ ఓఎస్‌తో పనిచేస్తున్న ఫోన్లు జనవరి 4 నుంచి పనిచేయవని కంపెనీ తెలిపింది. ఈ మేరకు కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. బ్లాక్‌బెర్రీ 7.1 నుంచి బ్లాక్‌బెర్రీ 10 ఓఎస్‌తో పనిచేసే ఫోన్లకు సాఫ్ట్‌వేర్ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
గతేడాది సెప్టెంబరు నెలలోనే దీనికి సంబంధించి ప్రకటన చేసినప్పటికీ ‘యాన్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ థ్యాంక్స్’ పేరుతో ఈ సేవలను మరో మూడు నెలల కొనసాగించింది. అయితే ఆండ్రాయిడ్ ఓఎస్‌తో పనిచేస్తున్న బ్లాక్‌బెర్రీ ఫోన్లు యథావిధిగా పనిచేస్తాయని తెలిపింది. ‘‘బ్లాక్‌బెర్రీ ఓఎస్‌తో పనిచేస్తున్న ఫోన్లు ఉపయోగిస్తున్న యూజర్స్ జనవరి 4 తేదీ నుంచి ఫోన్‌కాల్స్, మెసేజింగ్, వైఫై కనెక్టివిటీతో పాటు ఎమర్జెన్సీ సేవలకు సంబంధించి ఎలాంటి సేవలు ఉపయోగించలేరు’’ అని కంపెనీ వెబ్‌సైట్‌లో పేర్కొంది.
మొబైల్ మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన బ్లాక్‌బెర్రీ అమ్మకాలు ఐఫోన్ల రాకతో నెమ్మదించాయి. దీంతో 2013లో ఆండ్రాయిడ్, ఐఓఎస్‌కు పోటీగా బ్లాక్‌బెర్రీ ఓఎస్‌ను పరిచయం చేసింది. అయితే ఈ ఓఎస్‌కు యూజర్స్ నుంచి ఆదరణ కరువైంది. ఈ నేపథ్యంలో 2015లో బ్లాక్‌బెర్రీ ఆండ్రాయిడ్ ఓఎస్‌తో టచ్ డిస్‌ప్లేతో కొత్త మోడల్స్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే యాపిల్, శాంసంగ్, షావోమి వంటి దిగ్గజ కంపెనీలతో పోటీ పడలేకపోయింది.
ఈ క్రమంలో టీసీఎల్ కమ్యూనికేషన్‌తో కలిసి బ్లాక్‌బెర్రీ కీవన్, కీ2 మోడల్స్‌ను తీసుకొచ్చింది. అవి కూడా ఆశించినంతగా రాణించలేకపోయాయి. దీంతో 2020 ఫిబ్రవరిలో బ్లాక్‌బెర్రీ ఫోన్ల ఉత్పత్తిని కొనసాగించలేమని టీసీఎల్ ప్రకటించింది. అదే ఏడాది టెక్సాస్‌కు చెందిన ఆన్‌వార్డ్ మొబిలిటీ సంస్థ 2021లో బ్లాక్‌బెర్రీ 5జీ ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌లను కంపెనీ వెల్లడించలేదు. ప్రస్తుతం బ్లాక్‌బెర్రీ కంపెనీ వివిధ టెక్ కంపెనీలకు, ప్రభుత్వ రంగ సంస్థలకు సాఫ్ట్‌వేర్ సెక్యూరిటీలను అభివృద్ధి చేస్తోంది.
► Read latest Tech & Gadgets News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.