క్రోమ్‌... ఇంకాస్త కొత్తగా!

విజయానికి షార్ట్‌కట్‌లు ఉండవు కానీ... పని పూర్తవ్వడానికి మాత్రం షార్ట్‌కట్‌లుంటాయి. మీరు రోజూ కంప్యూటర్‌లో వాడే క్రోమ్‌ బ్రౌజర్‌లో కొన్ని ఎక్స్‌టెన్షన్‌లు మీకు షార్ట్‌కట్‌లు అందిస్తాయి. క్రోమ్‌ స్టోర్‌లో ఉండే ఈ ఎక్స్‌టెన్షన్లను ఇన్‌స్టాల్‌ చేసుకొని క్రోమ్‌ బ్రౌజర్‌ను ఇంకాస్త కొత్తగా వాడేయొచ్చు. ఒక్క క్లిక్‌తో క్రోమ్‌ బ్రౌజర్‌లో పదుల సంఖ్యలో ట్యాబ్‌లు ఓపెన్‌ చేసి పెట్టారు. ఇంతలో ఎవరో స్నేహితుడు వచ్చాడు. ఆ వ్యక్తి మీ సెర్చ్‌ సమాచారం చూడటం మీకు ఇష్టం లేదు.

Updated : 29 Nov 2022 13:52 IST

విజయానికి షార్ట్‌కట్‌లు ఉండవు కానీ... పని పూర్తవ్వడానికి మాత్రం షార్ట్‌కట్‌లుంటాయి. మీరు రోజూ కంప్యూటర్‌లో వాడే క్రోమ్‌ బ్రౌజర్‌లో కొన్ని ఎక్స్‌టెన్షన్‌లు మీకు షార్ట్‌కట్‌లు అందిస్తాయి. క్రోమ్‌ స్టోర్‌లో ఉండే ఈ ఎక్స్‌టెన్షన్లను ఇన్‌స్టాల్‌ చేసుకొని క్రోమ్‌ బ్రౌజర్‌ను ఇంకాస్త కొత్తగా వాడేయొచ్చు.

ఒక్క క్లిక్‌తో

క్రోమ్‌ బ్రౌజర్‌లో పదుల సంఖ్యలో ట్యాబ్‌లు ఓపెన్‌ చేసి పెట్టారు. ఇంతలో ఎవరో స్నేహితుడు వచ్చాడు. ఆ వ్యక్తి మీ సెర్చ్‌ సమాచారం చూడటం మీకు ఇష్టం లేదు. దీంతో వెంటనే బ్రౌజర్‌ను క్లోజ్‌ చేసేశారు. మళ్లీ వాటిని ఓపెన్‌ చేయాలంటే చాలా సమయం పడుతుంది. అయితే మీ బ్రౌజర్‌లో Panicbutton ఎక్స్‌టెన్షన్‌ ఉంటే ఆ ఇబ్బంది నుంచి తప్పించుకోవచ్చు. దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకున్నాక బ్రౌజర్‌ కుడివైపున ఉండే ఈ ఎక్స్‌టెన్షన్‌ ఐకాన్‌ను క్లిక్‌ చేస్తే మీరు ఓపెన్‌ చేసిన ట్యాబ్‌లు క్లోజ్‌ అయిపోయి సాధారణ బ్రౌజర్‌ పేజీ కనిపిస్తుంది. మళ్లీ అదే ఐకాన్‌ను క్లిక్‌ చేస్తే క్లోజ్‌చేసిన ట్యాబ్‌లు ఓపెన్‌ అవుతాయి.
* https://goo.gl/6 TYwF3


నోట్‌ చేసుకోండి

 

క దాని కోసం సెర్చ్‌ చేస్తే వేరే సమాచారం దొరకడం, ఒక వీడియోను చూస్తుంటే మరో ఆసక్తికరమైన వీడియో కనిపించడం సహజం. వాటిని తర్వాత చూద్దామంటే ఆ వివరాలు గుర్తుంచుకోవడం కష్టమే. ఆ వీడియో లేదా వెబ్‌సైట్‌ వివరాల్ని సంక్షిప్త సమాచారంతో నోట్‌గా సేవ్‌ చేసుకోగలిగితే బాగుంటుంది కదా. Evernote Web Clipper ఎక్స్‌టెన్షన్‌తో ఆ పని చేయొచ్చు. దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకొని ఎవర్‌నోట్‌/జీమెయిల్‌ ఐడీతో లాగిన్‌ అవ్వండి. ఆ తర్వాత మీరు నోట్‌ చేసుకోవాలనుకునే ట్యాబ్‌లోకి వెళ్లండి. ఆక్కడ ఎవర్‌నోట్‌ ఐకాన్‌ను క్లిక్‌ చేస్తే ఎవర్‌నోట్‌లో ఆ సమాచారం సేవ్‌ అయిపోతుంది.
* https://goo.gl/MIYdka


పెద్ద ఫొటోలు సులభంగా

క్రోమ్‌ బ్రౌజర్‌లో ఫొటోలు వెతుకుతున్నప్పుడు థంబ్‌ నెయిల్స్‌ రూపంలో వివరాలు కనిపిస్తాయి. వాటిని క్లిక్‌ చేసి వ్యూ ఇమేజ్‌ ట్యాబ్‌ను ఓపెన్‌ చేస్తే పెద్ద ఫొటోలు కనిపిస్తాయి. అలా ప్రతి థంబ్‌నెయిల్‌ను ఓపెన్‌ చేయడం వల్ల సమయం వృథా అవుతుంది. Imagus ఎక్స్‌టెన్షన్‌తో ఈ ఇబ్బంది నుంచి తప్పించుకోవచ్చు. దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకున్న తర్వాత ఏదైనా వెబ్‌సైట్‌లోని బొమ్మలపై కర్సర్‌ను ఉంచితే అవి భూతద్దంలోలా పెద్దగా కనిపిస్తాయి దీని వల్ల ప్రతి థంబ్‌నెయిల్‌ను క్లిక్‌ చేసి ఫొటో ఓపెన్‌ చేయక్కర్లేదు.
* https://goo.gl/uYjROJ


పాస్‌వర్డ్‌ల సంగతి

రోజుకు కనీసం ఒక 50 వెబ్‌సైట్లను ఓపెన్‌ చేస్తుంటారా? ప్రతిసారి పాస్‌వర్డ్‌ ఇచ్చి ఓపెన్‌ చేయడానికి చాలా సమయం తీసుకుంటుందా? ఒకవేళ సేవ్‌ పాస్‌వర్డ్‌ చేద్దామంటే ఇతరులు ఎవరైనా ఆ సిస్టమ్‌ను ఓపెన్‌ చేస్తే వాడితే ఇబ్బంది! అలాంటప్పుడు మీ పాస్‌వర్డ్‌లను ఒక దగ్గర దాచి... అవసరమైనప్పుడు టైప్‌ చేయకుండా నేరుగా వాడుకోగలిగితే బాగుంటుంది కదా. LastPass: Free Password Manager ఎక్స్‌టెన్షన్‌తో ఆ పని చేయొచ్చు. దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకొని, అందులో ఖాతా ప్రారంభించాలి. ఆ తర్వాత ఏదైనా వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయినప్పుడు ఆ ఐడీ, పాస్‌వర్డ్‌ సేవ్‌ చేసుకోవాలా అని అడుగుతుంది. దానికి మీరు అంగీకరిస్తే ఆ ఐడీ, పాస్‌వర్డ్‌ అందులో భద్రంగా ఉంటాయి. తర్వాత ఎప్పుడైనా అదే వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేస్తే తన దగ్గరున్న వివరాలతో లాగిన్‌ అవ్వాలా అని అడుగుతుంది. అలా ఎన్ని వెబ్‌సైట్ల వివరాలైనా దాచుకోవచ్చు.
* https://goo.gl/37AOzm


ఆఫర్లు చెబుతుంది

న్‌లైన్‌ అంగడిలో షాపింగ్‌ చేస్తున్నారు... డబ్బుల చెల్లింపు ప్రక్రియ ప్రారంభించే ముందు ఆఫర్లు ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం అనిపిస్తుంది. అప్పుడు ఏవేవో వెబ్‌సైట్లు ఓపెన్‌ చేసి వెతుకుతారు. దీని వల్ల సమయం వృథా. ఈ ఇబ్బంది లేకుండా ఆ వివరాలు తెలిపే ఎక్స్‌టెన్షన్లు ఉన్నాయి. వాటిలో Honey ఒకటి. దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకొని ఓ ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయండి. ఆ తర్వాత పైన ఉండే హనీ ఎక్స్‌టెన్షన్‌ ఐకాన్‌ను క్లిక్‌ చేస్తే ఆ వెబ్‌సైట్‌లో ఉన్న ఆఫర్లు, డిస్కౌంట్ల వివరాలు కనిపిస్తాయి. ఆ ప్రోమో కోడ్‌లను వాడుకొని డబ్బుల చెల్లింపు ప్రక్రియను పూర్తి చేసేయండి.
* https://goo.gl/QEF0Cq


అర్థం... అనువాదం

అంతర్జాలంలో సమాచార శోధన చేస్తున్నప్పుడు ఏదైనా పదానికి అర్థం తెలియకపోతే ఏం చేస్తారు? దాన్ని కాపీ చేసుకొని వేరే ట్యాబ్‌లో గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌ లాంటి డిక్షనరీలోకి వెళ్లి ఆ పదాన్ని పేస్ట్‌ చేసి అర్థం చూస్తారు. అలా కాకుండా ఆ పదంపై కర్సర్‌ పెట్టగానే దాని అర్థం కనిపిస్తే బాగుంటుంది కదా. అయితే Google Dictionary ఎక్స్‌టెన్షన్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోండి. వెబ్‌సైట్‌ పేజీలో మీకు అర్థం తెలియాల్సిన పదాన్ని మౌస్‌ కర్సర్‌తో సెలెక్ట్‌ చేసుకోగానే పైన అర్థం కనిపిస్తుంది. లేదంటే ఎక్స్‌టెన్షన్‌పై క్లిక్‌ చేస్తే అందులో మీరు సెలెక్ట్‌ చేసిన పదం ఆటోమేటిక్‌గా చేరి దిగువ దాని అర్థాలు, వివరాలు కనిపిస్తాయి. ఇదే తరహాలో అనువాదం కోసం Google Translate ఎక్స్‌టెన్షన్‌ ఉంది.
* https://goo.gl/orLNtN
* https://goo.gl/jclLbk


తర్వాత చదువుకోవచ్చు

మాచారం కోసం చాలా వెబ్‌సైట్లు చూస్తుంటారు. అందులో దొరికిన సమాచారాన్ని కాపీ చేసి డాక్యుమెంట్‌లో పేస్ట్‌ చేసుకొని తర్వాత చదువుకుంటుంటారు. ఈ వ్యవహారం కాస్త సమయం తినేసేదే. మీకు కావల్సిన సమాచారం ఉన్న వెబ్‌సైట్‌లోని టెక్స్ట్‌, ఫొటోలను ఓ వరుసలో ఒక చోటకు చేర్చి తర్వాత చూసుకోగలిగితే బాగుంటుంది కదా. అంతర్జాలం లేనప్పుడు కూడా వాటిని చదువుకోగలిగితే ఇంకా మేలు కదా. Instapaper ఎక్స్‌టెన్షన్‌తో ఈ పని చేసుకోవచ్చు. దీని కోసం ఆ ఎక్స్‌టెన్షన్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకొని అందులో ప్రాథమిక వివరాలు ఇచ్చి ఓ ఖాతా తెరవండి. ఆ తర్వాత మీకు కావల్సిన సమాచారం ఉన్న వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేసి పైన ఉన్న ఇన్‌స్టాపేపర్‌ ఎక్స్‌టెన్షన్‌ ఐకాన్‌ను క్లిక్‌ చేయండి. ఆ పేజీలో సమాచారం, ఫొటోలు ఓ క్రమపద్ధతిలో మీ ఇన్‌స్టాపేపర్‌ ఖాతాలో చేరిపోతాయి. ఆ తర్వాత వెబ్‌సైట్‌లో ఎప్పుడైనా మీరు సేవ్‌ చేసుకున్న సమాచారాన్ని చదువుకోవచ్చు.
* https://goo.gl/QJtnqH


ఎమోజీలే ఎమోజీలు

  ఛాటింగ్‌లో ఎమోజీలది ఎప్పుడూ ప్రత్యేక స్థానమే. పదాలతో చెప్పలేని భావం ఎమోజీలతో సులభంగా చెప్పొచ్చు. క్రోమ్‌ బ్రౌజర్‌లో ఎమోజీలు వెతుక్కోవడానికి Emojione ఎక్స్‌టెన్షన్‌ ఉపయుక్తంగా ఉంటుంది. దీన్ని మీ బ్రౌజర్‌లో క్రోమ్‌ స్టోర్‌ నుంచి ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ఆ తర్వాత ఎక్కడైనా, ఎప్పుడైనా ఎమోజీ అవసరమైతే ఆ ఎక్స్‌టెన్షన్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేస్తే సరి. వివిధ రకాల రంగుల్లో వందల కొద్దీ ఎమోజీలు కనిపిస్తాయి. ఈ ట్యాబ్‌లో ఎమోజీని క్లిక్‌ చేస్తే అది కాపీ అయిపోయి మీకు అవసరమైన దగ్గర పేస్ట్‌ అయిపోతుంది. ఎమోజీ సైజు, పేస్ట్‌ అయ్యే విధానం వరకు అన్నింటినీ మీకు నచ్చినట్లు మార్చుకోవచ్చు.
* https://goo.gl/ S40gn8


తప్పొప్పులు చెబుతుంది

సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లలో పోస్టులు, ఈమెయిల్‌లో ఆంగ్లంలో టైప్‌ చేస్తున్నప్పుడు అక్షర దోషాలు, గ్రామర్‌ తప్పులు వస్తున్నాయా? ప్రతి వాక్యాన్ని ఒకటికి రెండుసార్లు చూసుకోవడం, అవసరమైతే గూగుల్‌ చేయడం లాంటివి సమయం తీసుకునేవే. అలా కాకుండా టైప్‌ చేస్తున్నప్పుడే అక్షర దోషాలు, వ్యాకరణంలో తప్పులు తెలిపే ఎక్స్‌టెన్షన్‌ ఒకటి ఉంది. అదే grammarly. దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకొని ఆ బ్రౌజర్‌లో ఎక్కడైనా టైప్‌ చేస్తే ఆ బాక్స్‌కు దిగువన ఆకుపచ్చ రంగులో ఓ గుండ్రపు గుర్తు కనిపిస్తుంది. దాన్ని క్లిక్‌ చేస్తే ఆ వాక్యం లేదా పేరాలో ఉన్న తప్పులు చూపిస్తూ, సరైన పదాలను సూచిస్తుంది. అంతేకాదు వాక్యంలోని పదాలపై డబుల్‌ క్లిక్‌ చేస్తే వాటి అర్థాలు కూడా చూపిస్తుంది.
* https://goo.gl/H6yUP



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని